`ఇండియన్ 2` తెలుగు రైట్స్.. బడా నిర్మాత సొంతం.. ఎంతకు?
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ `ఇండియన్ 2`. ఈ మూవీ తెలుగు రైట్స్ అమ్ముడు పోయాయి. బడా నిర్మాత తెలుగు, ఆంధ్రా రైట్స్ ని సొంతం చేసుకున్నారు.
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న `ఇండియన్ 2`(భారతీయుడు2) పై భారీ అంచనాలున్నాయి. 27ఏళ్ల క్రితం వచ్చిన `ఇండియన్`(భారతీయుడు) చిత్రానికి సీక్వెల్. ఈ మూవీ త్వరలోనే రాబోతుంది. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్ ప్రారంభమైంది. తెలుగులో రైట్స్ అమ్ముడు పోయాయి. తెలుగు రైట్స్ ని ఏషియన్ సురేష్(సురేష్ ప్రొడక్షన్) ఎంటర్‌టైనర్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ దక్కించుకుంది. నిర్మాత సురేష్ బాబు సొంతం చేసుకోవడం విశేషం. నైజాం, ఆంధ్రాలో ఆయన ఈ మూవీ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. సీడెడ్ తిరుపతి ప్రసాద్ దక్కించుకున్నారట.
శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీలో కమల్‌కి జోడీగా కాజల్ నటిస్తుంది. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మరో జంటగా నటిస్తుంది. మొదటి భాగం అప్పటి రాజకీయ, అధికార అవినీతి ప్రధానంగా రూపొందించారు. ఇప్పుడు లేటెస్ట్ గా రాజకీయాల్లో జరిగే పరిస్థితులు, అవినీతి వంటి అంచనాలను ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. భారతీయుడు మళ్లీ వస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించబోతున్నారు శంకర్.
ఇప్పటికే కమల్ పాత్రని పరిచయం చేస్తూ విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచింది. ఆ తర్వాత దీన్నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేదు. ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సింది ఉంది. మరోవైపు `ఇండియన్ 2`తోపాటు `ఇండియన్ 3`ని కూడా రూపొందిస్తున్నారట. ఏక కాలంలో రెండింటిని పూర్తి చేసే అవకాశం ఉందట. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా ప్రారంభమైంది. మరి రిలీజ్ విషయంలోనే స్పష్టత రావాల్సి ఉంది.
ఇక `ఇండియన్ 2` రైట్స్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం 75కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరి ఏషియన్‌సురేష్ ఎంతకి దక్కించుకున్నారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు డిజిటల్ రైట్స్ మాత్రం రెండు వందల కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం.