అన్ని రాజకీయ పార్టీలకు భిన్నంగా తెలంగాణలో మజ్లిస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లుతుంటుంది. ఆశ్చర్యకరంగా సీట్లనూ గెలుచుకుంటుంది. ఓల్డ్ సిటీలో పట్టు ఉన్న ఈ పార్టీ అధినేత ఒవైసీ మాటలే మ్యానిఫెస్టోగా పని చేస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణలో సందడి చేస్తున్నారు. బీఆర్ఎస్ పూర్తిగా క్యాంపెయిన్ పై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఇది వరకే ప్రచారాన్ని వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. 18వ తేదీన రాహుల్ గాంధీ ములుగులో సమర శంఖం పూరించనున్నారు. ఏ పార్టీ అయినా ప్రచారంలో లేదా ప్రచారానికి ముందే తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటిస్తాయి. తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తే పథకాలు, తీసుకునే నిర్ణయాల గురించి ఆ మ్యానిఫెస్టో పత్రంలో పేర్కొంటాయి. ఇది వరకే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు తమ మ్యానిఫెస్టోను ప్రకటించి బరిలోకి దూకాయి. అయితే, ఎంఐఎం పార్టీ తీరు మాత్రం భిన్నంగా ఉన్నది. ఈ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించకుండానే ఎలక్షన్‌లో పోటీ చేస్తున్నది. పోటీ చేయడమే కాదు.. సీట్లను గెలుచుకుంటున్నది కూడా. గత ఎన్నికల్లోనే కాదు, అంతకుముందు ఎన్నికల్లోనూ ఎంఐఎం పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించలేదు. ఈ సారి కూడా అదే పద్ధతిని అవలంభిస్తుందా? అనే చర్చ జరుగుతున్నది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ అమిన్ జాఫ్రీ అప్పటి సీఈవోకు రాసిన లేఖలో తాము మ్యానిఫెస్టో ప్రకటించలేదని తెలిపారు. తాము గత ఎన్నికల్లోనూ మ్యానిఫెస్టోను ప్రకటించలేదని వివరించారు.
1962లో సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ సారథ్యంలో ఎంఐఎం అసెంబ్లీ బరిలోకి ప్రవేశించింది. 1967నాటికి ముగ్గురు ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఆ తర్వాత పార్టీ రెండుగా విడిపోయింది. 2009, 2014లో ఎంఐఎం ఏడు నియోజకవర్గాల్లో గెలుపొందింది. 2018లోనూ ఏడుగురు అసెంబ్లీ స్థానాల్లో విజయం కైవసం చేసుకుంది. ఇవన్నీ ఎలాంటి మ్యానిఫెస్టో ప్రకటించకుండానే సాధించుకోవడం గమనార్హం.
Also Read: జనగామాలో కేసీఆర్ లౌకిక వచనాలు.. కాంగ్రెస్ ఎఫెక్టేనా?
మా పని.. మా అస్తిత్వం అని ఎంఐఎం పార్టీ నేతలు అంటారు.తమ పార్టీ పౌర, మైనార్టీ సమస్యలపై దృష్టి పెడుతుందని వివరిస్తుంటారు. పార్టీ అధికారంలోకి వస్తేనే మ్యానిఫెస్టోను అమలు చేయగలం అని తెలుపుతారు. స్వయంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేనందునే మ్యానిఫెస్టో ప్రకటించాల్సిన అవసరం లేదని ఆ పార్టీ వర్గాలు వివరించాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ ఎంఐఎంకు పట్టు అధికం. అదీ పాత నగరంలోనూ ఎంఐఎంకు బలమైన పట్టు ఉన్నది. గోషామహల్ మినహాయిస్తే చార్మినార్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, బహదూర్‌పురా, కార్వాన్, మలక్‌పేట స్థానాలు మజ్లిస్ పార్టీకి కంచుకోట వంటివి. ఈ ఎన్నికల్లోనూ ఎంఐఎం ఈ స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్‌తో ఎంఐఎంకు దోస్తీ ఉన్నది. హైదరాబాద్‌లోని మజ్లిస్ పార్టీకి మద్దతు ఉన్న స్థానాల్లో బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను నిలబెట్టగా.. మిగిలిన ప్రాంతాల్లో ముస్లింల ఓట్లను బీఆర్ఎస్ రాబట్టుకునే వ్యూహాన్ని ఈ పార్టీలు అమలు చేస్తున్నాయి.
Also Read: కేసీఆర్‌పై అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు.. మా సంపూర్ణ మద్దతు
ఓల్డ్ సిటీ పాలిటిక్స్ కొంచెం భిన్నంగా ఉంటాయి. దాదాపుగా ముస్లింలే ఉండే ఈ నియోజకవర్గాల ప్రజలు ఇతర పార్టీలను విశ్వసించడం చాలా అరుదు. ఇక్కడ ఒవైసీ మాటలే మ్యానిఫెస్టోగా పని చేస్తున్నాయి. అయితే.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ ఎంఐఎం విస్తరించాలని చూస్తున్న సందర్భంలో ఓల్డ్ సిటీ వెలుపల మ్యానిఫెస్టో లేకుండా బరిలోకి దిగడం మజ్లిస్ పార్టీకి సానుకూలంగా ఉండదేమో అని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.