2025లో జరగనున్న మహా కుంభమేళ కోసం ప్రయాగరాజ్ లో చేపట్టాల్సిన ఏర్పాట్లుపై యోగి సర్కార్ దృష్టిసారించింది. విద్యుత్, రోడ్లు, నీరు వంటి మౌళిక సదుపాయాల ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా విద్యుత్ విషయంలో యోగి ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది.
ప్రయాగరాజ్ : వచ్చే ఏడాది 2025 లొ గంగా నది ఒడ్డునగల ప్రయాగరాజ్ (అలహాబాద్) లో మహా కుంభమేళా జరగనుంది. ఇందుకోసం ఇప్పటినుండే ఏర్పాట్లు చేస్తోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం... సన్నాహాలు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. యోగి ప్రభుత్వ ఆలోచన మేరకు కుంభమేళా ప్రాంతంలో విద్యుత్, రోడ్లు, నీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఇతరత్రా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ శాఖ కూడా పలు కొత్త విధానాలను అమలు చేస్తోంది.
విద్యుత్ కోతల బెడద లేకుండా కుంభమేళా
undefined
ప్రయాగరాజ్ కుంభమేళా పరిధిని పెంచడంతో పాటు అక్కడ అందుబాటులో ఉండే సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యంగా విద్యుత్ శాఖపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 4000 హెక్టార్లలో విస్తరించనున్న ప్రయాగరాజ్ కుంభమేళాకు గతంలో కంటే ఈసారి విద్యుత్ సరఫరా విధానం భిన్నంగా ఉండనుంది.
పూర్వాంచల్ విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ ఇంజనీర్ ప్రమోద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కుంభమేళా కోసం రూ.391.04 కోట్లతో శాశ్వత, తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి కుంభమేళాలో విద్యుత్ కోతల బెడద లేకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఈ మేరకు సౌరశక్తితో నడిచే హైబ్రిడ్ సోలార్ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
కుంభమేళాలో మొత్తం 2004 హైబ్రిడ్ సోలార్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. కుంభమేళా జరిగే ప్రాంతంలోని ప్రధాన కూడళ్లు, వంతెనల వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ లైట్ల కారణంగా కుంభమేళా ప్రాంతంలో ఎప్పుడూ వెలుతురు ఉంటుంది.
కుంభమేళా ప్రాంతంలో రాత్రిళ్లు కూడా పగటి వెలుతురు...
కుంభమేళా జరిగే ప్రాంతం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. పూర్వాంచల్ విద్యుత్ పంపిణీ సంస్థ వివరాల ప్రకారం.. కుంభమేళా ప్రాంతం మొత్తం 1543 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలను ఏర్పాటు చేయనెన్నారు... వీటిలో 1405 కిలోమీటర్ల మేర ఎల్టీ, 138 కిలోమీటర్ల మేర హెచ్టీ తీగలు ఉంటాయి. కుంభమేళా ప్రాంతంలో 85 తాత్కాలిక విద్యుత్ సబ్ స్టేషన్లు, 85 డీజిల్ జనరేటర్లు, 15 ఆర్ఎంయులు, 42 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు.
ఇక కుంభమేళాప్రాంతంలోని శిబిరాల్లో బస చేసే 4 లక్షల 71 వేల మందికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తారు. ఈ శిబిరాల్లో వెలుతురు కోసం 67 వేల స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేస్తారు. మేళా ప్రాంతంలోని అన్ని ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్లను కూడా ఏర్పాటు చేస్తారు. శిబిరాలు, రోడ్ల వెంబడి ఏర్పాటు చేసే ఈ లైట్లతో కుంభమేళా ప్రాంతం మొత్తం వెలుగులతో నిండిపోతుంది... రాత్రిళ్లు కూడా పగలులా వెలుతురు ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.