జనగామాలో కేసీఆర్ లౌకిక వచనాలు.. కాంగ్రెస్ ఎఫెక్టేనా?
జనగామ సభలో సీఎం కేసీఆర్ లౌకిక వచనాలు పలికారు. రాష్ట్రంలో మతపరమైన చర్చ తేలిపోయి సంక్షేమ ఎజెండా ప్రధానంగా ముందుకు వచ్చింది. ఈ ఎన్నికల క్యాంపెయిన్‌లో అన్ని పార్టీలు సంక్షేమ ఎజెండానే ప్రధానంగా చేసుకుని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో సీఎం కేసీఆర్ లౌకికత్వంపై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సంక్షేమం ఎజెండాగా మారడానికి ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ దోహదం చేశాయి.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల శంఖారావాన్ని ఆయన హుస్నాబాద్ నుంచి నిన్న పూరించారు. నేడు జనగామాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ మొదటి సభలో కంటే కొంచెం దూకుడు పెంచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. ప్రధానంగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుంటూ ఆయన విమర్శలు చేసినా బీజేపీపైనా కామెంట్లు చేశారు.
తెలంగాణలో గత పదేళ్లుగా ఎలాంటి మతకల్లోలాలు జరగలేవని సీఎం కేసీఆర్ జనగామా సభలో పేర్కొన్నారు. గంగా జమునా నదుల నీళ్లు కలిసి ఉన్నట్టుగానే, పాలు, నీళ్లు కలిసి ఉన్నట్టుగానే తెలంగాణలో హిందూ, ముస్లింలు కలిసి ఉన్నారని తెలిపారు. ఇక పైనా ఇలాగే మత సామరస్యంతో కలిసి ఉండాలని సూచించారు. కొందరు మతపరమైన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారని, అలాంటి వారిని పట్టించుకోవద్దని పరోక్షంగా బీజేపీపై విసుర్లు సంధించారు.
మొన్నటి గణపతి నిమజ్జనాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. గణపతి నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీలు రెండూ ఒకే రోజున వచ్చాయని పేర్కొన్నారు. రెండూ ఒకే రోజు వచ్చినందున ఉభయ మతస్తులు ఊరేగింపులు చేస్తే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదని ముస్లిం మత పెద్దలు స్వయంగా వారి ఊరేగింపును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. వారికి ఎవరూ వాయిదా వేసుకోవాలని చెప్పలేదని అన్నారు. గ్రామాల్లో కుల, మత భేదాలు ఉండవని, వరసలు పెట్టుకుని కల్మషం లేకుండా పిలుచుకుంటారని పేర్కొన్నారు. కేసీఆర్ బతికి ఉన్నంత కాలం తెలంగాణ లౌకికంగానే ఉంటుందని వివరించారు.
Also Read: కేసీఆర్‌పై అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు.. మా సంపూర్ణ మద్దతు
కొన్ని నెలల క్రితం వరకు తెలంగాణలో మతపరమైన చర్చ, వాదోపవాదాలు అధికంగా జరిగాయి. ఒక వైపు ఎంఐఎం మద్దతు తీసుకుంటూనే కేసీఆర్ కూడా తనను తాను హిందువుగా చెప్పుకోవడం ఎక్కడా వెనుకడుగు వేయలేదు. కానీ, ఇప్పుడు తెలంగాణ పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. గతంలో కంటే కాంగ్రెస్ వేగంగా ఫామ్‌లోకి వచ్చింది. దీంతో మతపరమైన చర్చ పక్కకు పోయి సంక్షేమం కేంద్రంగా ప్రచారం ఊపందుకుంది. ఈ మార్పునకు కొంత సెక్యులర్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ దోహదపడిందని అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంలోనే కేసీఆర్ సెక్యులర్ కామెంట్లు చేయడం గమనార్హం. మొదటి నుంచీ ఆయన హిందూ ముస్లింల ఐక్యత గురించి, హైదరాబాద్‌లో శాంతి భద్రతల కొనసాగడం గురించి ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎన్నికల క్యాంపెయిన్‌లోనూ లౌకిక వచనలు ప్రముఖంగా చెప్పడం మారిన పరిస్థితులను సూచిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అది అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రధాన అస్త్రంగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ప్రధానంగా సంక్షేమ ఎజెండానే తీసుకుంది. దీంతో మతపరమైన చర్చకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. అయితే.. సీట్ల విషయమై కుల పంచాయతీలు ఇంకా ఉన్నాయి.
ఈ నెల 18వ తేదీ నుంచి కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం కానుంది. అగ్రనేత రాహుల్ గాంధీ ములుగు నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.