మండుటెండల్లో తెలంగాణ పోలింగ్ ... ఈసీ అలర్ట్ ... ఓటర్లూ ఈ జాగ్రత్తలు తీసుకొండి...

By Arun Kumar PFirst Published May 2, 2024, 8:09 AM IST
Highlights

ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్న సమయంలో లోక్ సభ ఎన్నికల సమరం జరుగుతోంది. దీంతో ఓటర్ల కోసం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది...

హైదరాబాద్ : మరో పదిరోజుల్లో తెలంగాణలో పోలింగ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో అంటే మే 13న తెలంగాణ పోలింగ్ జరుగుతుంది. ఒకే విడతలో రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఎండల్లో ఓటర్లు ఇబ్బంది పడకుండా ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది.  

సాధారణంగా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం  గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇదే సమయాన్ని ఎలక్షన్ కమీషన్ ఫాలో అవుతోంది. అయితే తీవ్రమైన ఎండల కారణంగా తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పొడిగించింది ఈసి. మే 13న జరిగే లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఈసి వెల్లడించింది. ఇలా ఎండలో కాకుండా సాయంత్రం కొంత లేటయినా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఓటర్లకు కల్పించింది ఈసి. 

పోలింగ్ శాతాన్ని పెంచేందుకే ఎన్నికల సంఘం సమయాన్ని పెంచింది. తెలంగాణలో ప్రస్తుతం తీవ్రమైన ఎండలు, వడగాలులు కొనసాగుతున్న నేపథ్యంలో ఓటర్లు ఇళ్లనుండి బయటకు వస్తారా? అనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పూర్తయిన రెండు విడతల్లో తక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యింది. ఇందుకు మండుటెండలు కూడా ఓ కారణంగా తెలుస్తోంది.  అందువల్లే తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గకుండా వుండేందుకు సమయాన్ని పెంచింది ఎన్నికల సంఘం. 

ఉదయం 10 గంటలకే సూర్యుడి భగభగలు మొదలవుతున్నాయి... సాయంత్రం 5 గంటల వరకు ఈ వేడి తగ్గడంలేదు. దీంతో మధ్యాహ్నం  బయటకు వచ్చేందుకు ప్రజలు ఇష్టపడటం లేదు. మే 13న అంటే పోలింగ్ నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం వుంది. అందువల్లే ఎన్నికల సమయాన్ని పెంచి ఓటర్లకు వెసులుబాటు కల్పించింది ఈసి. అలాగే ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలంటూ ప్రజలను చైతన్యపరుస్తోంది ఈసి. 

పోలింగ్ వేళ ఈ జాగ్రత్తలు పాటించండి : 

1. ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే ఓటు హక్కు వినియోగించుకోండి. ఆ సమయంలో వాతావరణం చల్లగా వుండటంతో పాటు ఓటర్లు కూడా తక్కువగా వుంటారు. 

2. ఉదయం ఓటేయడం కుదరకుంటే సాయంత్రం సమయంలో ఓటు వేయడానికి వెళ్లండి. పోలింగ్ సమయాన్ని పెంచారు కాబట్టి కాస్త ఆలస్యమైనా ఓటు వేయవచ్చు. సాయంత్రం ఎండతీవ్రత తగ్గి వాతావరణం కాస్త చల్లబడుతుంది  కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం వుండదు. 

3. మధ్యాహ్న సమయంలో ఎండలు  మండిపోతున్నాయి. కాబట్టి ఆ సమయంలో ఓటు వేయడానికి వెళుతుంటే క్యాంప్ గానీ, కూలింగ్ గ్లాసెస్ గానీ ఉపయోగించాలి... మహిళలు ముఖానికి స్కార్ఫ్ లేదా చున్నీ కట్టుకుని వెళితే మంచిది. ఇంట్లోనే చల్లని నీరు  తాగి బయలుదేరాలి.  

4. పోలింగ్ బూత్ వద్ద క్యూలైన్ వుంటే ఎండలోనే వేచిచూడకుండా నీడలో వుండండి. 

5. వృద్దులు, వికలాంగులు ఇంటి నుండే ఓటుహక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఈసి కల్పించింది.  కాబట్టి ఎండల్లో పోలింగ్ బూత్ కు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. 

click me!