MI vs KKR Highlights : బౌల‌ర్ల హ‌వా.. ముంబై ఇండియ‌న్స్ ఫ్లాప్ షో.. కేకేఆర్ కు 7వ గెలుపు

By Mahesh Rajamoni  |  First Published May 4, 2024, 12:39 AM IST

MI vs KKR: ఐపీఎల్ 2024 51వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ 24 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఈ విజయంతో కేకేఆర్‌కు 14 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరుకునే రేసులో మ‌రింత ద‌గ్గ‌రైంది. ముంబై జ‌ట్లు ఫ్లేఆప్ రేసు నుంచి ఔట్ అయింది.
 


MI vs KKR Highlights : ఐపీఎల్ 2024 51వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ త‌ల‌ప‌డ్డాయి. శ్రేయాస్ అయ్యర్ నాయ‌క‌త్వంలోని కేకేఆర్ 24 ప‌రుగుల తేడాతో హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ ను చిత్తుచేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ 2024 లో బ్యాటింగ్ మెరుపులు చూడ‌గా,  ఈ మ్యాచ్ లో బౌల‌ర్ల హ‌వా కొన‌సాగింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ చేసిన ముంబై 169 పరుగులకే కేకేఆర్‌ను ఆలౌట్ చేసింది.  కేకేఆర్ తరఫున వెంకటేష్ అయ్యర్ అత్యధికంగా 70 పరుగులు చేశాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ ఓవర్లు మొత్తం ఆడకుండానే 145 పరుగులకే కుప్పకూలారు. ముంబై తరఫున సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ సాధించారు. 56 పరుగుల సూర్య ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు. ఈ సీజన్‌లో కేకేఆర్‌కి ఇది 7వ విజయం కాగా, ముంబై జట్టు 11 మ్యాచ్‌ల్లో 8వ మ్యాచ్‌లో ఓడిపోయింది.

ముంబై ఫ్లాప్ షో.. 

Latest Videos

కేకేఆర్ ఇచ్చిన 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి మంచి శుభారంభం ల‌భించ‌లేదు. జట్టు స్కోరు 71 పరుగుల వద్ద ఆరు వికెట్లు పడిపోయాయి. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయ‌ర్లు వ‌రుస‌గా ఔట్ అయి పెవిలియ‌న్ లో కూర్చున్నారు. సూర్యకుమార్ యాదవ్ మ‌రో ఎండ్ లో మ‌రోసారి హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ముంబైకి విజ‌యాన్ని అందించే ఇన్నింగ్స్ ను ఆడ‌లేకపోయాడు. 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వ‌ద్ద ఔట్ అయ్యాడు. అతడికి తోడు టిమ్ డేవిడ్ 24 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లు పూర్తిగా ఫ్లాప్‌ అయ్యారు. దీంతో ముంబై జట్టు 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది.

మిచెల్ స్టార్క్ సూప‌ర్ బౌలింగ్

రూ.24.75 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి నలుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియ‌న్ కు పంపాడు. 3.5 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు. ఇషాన్ కిషన్ (13 పరుగులు), టిమ్ డేవిడ్ (24 పరుగులు), పియూష్ చావ్లా (0 పరుగులు), గెరాల్డ్ కోయెట్జీ (8 పరుగులు)లను స్టార్క్ తన బౌలింగ్ లో ఔట్ చేశాడు. స్టార్క్‌తో పాటు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో 2 వికెట్లు తీశారు.

కేకేఆర్ హీరోలుగా వెంకటేష్-మనీష్ పాండేలు..

తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ జట్టు కూడా వ‌రుస‌గా వికెట్లు కోల్పోయి కష్టాల్లో ప‌డింది. అయితే, వెంకటేష్ అయ్యర్, మనీష్ పాండే త‌మ ఇన్నింగ్స్ తో జ‌ట్టుకు గౌర‌వ‌ప్ర‌దమైన స్కోర్ ను దాటించారు.  6 మంది బ్యాట్స్‌మెన్ 57 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. దీని తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన మనీష్ పాండే, అయ్యర్‌తో కలిసి ఏడో వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. 52 బంతులు ఎదుర్కొన్న వెంకటేష్ 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేయగా, మనీష్ పాండే 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. ఆ జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్‌లు ఎవ‌రూ రాణించ‌లేక‌పోయారు.

బుమ్రా-తుషారా అద్భుతమైన బౌలింగ్

తొలుత బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారలు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇరువురు 3-3 వికెట్లు తీసుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, పీయూష్ చావ్లాకు ఒక వికెట్ దక్కింది.

click me!