KKR vs PBKS : బెయిర్‌స్టో సూప‌ర్ సెంచ‌రీ.. కోల్‌కతా పై గెలుపుతో పంజాబ్ కింగ్స్ స‌రికొత్త రికార్డు

By Mahesh Rajamoni  |  First Published Apr 27, 2024, 12:52 AM IST

KKR vs PBKS : టీ20 క్రికెట్‌లో 262 పరుగుల రికార్డు స్కోరును పంజాబ్ ఛేదించింది. జానీ బెయిర్ స్టో, శశాంక్ సింగ్ సూప‌ర్ ఇన్నింగ్స్ ల‌తో కోల్ క‌తా పై పంజాబ్ విజ‌యం సాధించి ఐపీఎల్ లో స‌రికొత్త రికార్డు సృష్టించింది.  
 


KKR vs PBKS : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024 42వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో ప‌రుగుల వ‌ర‌ద పారింది. సిక్స‌ర్లు, ఫోర్ల వ‌ర్షం కురిసింది. కేకేఆర్ సాధించిన భారీ ప‌రుగుల‌ను పంజాబ్‌కు చెందిన జానీ బెయిర్‌స్టో, శశాంక్ సింగ్ తుఫాను బ్యాటింగ్ తో టీ20 క్రికెట్ లో అతిపెద్ద పరుగును ఛేదించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ సునీల్ నరైన్ (71 పరుగులు), ఫిలిప్ సాల్ట్ (75 పరుగులు) హాఫ్ సెంచరీలతో 20 ఓవర్లలో 261/6 స్కోరు చేసింది.

భారీ టార్గెట్ తో బ‌రిలోకి పంజాబ్ కింగ్స్ బ్యాట‌ర్స్ సూప‌ర్ ఇన్నింగ్స్ ను ఆడారు.  జానీ బెయిర్‌స్టో అజేయంగా 108 పరుగులతో సెంచ‌రీ సాధించాడు. శశాంక్ సింగ్ అజేయంగా 68 పరుగులతో కేకేఆర్ నుంచి మ్యాచ్ ను పంజాబ్ కు తీసుకువ‌చ్చాడు. మ‌రో 8 బంతులు మిగిలి ఉండగానే 262 పరుగులతో భారీ టార్గెట్ ను అందుకుంది. టీ20 క్రికెట్ లో చారిత్రాత్మ‌క విజ‌యం అందుకుంది.

Latest Videos

బెయిర్‌స్టో-శశాంక్ తుఫానీ ఇన్నింగ్స్

262 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించి తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం జానీ బెయిర్‌స్టో, ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ మధ్య జరిగింది. 20 బంతుల్లో 54 పరుగులు చేసి ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అవుటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ప్రభ్ సిమ్రన్ ఔటైన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రిలీ రూసో 26 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆ త‌ర్వాత జట్టులో ఎటువంటి వికెట్ పడలేదు. శశాంక్ సింగ్ బెయిర్‌స్టోతో కలిసి పంజాబ్‌ను చారిత్రాత్మకంగా విజయం వైపు న‌డిపించాడు. బెయిర్‌స్టో బ్యాట్‌తో 48 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేశాడు. అదే సమయంలో శశాంక్ 28 బంతుల్లో 68 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. త‌న ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.

 

For his phenomenal show with the bat in a record chase, Jonny Bairstow bags the Player of the Match Award 🏆

Scorecard ▶️ https://t.co/T9DxmbgIWu | pic.twitter.com/G3HVTUmOJF

— IndianPremierLeague (@IPL)

 

కేకేఆర్ బౌలింగ్ ను చిత్తుచేశారు.. 

ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లు దారుణంగా దెబ్బతిన్నారు. ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్ లు భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు బౌలర్లు 2-2 ఓవర్లు బౌలింగ్ చేసి 36-36 పరుగులు ఇచ్చారు. దుష్మంత చమీర 3 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చాడు. హర్షిత్ రాణా 4 ఓవర్లలో 61 పరుగులు స‌మ‌ర్పించుకున్నారు. బౌలర్లలో సునీల్ నరైన్ ఒక్కడే వికెట్ తీశాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చాడు. రమణదీప్ సింగ్ 4 బంతుల్లో 9 పరుగులు ఇచ్చాడు.

సునీల్ న‌రైన్, ఫిల్ సాల్ట్ సూప‌ర్ ఇన్నింగ్స్

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్‌కు 262 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్ లు చెలరేగి సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడారు. ఫిలిప్ సాల్ట్ 37 బంతుల్లో 75 పరుగులు (6 ఫోర్లు, 6 సిక్స్‌లు), సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులు (9 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో రాణించారు. వెంకటేష్ అయ్యర్ 23 బంతుల్లో 39 పరుగులు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 10 బంతుల్లో 28 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 12 బంతుల్లో 24 పరుగులు చేశారు. 5 పరుగుల వద్ద రింకూ సింగ్ ఔటయ్యాడు. రమణదీప్ సింగ్ 3 బంతుల్లో 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్ అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. సామ్ కర్రాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్‌లకు తలో వికెట్ దక్కింది.

KKR VS PBKS : కోల్ క‌తా సునామీ ఇన్నింగ్స్.. ఏడేండ్ల రికార్డు బ్రేక్

click me!