RCB vs GT: ఐపీఎల్ 2024 52వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ ఇన్నింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Bangalore vs Gujarat : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ 52వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. విరాట్ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మరోసారి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి సొంత మైదానంలో 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది.
ఆర్‌సీబీకి ఇది వరుసగా మూడో విజయం కాగా, గుజరాత్ హ్యాట్రిక్ ఓటములతో డీలా పడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు షారుక్ ఖాన్ (37 పరుగులు), డేవిడ్ మిల్లర్ (30 పరుగులు), రాహుల్ తెవాటియా (35 పరుగులు) రాణించడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ (42 పరుగులు), ఫాఫ్ డు ప్లెసిస్ (64 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో 13.4 ఓవర్లలోనే విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ బిగ్ జంప్ ను సాధించింది.
పాయింట్ల పట్టికలో ఆర్సీబీ దూసుకెళ్లింది..
ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది నాలుగో విజయం. ఈ విజయంతో ఆ జట్టు 8 పాయింట్లుతో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఐపీఎల్ 2024 లో ఆర్సీబీ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా, 7 ఓటములను చవిచూసింది. గుజరాత్‌పై విజయంతో ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది. బెంగళూరు 3 స్థానాలు ఎగబాకి పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్‌లను వెనక్కు నెట్టింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు 6 పాయింట్లతో చివరి స్థానానికి చేరుకుంది.
గుజరాత్ పై ఆర్సీబీ దండయాత్ర.. ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ దెబ్బకు జీటీ బౌలర్లు విలవిల