విద్యా వ్యవస్థలో సంస్కరణలపై తప్పుడు ప్రచారం వద్దు..: సీఎం జగన్

Oct 13, 2022, 4:27 PM IST

అమరావతి : విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇలా   ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా ప్రభుత్వ పాఠశాలలపై వక్రీకరణలు స్థాయికి మించి చేస్తున్నాయన్నారు. సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదవలేక విద్యార్థులు స్కూల్ మానేస్తున్నారంటూ దుష్ప్రచారం ప్రారంభించారన్నారు. పిల్లల బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సింది పోయి ఇలా దుష్ప్రచారం చేయడం తగదని సీఎం జగన్ అన్నారు. పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు-నేడు కింద చేపట్టిన పనులపై అధికారులతో చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో  ఇప్పటివరకూ రూ.1120  కోట్లు కేవలం నాడు-నేడు కింద చేపట్టిన పనులకోసమే కేటాయించి విడుదల చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు ట్యాబ్‌లు ఇచ్చే స్కీంకు సంబంధించి పనులు వడివడిగా సాగుతున్నాయని... ఇప్పటికే లక్షన్నరకు పైగా ట్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు.