Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం, జగన్ పై లోకేష్ మండిపాటు, మేడారం జాతరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.., మేడిగడ్డ నిర్మాణంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, నేనూ, పవన్ కళ్యాణ్ వైసీపీ బాధితులమే : చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు, వైవాహిక బంధంతో ఒక్కటైన వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ, ఈ ఏడాది జ్ఞానపీఠ గ్రహీతలు వీరే.., సార్వత్రిక ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన.. ఏమన్నారంటే..?, పీచు మిఠాయి అమ్మకాలపై నిషేధం.. ఎందుకంటే..? , విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఇన్‌శాట్ 3 డీఎస్ శాటిలైట్, యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ.. భారీగా నగదు, ఆభరణాల దొంగతనం.. వంటి వార్తల సమాహారం.
Today's Top Stories:
ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఫిబ్రవరి 8వ తేదీన గవర్నర్ తమిళిసై ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 17వ తేదీన వరకు జరగాయి. ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడివేడి చర్చలు జరిగాయి. ప్రధానంగా కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం.. రూ. 2.75లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం
బీఆర్ఎస్ సర్కార్ హయంలో నీటి పారుదల శాఖను నిర్వహించిన వారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శనివారం నాడు మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవినీతి, నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా దెబ్బతిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి ఎక్కడా జరగలేదని ఆయన విమర్శించారు. నాణ్యత లోపంతో బ్యారేజీ నిర్మించారని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాద్.. ఇప్పుడు ఇదో నాటకమా?.. జగన్ పై లోకేష్ మండిపాటు...
వైసీపీ నేతలపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ నేతలు మరో మోసానికి దిగుతున్నారని మండిపడ్డారు, ప్రజలను మభ్య పెట్టేందుకే హైదరాబాదును తెరమీదికి తీసుకువస్తున్నారని… మూడు రాజధానుల పని అయిపోయిందని, ఇప్పుడు దీని మీద పడ్డారని ఎద్దేవా చేశారు. మాఫియా డాన్ల చేతుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలను పెట్టారని విమర్శించారు, శుక్రవారం ‘శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలోని విజయనగరం, గంట్యాడ, రామతీర్థంలలో జరిగిన సభల్లో నారా లోకేష్ పాల్గొన్నారు.
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు భక్తుల సౌకర్యం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా భక్తులు మేడారం వెళ్లేందుకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతగానో దోహదపడతాయని మంత్రి తెలిపారు.
మేడిగడ్డ వద్ద నిర్మాణం వద్దని నిపుణుల సూచన: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో నిపుణుల కమిటీ సూచనలను కేసీఆర్ సర్కార్ తొక్కిపెట్టిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తుమ్మిడిహెట్టి దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని వారు నియమించిన ఇంజనీర్ల కమిటీ స్పష్టం చేసిందని తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మేడిగడ్డ వద్ద నిర్మిస్తే నిరుపయోగమని ఐదుగురు ఇంజనీర్ల కమిటీ తేల్చిందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖపై శ్వేత పత్రం శనివారంనాడు అసెంబ్లీలో విడుదల చేసింది. ఈ శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భారత రాష్ట్ర సమితి తరపున మాజీ మంత్రి హరీష్ రావు చర్చలో పాల్గొన్నారు.హరీష్ రావు ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు.
నేనూ, పవన్ కళ్యాణ్ వైసీపీ బాధితులమే : చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్‌ను కొద్దికాలం పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. శనివారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘‘ రా .. కదలిరా ’’ బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు. అసెంబ్లీలో అమరావతి రాజధాని అని చెపారు.. తర్వాత మాట మార్చి 3 రాజధానులు అన్నారని, ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్నారని ఆయన మండిపడ్డారు.
వైవాహిక బంధంతో ఒక్కటైన వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ.. పెళ్లి ఫొటోలు వైరల్..
YS Rajareddy- Atluri Priya: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనయుడు రాజా రెడ్డి వివాహం నేడు (ఫిబ్రవరి 17న) జరిగింది. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రియా అట్లూరితో రాజా రెడ్డి పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమేద్ ప్యాలెస్ వేదిక అయ్యింది. కుటుంబ సభ్యులు,స్నేహితులు మధ్య వీరి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో షర్మిల తన కుమారుడి రాజారెడ్డి- ప్రియా అట్లూరి హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ రాజా-ప్రియా అంటూ ట్వీట్ చేశారు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అంటూ దీవించారు.
ఈ ఏడాది జ్ఞానపీఠ గ్రహీతలు వీరే..
Jnanpith Award: ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్య ప్రతిష్టాత్మక 58వ జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ శనివారం ప్రకటన చేసింది. 2023వ సంవత్సరానికి గాను ఈ ఇద్దరు ప్రముఖులకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేసింది. 2022వ సంత్సరానికి గాను గోవా రచయిత దామోదర్ మౌజోకు జ్ఞానపీఠ్ లభించింది.
సార్వత్రిక ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన.. ఏమన్నారంటే..?
Lok Sabha Election 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చని అంచనాలు వేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ఎన్నికలు జరగవచ్చని ప్రకటించారు. ఇలా ఎప్పుడప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ)కూడా ఇదే రీతిలో ప్రకటన చేసింది. ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
పీచు మిఠాయి అమ్మకాలపై నిషేధం.. ఎందుకంటే..?
Cotton Candy: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రప్రభుత్వం పీచు మిఠాయి అమ్మకాలు, ఉత్పత్తిని నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సమాచారం అందించింది. ఆహార విశ్లేషణలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు నిర్ధారించిన తర్వాత ప్రభుత్వం పీచు మిఠాయి విక్రయాలు, ఉత్పత్తిని నిషేధించింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం శనివారం మాట్లాడుతూ.. ఆహార భద్రతా విభాగం పీచు మిఠాయి నమూనాలను పరీక్ష కోసం పంపిందని, ఇందులో క్యాన్సర్‌కు కారణమయ్యే రోడమైన్-బి రసాయనం ఉన్నట్లు నిర్ధారించబడింది. దీని తరువాత రాష్ట్రంలో పీచు మిఠాయి మిఠాయిల అమ్మకం, ఉత్పత్తిని నిషేధించామని తెలిపారు.
విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఇన్‌శాట్ 3 డీఎస్ శాటిలైట్
ISRO INSAT-3DS launch: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇన్‌శాట్ 3 డీఎస్‌ను జీఎస్ఎల్‌వీ ఎఫ్ 14 ఉపగ్రహ వాహక నౌక ద్వారా విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం నిర్వహించారు. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్ 3 డీ, ఇన్‌శాట్ 3 డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. దాదాపు 2,275 కిలోల బరువైన ఇన్‌శాట్ 3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి.. శాటిలైట్ విజయవంతంగా కక్షలోకి చేరడంతో శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ అభినందించారు.
యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ.. భారీగా నగదు, ఆభరణాల దొంగతనం..
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ జరిగింది. హరియాణా రాష్ట్రం పంచకులలోని ఎండీసీ సెక్టార్ 4లో ఉన్న ఇంట్లో భారీగా నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అయితే ఈ చోరీ ఇంటిలో పని చేసే సిబ్బందే చేశారని తెలుస్తోంది. కాగా.. ఈ చోరీ ఇప్పుడు జరిగింది కాదు కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న రూ.75 వేల నగదు, వివిధ నగలు 2023 అక్టోబర్ లో చోరీకి గురయ్యాయి.