ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కెఎల్ రాహుల్ అరుదైన రికార్డ్ సాధించాడు. అద్భుత బ్యాటింగ్ తో రాహుల్, హుఢా రాణించడంతో రాజస్థాన్ ముందు లక్నో గౌరవప్రదమైన స్కోరు వుంచగలిగింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ కొనసాగుతోంది. లక్నో సూపర్ జాయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరుకు భారతరత్న అటల్ బిహరీ వాజ్ పేయ్ స్టేడియం వేదికయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన లోకల్ టీం లక్నోకు అద్భుత ఆరంభం లభించినా ఫినిషింగ్ మాత్రం సరిగ్గా చేయలేదు. దీంతో ఈజీగా 200 దాటుతుందని అనుకున్న లక్నో స్కోరు కాస్త 196 పరుగులకే ఆగిపోవాల్సి వచ్చింది.
లక్నో సూపర్ జాయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. ఆ తర్వాత గత మ్యాచ్ లో సెంచరీ వీరుడు స్టోయినీస్ ఇలా వచ్చి అలా డకౌట్ అయి వెనుదిరిగాడు. ఇలా కేవలం 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన లక్నో కష్టాల వైపు పయనిస్తుండగా కెఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్ ఆడాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన రాహుల్ కేవలం 48 బంతుల్లోనే 76 పరుగులు చేసాడు. అతడికి రాహుల్ హుడా (31 బంతుల్లో 50 పరుగులు) చక్కటి సహకారం అందించాడు. దీంతో 12 ఓవర్లలోనే 126 పరుగులు రాబట్టి బలమైన స్థానంలో నిలిచింది లక్నో.
అయితే క్రీజులో కుదురుకున్న హుడా, రాహుల్ ఔట్ కావడంతో లక్నో స్కోరు నెమ్మదించింది. చివర్లో రాజస్థాన్ బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేసారు. దీంతో లక్నో కేవలం 196 పరుగుల వద్దే ఇన్నింగ్స్ ముగించింది. రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ 2, బౌల్ట్ 1, అవేశ్ ఖాన్ 1, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.
కెఎల్ రాహుల్ అరుదైన రికార్డ్ :
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఓపెనర్ గా కెఎల్ రాహుల్ 4000 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. దీంతో ఐపిఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్ల జాబితాలో రాహుల్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఓపెనర్ గా అత్యధిక పరుగల రికార్డ్ శిఖర్ దావన్ (202 ఇన్నింగ్స్ లో 6362 పరుగులు) పేరిట వుంది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ 5909 పరుగులు, గేల్ 4480 పరుగులతో వున్నారు. కెఎల్ రాహుల్ తో పాటు విరాట్ కోహ్లీ 4041 పరుగులతో సమానంగా నిలిచారు.