రైతుల పండగ... ఏరువాక పౌర్ణమి

By telugu news team  |  First Published Jun 5, 2020, 8:14 AM IST

వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజింస్తారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

undefined

రైతులు తమ వ్యవసాయ భూములలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ఈనాటి తిథి వివరణకు సంబంధించి వృషభ పూజ, హల ప్రవాహ వంటి పదాలు ఉన్నాయి. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే ఈ పండుగను జరుపుకుంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజింస్తారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను రంగులు, రకరకాల బట్టలతో అంకరించి డప్పులు, మేళతాళాలతో ఊరేగించారు. ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు.

భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి వ్యవసాయం మూలస్తంభం లాంటిది. దానికి తొలి పనిముట్టు నాగలి, ముఖ్య వనరు వర్షం.  ఆ వర్షం కురిసే కాలం మొదల య్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ 'కృషిపూర్ణిమ' దీనికే హలపూర్ణిమ, ఏరువాక పున్నమి అనే పేర్లతో పిలవబడుతుంది. 'ఏరు' అంటే నాగలి అని, 'ఏరువాక'  అంటే దుక్కి ప్రారంభం అనీ అర్థాలున్నాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం, నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం జ్యేష్ఠ పూర్ణిమ పర్వదిన ముఖ్యాంశాలు. 

రైతులు ఈ పండుగ జరపడానికిగల కారణాన్ని పరిశీలిస్తే - నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు ( మంచు, ఎరువు, సూక్ష్మధాతువులు ) పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. పై కారణాలన్నింటివల్ల జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ పర్వదినాన్ని జరుపుతారు.

వ్యవసాయానికి ఆలంబన అయిన పశుసంపద, భూమి, పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ ప్రత్యేకత. నాగలిని శుభ్రపరచి, పసుపు, కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. దానితోపాటు పశువులను అలంకరించి వాటితో వ్యవసాయ భూమికీ పూజచేస్తారు. పశువుల కొట్టాలు, కళ్ళాలు మొదలైనవాటినీ శుభ్రంచేసి అలంకరిస్తారు. ఆ పైన పొంగలిని ( కొన్ని ప్రాంతాల్లో పులగం ) వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ని పూజించి నివేదన చేస్తారు. 

ఆ తరవాత ఆ పదార్థాలను ఆవులకు, ఎడ్లకు తినిపిస్తారు. నాగలిని పూజించి, పశువులను, బళ్లను మేళతాళాలతో ఊరేగించి భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభిస్తారు. కొన్నిచోట్ల తొలి దుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడికి రెండో వైపు నిలిచి భూమిని దున్నుతారు. పశువుల గెత్తం ( ఎరువుగా మారిన పశువుల పేడ ) పొలాలకు తరలించే ప్రక్రియా ఈ పూర్ణిమ రోజే  ప్రారంభిస్తారు.

ఉత్తర భారతదేశంలో దీన్ని 'ఉద్‌వృషభయజ్ఞం' అని పిలుస్తారు. వృషభం అంటే ఎద్దు. ఉద్ధృతం అంటే లేపడం. అంత వరకు వేసవి వల్ల కాస్త విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం సిద్ధపరచడమని అర్థం. 

ఋగ్వేదంలోనూ వ్యవసాయ పనుల ప్రారంభ దినాన చేసే గౌరవ సూచకమైన ఉత్సవ ప్రసక్తి ఉంది. అధర్వణ వేదంలోనూ 'అనడుత్సవం' అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది. దీనిలో భాగంగా హలకర్మ ( నాగలిపూజ ) , మేదినీ ఉత్సవం ( భూమి పూజ ) , వృషభ సౌభాగ్యం ( పశువుల పూజ ) మొదలైన ప్రక్రియలు చేయాలని చెబుతున్నాయి. ఇవే కాకుండా అనేక పురాణాల్లోనూ 'కృషి పూర్ణిమ' ప్రసక్తి ఉంది. వరాహమిహిరుడు రచించిన 'బృహత్సంహిత' లోను , పరాశరుడు రాసిన 'కృషి పరాశరం' లోనూ ఈ ఉత్సవ ప్రసక్తి ఉంది. కర్ణాటక ఈ ఉత్సవాన్ని ప్రాంతంలో 'కారణిపబ్బం' అని పిలుస్తారు. ఒక్కొక్క ప్రాతంలో వారి వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం రైతన్నలు ఈ పండగను ఘనంగా నిర్వహించు కుంటారు.

click me!