పాడి పశువుల పండగ.. కనుమ విశిష్టత ఇదే

By telugu team  |  First Published Jan 11, 2020, 12:26 PM IST

సంక్రాంతి మూడో రోజు పశువుల ప్రాధాన్యత పండుగ కనుమ పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఈ పండగలో మూడవ రోజు కనుమ అని పశువుల పండుగ. పంట పొలాల నుండి తమ ఇంటి కొచ్చిన పంటను భారతీయ హిందూ ధర్మం ప్రకారం ఒక గొప్పనైన సంస్కృతిగా ఆచరిస్తారు.


సంక్రాంతి అంటే పంటల పండుగే అని అందరికీ తెలిసిందే. కానీ ఆ పంటలు బాగా పండాలంటే, పశువుల సాయం కూడా కావాలిగా! అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకి కూడా ఆహారం అందేలా ఇంటిచూరుకి ధాన్యపుకంకులు వేలాడదీస్తారు.

సంక్రాంతి మూడో రోజు పశువుల ప్రాధాన్యత పండుగ కనుమ పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ! "సంక్రాంతి" లక్ష్మీని ఆహ్వానిస్తూ ఈ పండగలో మూడవ రోజు కనుమ అని పశువుల పండుగ. పంట పొలాల నుండి తమ ఇంటి కొచ్చిన పంటను భారతీయ హిందూ ధర్మం ప్రకారం ఒక గొప్పనైన సంస్కృతిగా ఆచరిస్తారు. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సహయపడిన పశువును అవి చేసిన సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తామేకాక, పశువులు, పక్షులతో పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. 

Latest Videos

undefined

పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంట పొలాలల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని గౌరవించి శుభ్రంగా అలంకరించి పూజించి, వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. పల్లె ప్రాంతాలలో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు. తమకి సుఖ సంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తున్న పాత్రను రైతులు మరిచిపోరు. తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్లు 'కనుమ' రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. 

వాటితో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు. కనుమ రోజున వాళ్లు పశువులను నదీ తీరాలకు గానీ, చెరువుల దగ్గరికి గాని తీసుకు వెళ్లి స్నానం చేయిస్తారు. ఆ పశువుల నుదుటున పసుపు, కుంకుమదిద్ది వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు. వాటి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ తగిలిస్తారు. అలంకరణ పూర్తయిన తరువాత వాటిని పూజించి హారతిని ఇస్తారు. పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వాటిని ఉత్సాహంగా ఊరేగిస్తారు.ఈ పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి కార్యక్రమము చేస్తుంటారు. 

ఇదంతా రైతుల సంగతి. కానీ మిగతావారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది. దేవతలకు ఉత్తరాయణం పగటికాలం అనీ, ఇది వారికి చాలా ఇష్టమైన సమయమనీ చెబుతారు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారనీ, వారిని తల్చుకుంటూ ప్రసాదాలు పెట్టాలనీ ఓ ఆచారం.

కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు, ఇటు ఇంట్లోవారు కడుపు నిండా తినేందుకు... మాంసాహారాన్ని మించి ఏముంటుంది. మాంసం తినని వారికి, దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములు. అందుకనే గారెలు, మాంసంతో... ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి’ అనే సామెత మొదలైంది. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి.

కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు... దాన్ని అందరూ కలిసితినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. పొద్దున్నే పశువులని పూజించుకోవడం, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయడం... అంతా కలిసే చేస్తారు. కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్లు వండటం, బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరిగుతాయి.

అందుకే తెలుగు వారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు... భోగి, సంక్రాంతి, కనుమలు కలిసిన మూడు రోజుల పండుగ. కనుమ రోజు హడావుడి ఉంటుంది కాబట్టి, ఆ రోజు పెద్దలను తల్చుకుని, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది. అత్యవసరం అయితే తప్ప ఆ మాట దాటకూడదనీ, ఒకవేళ కాదూ కూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని పెద్దలు అంటూ అంటారు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

click me!