ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ టెన్షన్.. పార్టీ కార్యాలయంలోనే షర్మిల బస..
YS Sharmila: మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం నాడు చలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు.
YS Sharmila: విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు(గురవారం) చలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడే గృహనిర్బంధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిను సైతం హౌజ్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆమె పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లోనే ఉండిపోయారు. బుధవారం రాత్రి అక్కడే బస చేశారు.
వాస్తవానికి ’చలో సచివాలయం’ కార్యక్రమంలో భాగంగా సచివాలయం ముట్టడి కోసం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. ఆమె షెడ్యూల్ ప్రకారం.. బాపులపాడు మండలం అంపాపురంలోని కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఆమె బస చేయాలి. కాగా.. పోలీసుల గృహ నిర్బంధాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండిపోయారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేసారు. ఉదయం ‘చలో సెక్రటేరియట్’కు బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు.. షర్మిల బయటకు రాకుండా ఆంధ్రరత్న భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు కార్యాలయం చుట్టూ బారికెడ్స్ ఏర్పాటు చేశారు.
గృహనిర్బంధాలపై షర్మిల ‘ఎక్స్'(ట్విటర్) వేదికగా స్పందించారు. ‘నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్ లు చేయాలని చూస్తారా ? వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు ? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా ? నేను ఒక మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు,పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి గడప వలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా ? మేము తీవ్రవాదులమా..లేక సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు అంటే... మాకు భయపడుతున్నట్లే కదా అర్థం.మీ అసమర్థతను కప్పి పుచ్చాలని చూస్తున్నట్లే కదా అసలు వాస్తవం.మమ్మల్ని ఆపాలని చూసినా,ఎక్కడికక్కడ మా కార్యకర్తలను నిలువరించినా, బారికెడ్లతో బందించాలని చూసినా,నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆపేది లేదు.” అని స్పష్టం చేశారు.