Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు telugu.asianetnews.com టాప్ న్యూస్ లో సీఎం రేవంత్ చేపల పులుసు ఆరోపణలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు, LRS పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.., తొలి గ్యారెంటీ ప్రకటించిన ఏపీ కాంగ్రెస్.. 'ఇందిరమ్మ అభయం' పేరుతో నెలకు ఎంతంటే..?, తెలంగాణలో ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల.., వర్చువల్‌గా ఆ రెండు పథకాల ప్రారంభించనున్న ప్రియాంక , బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ సవాల్ విశాఖ ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందా? ఇంతకీ అధికారుల వివరణ ఏంటీ?, పేటీఎం పేమెంట్ బ్యాంక్ చైర్మన్ రాజీనామా , ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ తుదిశ్వాస వంటి వార్తల సమాహారం.
Today's Top Stories: ( పూర్తి కథనం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి)
LRS పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
2020 భూముల క్రమబద్దీకరణ (Layout Regularization Scheme 2020) దరఖాస్తుల అంశంపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ ప్లాట్లలో ల్యాండ్ లేఅవుట్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కీలక నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది దరఖాస్తుదారులకు లబ్ది చేకూరుతుంది. అదేసమయంలో క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించడానికి దరఖాస్తుదారులకు మార్చి 31 వరకు సమయం ఇచ్చింది. సోమవారం నాడు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని లక్షలాది దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
Mahabubnagar MLC by-election: పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే తెలంగాణలో ఉప ఎన్నిక నగారా మోగింది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నిక మార్చి 28న జరగనుంది.
వర్చువల్‌గా ఆ రెండు పథకాల ప్రారంభించనున్న ప్రియాంక
కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తెలంగాణ పర్యటన రద్దయింది. రేవంత్ సర్కార్ అమలు చేయనున్న గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్(200 యూనిట్లు) పథకాలను ప్రారంభించడానికి ప్రియాంక గాంధీ మంగళవారం చేవెళ్లకు వెళ్లాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ యథాతథంగా మంగళవారం వర్చువల్ మోడ్‌లో ఆ పథకాలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఈ పథకాలను చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంక చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.
బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ సవాల్
CM Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన బీఆర్ఎస్ కి ప్రశ్నించే అర్హత లేదన్నారు. కేంద్రం పదేళ్లుగా అధికారంలో మోడీ సర్కార్ తెలంగాణకు ఏం ఇచ్చారని నిలదీశారు. గత రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చర్చించడానికి బీజేపీ, బీఆర్ఎస్ లు సిద్దమా అని, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
సంచలన నిర్ణయం.. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..
AP Assembly: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్టీ మారిన ఎనిమిది మంది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సదరు ఎమ్మెల్యేల స్పందన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సీఎం రేవంత్ చేపల పులుసు ఆరోపణలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
Minster RK Roja: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు నగరి ఎమ్మెల్యే రోజా చేపల పులుసు వండి పెట్టారంటూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తొలిసారి మంత్రి రోజా స్పందించారు. తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి రోజా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు ఎవరి కోసం చేపల పులుసు చేయలేదని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. జాక్ పాట్‌లో సీఎం అయిన రేవంత్ రెడ్డికి ఏం మాట్లాడాలో తెలియక.. ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారంటూ పెద్ద పంచ్ వేసింది మంత్రి రోజా.
తొలి గ్యారెంటీ ప్రకటించిన ఏపీ కాంగ్రెస్.. 'ఇందిరమ్మ అభయం' పేరుతో నెలకు ఎంతంటే..?
Indiramma Abhayam: ఏపీలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తొలి గ్యారెంటీని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ ‘న్యాయ సాధన సభ’లో ఇందిమ్మ అభయం అనే మొదటి గ్యారెంటీ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి మల్లికార్జున్ ఖర్గే, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఇందిరమ్మ అభయం కింద ఇంటింటికి మహిళల పేరు మీద రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. మహిళల పేరు మీదనే చెక్కు పంపిణీ చేస్తామని షర్మిల చెప్పారు.
విశాఖ ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందా? ఇంతకీ అధికారుల వివరణ ఏంటీ?
Floating Bridge: విశాఖ సాగర తీరంలోని ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ (Floating Bridge) తొలిరోజే సందర్శకులకు నిరాశను మిగిల్చింది. సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న కథనాలను అధికారులు ఖండించారు. విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోలేదని కలెక్టర్, విఎంఆర్డీఏ కమిషనర్ మల్లికార్జున స్పష్టం చేశారు. విశాఖ సాగర తీరంలోని ఆర్కే బీచ్‌లో వీఎంఆర్‌డీఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ (Floating Bridge) తొలిరోజే సందర్శకులకు నిరాశను మిగిల్చింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్ధేశంతో దాదాపు కోటి 60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తొలిరోజే పర్యాటకులకు అసంతృప్తి మిగిలింది. సోమవారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి తరలివచ్చారు. కానీ, పర్యటకులను అనుమతించకపోవడంతో వారు నిరాకరించడంతో అక్కడి నుంచి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.
పేటీఎం పేమెంట్ బ్యాంక్ చైర్మన్ రాజీనామా
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్‌గా రాజీనామా చేశారు. ఆర్బీఐ పేటీఎం బ్యాంక్‌కు మార్చి 15వ తేదీ డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. పీపీబీఎల్ కొత్తగా బోర్డును ఏర్పాటు చేసింది. ఇందులో కొత్త బోర్డు డైరెక్టర్లు ఉన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవేంద్రనాథ్ సారంగి, బరోడా బ్యాంక్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్‌లు సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.
Pankaj Udhas: ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ తుదిశ్వాస
Ghazal Singer: ప్రముఖ గజల్ గాయకుడు, క్లాసికల్ సింగర్ పంకజ్ ఉదాస్(73) తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ అనారోగ్యంతో తర్వాత ఆయన ఫిబ్రవరి 26వ తేదీన మరణించారు. ఈ విషయాన్ని పంకజ్ ఉదాస్ కుమార్తె నయాబ్ ఉదాస్ ధ్రువీకరించారు.‘పద్మశ్రీ పంకజ్ ఉదాస్ 2024 ఫిబ్రవరి 26వ తేదీన తుది శ్వాస విడిచినట్టు భారమైన హృదయంతో, విచారంతో తెలియజేస్తున్నాం. దీర్ఘకాల అనారోగ్యంతో ఈ రోజు ఆయన కన్నమూశారు’ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం..
WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ ఎడిషన్ ఎంతో జోష్ గా కొనసాగుతోంది. ఈ సీజన్‌లోని నాల్గవ మ్యాచ్ (ఫిబ్రవరి 26) సోమవారం బెంగళూరులో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో చివరి బంతికి ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన గత సీజన్‌లో రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. కాగా యూపీ వారియస్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఢిల్లీ విజయంతో పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకుంది.