అయ్యా దొర సూడు... నువ్వు చేసిన బారుల, బీరుల తెలంగాణలో మహిళల రక్షణ: కేసీఆర్ పై షర్మిల ఫైర్

By Arun Kumar PFirst Published Sep 23, 2021, 4:44 PM IST
Highlights

నల్గొండ జిల్లా ముషంపల్లిలో మహిళపై జరిగిన హత్యాచారంపై స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సీరియస్ అయ్యారు. 

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో వివాహితపై ఇద్దరు తాగుబోతులు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. సైదాబాద్ చిన్నారి ఘటన మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడంపై దారుణమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై ఆమె విరుచుకుపడ్డారు. 

''6 ఏండ్ల పాపపై అత్యాచారం మరువకముందే తాగుబోతుల చేతిలో మరో యువతీ బలైపోయింది. దొరగారి పాలనలో గల్లీకో వైన్స్ , వీధికో బార్. ఎక్కడ చూసిన మద్యం ఏరులై పారుతుంది. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చిండు. 6 యేండ్ల పాప నుంచి 60 ఏండ్ల ముసలి అని చూడకుండా తాగిన మత్తులో మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే తనకేమీ పట్టనట్టుగా ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు'' అని షర్మిల మండిపడ్డారు.

''ఆడపిల్లల మాన ప్రాణాలను పణంగా పెట్టి మరీ మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో అటు లిక్కర్ ఆదాయంతో పాటు ఇటు మహిళల మీద అఘాయిత్యాలు 3 వందల రేట్లు పెంచిండు కేసీఆర్. అయ్యా దొర సూడు... నువ్వు చేసిన బారుల తెలంగాణ, బీరుల తెలంగాణలో మహిళల మాన ప్రాణాలకు దొరుకుతున్న రక్షణ'' అంటూ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు షర్మిల. 

read more  ముషంపల్లి ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ.. మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలోని ముషంపల్లి గ్రామంలో పట్టపగలే ఈ ఘోరమైన సంఘటన జరిగింది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న 54 ఏళ్ల వయస్సు గల మహిళను ఇద్దరు వ్యవసాయ కూలీలు ఇంట్లోకి లాక్కెళ్లి, వివస్త్రను చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. నిందితులిద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య, పుల్లయ్యలుగా గుర్తించారు. 

ఉదయం 11 గంటల ప్రాంతంలో రోడ్డు వెళ్తున్న మహిళను ఈ ఇద్దరు నిందితులు ఇంట్లోకి లాక్కెళ్లి  దారుణానికి ఒడిగట్టినట్లు నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి చెప్పారు. మహిళపై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు పారిపోయారు. పారిపోయే క్రమంలో వారికి మహిళ మరిది కనిపించాడు. ఆమె రోడ్డు మీద పడి ఉందని వారు అతనికి చెప్పారు. వారు చెప్పిన చోటికి అతను వెళ్లాడు. అయితే, వదిన కనిపించలేదు. దాంతో అతను లింగయ్య ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఆమెకు వదిన శవం కనిపించింది. తలపై, ఒంటిపై తీవ్రమైన గాయాలు అయినట్లు గుర్తించాడు. 

అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారం గాజులు, మూడు తులాల పుస్తెలతాడు అక్కడే పడి ఉన్నాయి. దాంతో నిందితులు దొంగతనం కోసం ఆ దారణానికి ఒడిగట్టలేదని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో వారు ఈ దారుణానికి పాల్పడినట్లు భావించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

గురువారం ఉదయం జిల్లా కేంద్రప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి జగదీష్ రెడ్డి మృతురాలి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతురాలి కుటుంబసభ్యులను మంత్రి  పరమార్శించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముషంపల్లి ఘటన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుగుతుందని ఆయన వెల్లడించారు. దుండగులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ తరహా ఘటనలపై ప్రజల్లో స్పందన రావాలని ఆయన పిలుపునిచ్చారు.  

click me!