IOA-IOC భేటీలో అభినవ్ బింద్రా కీలకాంశాలపై చర్చ.. పారదర్శకత, నిర్ణయాధికారంలో అథ్లెట్ల ప్రాతినిధ్యానికి డిమాండ్

By Mahesh KFirst Published Sep 27, 2022, 8:51 PM IST
Highlights

స్విట్జర్లాండ్‌లో ఐవోఏ, ఐవోసీ మధ్య భేటీ జరిగింది. ఇందులో ఐవోఏ తరఫున ఒక సభ్యుడిగా అభినవ్ బింద్రా పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన ట్విట్టర్ అకౌంట్‌లో తన స్టేట్‌మెంట్ పోస్టు చేశారు. తన స్టేట్‌మెంట్‌లో భావి భారత క్రీడాకారుల కోసం ఐదు అంశాలను లేవనెత్తారు.
 

న్యూఢిల్లీ: ఇండివిడ్యువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచిన ఏకైక భారత క్రీడాకారుడు అభినవ్ బింద్రా.. క్రీడాకారుల భవిష్యత్ కోసం కీలక అంశాలను లేవనెత్తారు. ప్రభుత్వ పరమైన లోపాలు ఉన్నా.. సస్పెన్షన్, గుర్తింపు పొందకపోవడం లేదా ఇతర ఏ ఆంక్షలు వచ్చినా.. నష్టపోయేది క్రీడాకారులే అని స్పష్టంగా చెప్పారు.

స్విట్జర్లాండ్‌లోని సుసానేలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) హెడ్ క్వార్టర్ ఉన్నది. ఈ హెడ్ క్వార్టర్‌లో ఐవోసీ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ), కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం జరిగింది. భారత ఒలింపిక్ కమిటీ గురించి ఈ సమావేశం జరిగింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ ఏడాది చివరిలోపు ఎన్నికలు నిర్వహించుకోకుంటే సస్పెన్షన్ వేటు విధిస్తామని ఐవోసీ ఈ నెల 8వ తేదీన హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఐవోసీ, ఐవోఏ మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐవోఏ తరఫున సభ్యుడిగా అభినవ్ బింద్రా హాజరై కీలక విషయాలను లేవనెత్తారు. అనంతరం, తన స్టేట్‌మెంట్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

‘భారత క్రీడా విభాగానికి ఇది ఎగ్జయిట్‌మెంట్ టైమ్. 2020 టోక్యో ఒలింపిక్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే, అందుకు తగ్గటు ప్రభుత్వ మద్దతు కూడా మంచి స్థాయిలో అందింది’ అని పేర్కొన్నారు. ‘క్రీడా ప్రపంచంలో భారత్ వెలుగొందనికి ఇది సరైన సమయం. ఇప్పుడే క్రీడా ప్రపంచంలో మనం ప్రయాణం ప్రారంభించినట్టుగా చాలా మంది భావిస్తున్నారు. ఈ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి బలమైన, బాధ్యతాయుతమైన, నైపుణ్యమైన, స్వయంప్రతిపత్తి గల వ్యవస్థాగత నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉన్నది’ అని తెలిపారు.

For the media and sports fans contacting me here is my statement from the athletes perspective at the Joint meeting of the IOC- IOA-GOI at Lausanne earlier today ! pic.twitter.com/VZniMYWA3C

— Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra)

ఈ మేరకు ఆయన ప్రముఖంగా ఐదు విషయాలను లేవనెత్తారు. అవి స్థూలంగా ఇలా ఉన్నాయి. మొదటి విషయం.. నిర్ణయాధికారంలో క్రీడాకారుల ప్రాతినిధ్యం ఉండాలి. హక్కులు, బాధ్యతలోనూ వారి రిప్రజెంటేషన్ ఉండాలి. ఎందుకంటే క్రీడాకారుల సమస్యలు వినాలి, అర్థం చేసుకోవాలి. వాటి పరిష్కారాలు నిర్ణయాల్లో ప్రస్ఫుటం కావాలి. వర్కింగ్ గ్రూప్ నుంచి జనరల్ అసెంబ్లీలు, ఎగ్జిక్యూటివ్ బోర్డుల వరకు ప్రతిస్థాయిలో క్రీడాకారుల ప్రాతినిధ్యం ఉండాలి. పురుషులు, మహిళల ప్రాతినిధ్యం ఉండాలి.

రెండో అంశం.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌లో ఎవరికి పడితే వారికి సభ్యత్వం ఇవ్వరాదు. ఓటు చేసే హక్కు ఇవ్వరాదు. ఐవోఏ జవాబుదారీకి ఇది అత్యవసరం. ఓటింగ్‌లో పాల్గొనేవారు తప్పకుండా ఒలింపిక్ చార్టర్, స్పోర్ట్స్ కోడ్‌కు లోబడి ఉండాలి. 

మూడో విషయం.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ రాజ్యాంగంలో అధికారులు, బాధ్యతలను స్పష్టపరిచే నిబంధనలు ఉండాలి. ఐవోఏ జనరల్ బాడీ, ఎక్స్ కో, ఆఫీస్ బేరర్లు, కమిషన్లు, కమిటీల అధికారాలు, బాధ్యతలు విస్పష్టంగా ఉండాలి.

నాలుగో అంశం నిర్వహణ, ఆర్థిక సమగ్రత, పారదర్శకతకు సంబంధించింది. నిర్ణయాలు జవాబుదారీగా, పారదర్శకంగా ఉండేలా ఐవోఏ రాజ్యాంగ నిర్మాణం ఉండాలి. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ ఆడిట్లు, రిపోర్టింగ్, పబ్లిక్ ట్రాన్స్‌పరెన్సీలు ఉండాలి.

ఐదో విషయం.. వివాద పరిష్కారం, క్రీడాకారుల సంక్షేమానికి వ్యవస్థాగత నిర్మాణం ఉండాలి. ఐవోఏ వ్యవస్థాగత నిర్మాణం కచ్చితత్వంతో అమలు చేయాలి. వివాద పరిష్కార చాంబర్, అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారులు, వెల్ఫేర్, సేఫ్ గార్డింగ్ అధికారులు, ఇతర పోస్టులు ఇందులో ఉంటాయి.

click me!