Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టులు ఎన్నంటే.. ?, తెలంగాణలో బీజేపీ పొత్తుపై కిషన్‌రెడ్డి సంచలన ప్రకటన , వారం రోజుల్లో మరో రెండు హామీలు అమలు.., కుప్పంలో నేను పోటీ చేస్తా: నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు, మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ , `ఇండియన్ 2` తెలుగు రైట్స్.. బడా నిర్మాత సొంతం, లిక్కర్ కేసులో కవితకు సీబీఐ సమన్లు .. చివరి కేంద్ర మంత్రిమండలి భేటీ.. ఎప్పుడంటే..? , పార్టీ కార్యాలయంలోనే షర్మిల బస.. వంటి వార్తల సమాహారం.
Today's Top Stories:
Singareni: సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టులు ఎన్నంటే.. ?
Singareni: తెలంగాణలోని నిరుద్యోగులకు సింగరేణి సంస్థ శుభవార్త చెప్పింది. సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్‌మెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఈ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్దం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. సింగరేణి ఛైర్మన్ అండ్ ఎం.డీ బలరామ్ నాయక్‌ను ఆదేశించారు. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
తెలంగాణలో బీజేపీ పొత్తుపై కిషన్‌రెడ్డి సంచలన ప్రకటన
Kishan Reddy: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి బుధవారం స్పష్టం చేశారు. కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి ( బీఆర్‌ఎస్ ) మధ్య ఎలాంటి తేడా లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ నేత తెలిపారు. బీఆర్‌ఎస్‌కు ఎజెండా లేనందున ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ సీటు గెలవకపోయినా ప్రజలకు ఎలాంటి తేడా ఉండదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలో అన్ని లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వారం రోజుల్లో మరో రెండు హామీలు అమలు..
CM Revanth Reddy: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు ఎన్నికల హామీలకు శ్రీకారం చుట్టనుంది. వారం రోజుల్లోగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించనున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెల్ల రేషన్‌కార్డుదారులందరికీ (బీపీఎల్ కుటుంబాలు) ప్రతినెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని, వారికి రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్ అందజేస్తామని చెప్పారు. అలాగే.. మార్చి 15 నుంచి రైతు భరోసాను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 2 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేసే బాధ్యతను తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి చెప్పారు.
లిక్కర్ కేసులో కవితకు సీబీఐ సమన్లు
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ తనయ కవితకు సీబీఐ నుంచి మరోసారి సమన్లు అందాయి. వచ్చే వారం దర్యాప్తునకు హాజరు కావలని సీబీఐ సమన్లు పంపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఈ సమన్లు వచ్చినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు పంపడం ఇది రెండోసారి. గతంలో డిసెంబర్‌లో ఆమెను సీబీఐ విచారించిన విషయం విధితమే.
మేడారం జాతరకు వెళ్లనున్న సీఎం రేవంత్
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మేడారం మహా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మేడారం సందర్శించనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం హోదాలో మేడారం జాతరకు వెళ్లి.. వనదేవతలను దర్శించుకోనున్నారు. అదే రోజు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా జాతరకు హాజరుకానున్నట్టు సమాచారం. ఇతర ప్రముఖులు రానుండటంతో పోలీసులు కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
కుప్పంలో నేను పోటీ చేస్తా: నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు
కుప్పం: కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధినేత సతీమణి నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఇవాళ అన్న క్యాంటిన్ ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు.ఈ సందర్భంగా నారా భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు.ఈ విషయమై పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారని ప్రచారం సాగుతుంది. త్వరలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం అసెంబ్లీ స్థానం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు.ఈ విషయమై తెలుగు దేశం పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారని సమాచారం.
ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ టెన్షన్.. పార్టీ కార్యాలయంలోనే షర్మిల బస..
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు(గురవారం) చలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడే గృహనిర్బంధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిను సైతం హౌజ్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆమె పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లోనే ఉండిపోయారు. బుధవారం రాత్రి అక్కడే బస చేశారు.
Union Council Meeting: చివరి కేంద్ర మంత్రిమండలి భేటీ.. ఎప్పుడంటే..?
Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల 2024 ప్రకటనకు కొన్ని రోజుల ముందు మార్చి 3న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగనున్నది. ఈ మేరకు బుధవారం అధికారులు సమాచారం అందించారు. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న సుష్మా స్వరాజ్ భవన్‌లో మంత్రి మండలి సమావేశం జరుగుతుందని వెల్లడించారు.కీలకమైన విధానపరమైన అంశాలను చర్చించడానికి, వివిధ కార్యక్రమాల అమలుపై ఇన్‌పుట్‌లను కోరడానికి, పాలనకు సంబంధించిన విషయాలపై తన దృక్పథాన్ని పంచుకోవడానికి ప్రధాని ఎప్పటికప్పుడు పూర్తిస్థాయి మంత్రుల మండలి సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. అయితే.. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు ఈ భేటీ జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
`ఇండియన్ 2` తెలుగు రైట్స్.. బడా నిర్మాత సొంతం..
indian 2: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న `ఇండియన్ 2`(భారతీయుడు2) పై భారీ అంచనాలున్నాయి. 27ఏళ్ల క్రితం వచ్చిన `ఇండియన్`(భారతీయుడు) చిత్రానికి సీక్వెల్. ఈ మూవీ త్వరలోనే రాబోతుంది. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్ ప్రారంభమైంది. తెలుగులో రైట్స్ అమ్ముడు పోయాయి. తెలుగు రైట్స్ ని ఏషియన్ సురేష్(సురేష్ ప్రొడక్షన్) ఎంటర్‌టైనర్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ దక్కించుకుంది. నిర్మాత సురేష్ బాబు సొంతం చేసుకోవడం విశేషం. నైజాం, ఆంధ్రాలో ఆయన ఈ మూవీ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. సీడెడ్ తిరుపతి ప్రసాద్ దక్కించుకున్నారట.