2018 క్రైమ్ రౌండప్: నరబలి, ప్రమాదాలు, సెక్స్ రాకెట్, హత్యలు

By Arun Kumar PFirst Published Dec 31, 2018, 5:10 PM IST
Highlights

2018 సంవత్సరంలో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు తెలంగాణలో తీవ్ర విషాదాన్ని నింపాయి. అలాగే ఈ ఏడాది మొదట్లో నల్గొండ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ భర్త హత్య రాజకీయ దుమారాన్ని రేపింది. ఇక అదే నల్గొండ జిల్లాలోని ప్రముఖ్య పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బయటపడ్డ సెక్స్ రాకెట్ కేసులో చిన్న పిల్లలను ఈ రొంపిలోకి లాగుతున్నారనే సంచలన నిజాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక ఈ టెక్నాలజీ యుగంలో కూడా క్షుద్ర పూజల పేరుతో ఓ చిన్నారిని బలి ఇచ్చిన ఘటన హైదరాబాద్ లో బయటపడింది.  

2018 సంవత్సరంలో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు తెలంగాణలో తీవ్ర విషాదాన్ని నింపాయి. అలాగే ఈ ఏడాది మొదట్లో నల్గొండ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ భర్త హత్య రాజకీయ దుమారాన్ని రేపింది. ఇక అదే నల్గొండ జిల్లాలోని ప్రముఖ్య పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బయటపడ్డ సెక్స్ రాకెట్ కేసులో చిన్న పిల్లలను ఈ రొంపిలోకి లాగుతున్నారనే సంచలన నిజాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక ఈ టెక్నాలజీ యుగంలో కూడా క్షుద్ర పూజల పేరుతో ఓ చిన్నారిని బలి ఇచ్చిన ఘటన హైదరాబాద్ లో బయటపడింది. ఇలా ఈ 2018 లో చోటుచేసుకున్న సంచలన ఘటనల గురించి ప్రత్యేక స్టోరీ.

ఉప్పల్ నరబలి కేసు

ఓ వైపు హైదరాబాద్ ఐటీ, టెక్నాలజీ రంగంలో దూసుకుపోతుండగా...మరోవైపు ప్రాచీన అనాగరిక ఆటవిక సాంప్రదాయాలు, నమ్మకాలకు నిలయంగా మారింది. ఇలా  మూడనమ్మకాలకు ఓ చిన్నారి బలైన సంఘటన హైదరాబాద్ శివారులోని ఉప్పల్ లో చోటుచేసుకుంది. 

ఉప్పల్ చిలుకానగర్ లో రాజశేఖర్ అనే వ్యక్తి  కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఇతడికి శ్రీలత అనే యువతితో పెళ్లయి చాలా ఏళ్ళయినా సంతానం మాత్రం కలగలేదు. దీంతో ఇతడు సంతానం కోసం మంత్రగాళ్లను ఆశ్రయించి వారి సలహాల మేరకకు క్షుద్ర పూజలు చేయడం ప్రారంభించాడు. 

ఈ క్రమంలోనే ఓ తాంత్రికుడి సలహా మేరకు నరబలి పేరుతో ఓ చిన్నారిని బలితీసుకున్నాడు. జగిత్యాల పట్టణానికి దగ్గరలోని ఓ గిరిజన తండా నుంచి బాలికను కొనుగోలు చేసిన రాజశేఖర్ చిలుకానగర్ లోని ఇంట్లోనే క్షుద్ర పూజలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పూజలో భాగంగా చిన్నారిని బలి ఇచ్చి తలను, మొండాన్ని వేరుచేశారు..  అనంతరం బాలిక తలను తాము నివాసముండే ఇంటిపై, మొండాన్ని నాచారం లక్ష్మీ ఇండస్ట్రీస్ సమీపంలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.  

మొత్తానికి ఫింగర్ ప్రింట్స్, డీఎన్ఏ పరీక్షల ఆదారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. సంతానం కోసం ఓ తల్లికి కడుపుకోతను మిగిల్చిన రాజశేఖర్ దంపతులు  కటకటాలపాలయ్యారు. 

యాదాద్రి సెక్స్ రాకెట్

తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరి గుట్టలో బయటపడ్డ సెక్స్ రాకెట్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అక్కడ వ్యభిచార గృహ నిర్వహకులు చిన్నారులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలియడంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. 

ఈ సెక్స్ రాకెట్లో పోలీసుల  విచారణలో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటపడ్డాయి. వివిధ ప్రాంతాల నుండి చిన్నారులను కిడ్నాప్ చేసి యాదగిరి గుట్టకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా చిన్నారులను లైంగికంగా సిద్దం చేయడానికి ప్రత్యేకమైన వైద్య పద్దతులు వాడినట్లు తెలిసింది. అందుకు వ్యభిచార గృహ నిర్వహకులకు సహకరిస్తున్న ఓ డాక్టర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇక మైనర్ బాలికలతో వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ మహిళలపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. చిన్నారులను వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారనే ఆరోపణలతో నలుగురు మహిళలపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.  
 
 
మూసినదిలో ట్రాక్టర్ బోల్తా పడి కూలీల మృతి  

ఇదే యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. వలిగొండ మండలం వేములకొండలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో 15 మంది కూలీలను బలితీసుకుంది. వెంకటనారాయణ అనే కౌలు రైతు వ్యవసాయ భూమిలో పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వ్యవసాయ కూలీలను తీసుకు వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి వేములకొండ గ్రామ శివారు ల‌క్ష్మాపురం వద్ద ఉన్న మూసీ కాల్వలో బోల్తా పడటంతో తీవ్ర ప్రాణ నష్టం  సంభవించింది. ఈ ఘటనలో కడింగుల లక్ష్మీ, లక్ష్మి కూతురు అనూష, ఇంజమురి లక్ష్మమ్మ, ఇంజమురి శంకరమ్మ, అంబల రాములమ్మ, చుంచు నర్మదా, కందల భాగ్యమ్మ, ఏనుగుల మాధవి, జడిగి మారమ్మ, పంజల భాగ్యమ్మ, బిసు కవిత, బంధారపు స్వరూప, గానేబోయిన అండాలు, అరూర్ మణెమ్మ, ఓ చిన్నారి బాలుడు ఇలా 15 మంది కూలీలు మృతిచెందారు. మరో 16 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. 

ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తేల్చారు. దీంతో అతన్ని అతని అరెస్ట్ చేశారు. 


కొండగట్టు బస్సు ప్రమాదం

ఈ సంవత్సరం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసి బస్సు ప్రమాదంలో 60 మంది ప్రయాణికులు మృతి చెందారు.  చాలా మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. 

అసలే బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు...ఆపై ఘాటు రోడ్డుపై ప్రయాణం వెరసి ప్రమాదానికి కారణమయ్యాయి. దీనికి తోడు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా తోడవడంతో ప్రమాదం స్థాయి మరింత పెరిగింది. ఘాట్ రోడ్డుపై బస్సు అదుపుతప్పగానే డ్రైవర్ ఎమర్జెన్సీలో ఉపయోగించే హ్యాండ్‌ బ్రేక్‌ను ఉపయోగించక పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి కారణాలేమైతేనేం 60 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి.   


 
నల్గొండ కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య

నల్గొండ పట్టణంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరుడు, కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్య రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన నల్గొండ జిల్లా రాజకీయాలను వేడెక్కించింది.  

నల్గొండ పురపాలిక ఛైర్‌ పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మి భర్త  శ్రీనివాస్‌ ను అర్థరాత్రి సమయంలో ఆయన ఇంటికి సమీపంలోనే కొందరు గుర్తు తెలియని దుండగులు బండ రాయితో మోది  ఘాతుకానికి పాల్పడ్డారు. మురుగు కాల్వలో మృతదేహం పడేసి దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. అయితే ఈ హత్య రాజకీయ కక్షసాధింపుతోనే జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపించడంతో సంచలనంగా మారింది. 

అప్పటి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశమే ఈ హత్య చేయించినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.  తమను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేకనే దొంగచాటుగా కుట్ర పన్ని శ్రీనివాస్‌ ప్రాణం తీశారని ఆయన మండిపడ్డారు. కోమటిరెడ్డితో పాటు మృతుడి భార్య కూడా వీరేశంపై అనుమానం వ్యక్తం చేయడంతో ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

click me!