IndvsPak: ఆ విజయానికి సరిగ్గా 13 ఏళ్లు... దాయాదిపై భారత్ బౌల్- అవుట్ విక్టరీ...

By team teluguFirst Published Sep 14, 2020, 3:19 PM IST
Highlights

మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ బాల్-అవుట్ విక్టరీకి 13 ఏళ్లు...

ఉత్కంఠభరిత ‘టై’ మ్యాచులో అపూర్వ విజయం సాధించిన ధోనీ సేన...

క్రికెట్ ప్రపంచంలో ధోనీ శకం ప్రారంభమైన మ్యాచ్‌గా అభివర్ణించిన విశ్లేషకులు...‌

142 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ జట్టు, భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక భారత జట్టుదే విజయం అనుకున్నారంతా... అయితే పాక్ బ్యాట్స్‌మెన్ మిస్బా వుల్ హక్ అసాధారణ పోరాటంతో ఆకట్టుకున్నాడు. 53 పరుగులు చేసిన మిస్బా... టెయిలెండర్లతో కలిసి విజయం అంచుల దాకా తెచ్చాడు. ఆఖరి ఓవర్‌లో పాక్ విజయానికి 12 పరుగులు కావాలి. శ్రీశాంత్ వేసిన ఆ చివరి ఓవర్ మొదటి నాలుగు బంతుల్లోనే రెండు ఫోర్లు రావడంతో 11 పరుగులు వచ్చేశాయి. రెండు బంతుల్లో ఒక్క  పరుగు మాత్రమే కావాలి. ఐదో బంతి డాట్... పరుగులేమీ లేదు. చివరి బంతికి సింగిల్ తీయబోయిన మిస్బా... రనౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. 

ఫలితం తేల్చేందుకు బౌల్- అవుట్ పద్ధతిని ఎంచుకున్నారు అంపైర్లు. ఫుట్‌బాల్ మాదిరిగా ఇరుజట్ల నుంచి క్రికెటర్లు వికెట్లను పడగొట్టాల్సి ఉంటుంది. ఇక్కడే భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన చమత్కారాన్ని ప్రదర్శించాడు. వికెట్ల వెనకాలే కూర్చొని, తన వైపు సూటిగా వేయాల్సిందిగా జట్టు సభ్యులకు సూచించాడు. మొదటి బంతిని అందుకున్న వీరేంద్ర సెహ్వాగ్... క్లీన్ బౌల్డ్ చేశాడు. పాక్ నుంచి అర్ఫత్ వేసిన బంతి వికెట్లను తాకలేదు. రెండో బంతి అందుకున్న భజ్జీ, గూగ్లీతో వికెట్లను పడేశాడు... పాక్ స్టార్ బౌలర్ ఉమర్ గుల్ వేసిన బంతి వికెట్లకు చాలా దూరంగా వెళ్లింది.

మూడో బంతి వేసిన రాబిన్ ఊతప్ప, వికెట్లను కిందపడేసి తన టోపీ తీసి సెల్యూట్ చేశాడు. పాక్‌కు మరో అవకాశం రావాలంటే ఈసారి వికెట్లను కచ్ఛితంగా పడేయాల్సి ఉంటుంది. బాల్ అందుకున్న షాహిదీ ఆఫ్రిదీ వికెట్లను మిస్ అయ్యాడు. 3-0 తేడాతో విజయాన్ని దక్కించుకున్న భారత్, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఇరు జట్లు మరోసారి ఫైనల్‌లో తలబడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లోనూ భారత విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఐసీసీ ట్వీట్ చేసిన వీడియో చూసేందకు ఇక్కడ క్లిక్ చేయండి...

 

click me!