Jnanpith Award: జగద్గురు రామభద్రాచార్య, సినీ కవి గుల్జార్‌కు జ్ఞానపీఠ్‌ అవార్డు

By Rajesh Karampoori  |  First Published Feb 18, 2024, 6:40 AM IST

Jnanpith Award: ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ప్రతిష్టాత్మక 58వ జ్ఞానపీఠ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. జ్ఞానపీఠ్‌ ఎంపిక కమిటీ శనివారం ఈ విషయం వెల్లడించింది. 2023వ సంవత్సరానికి గాను ఈ ఇద్దరు ప్రముఖులకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేసింది.  


Jnanpith Award: ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్య ప్రతిష్టాత్మక 58వ జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు జ్ఞానపీఠ్‌ ఎంపిక కమిటీ శనివారం ప్రకటన చేసింది. 2023వ సంవత్సరానికి గాను ఈ ఇద్దరు ప్రముఖులకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేసింది 


ఆస్కార్ విజేత గుల్జార్

Latest Videos

ప్రసిద్ధ బాలీవుడ్‌ సినీ రచయిత, ఉర్దూ కవి సంపూరణ్‌ సింగ్‌ కాల్రా అలియాస్‌ గుల్జార్‌(89). ప్రస్తుత కాలంలో ఉత్తమ ఉర్దూ కవులలో ఒకరిగా పరిగణించబడ్డారు. గుల్జార్‌ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. 2013లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. అలాగే.. ఐదు సార్లు జాతీయ ఫిలిం అవార్డు పొందారు.   స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌లోని 'జై హో' పాటకు 2009లో ఆస్కార్‌ అవార్డు దక్కింది.

"మాచిస్" (1996), "ఓంకార" (2006), "దిల్ సే" (1998), "గురు" (2007) వంటి ప్రశంసలు పొందిన చిత్రాలలో గుల్జార్ పాటలను విమర్శకులు ప్రశంసించారు. గుల్జార్ ''కోషిష్'' (1972), ''పరిచయ్'' (1972), ''మౌసమ్'' (1975), ''ఇజాజత్'' (1977), టెలివిజన్‌తో సహా కొన్ని ఎవర్‌గ్రీన్ అవార్డు-విజేత చిత్రాలకు దర్శకత్వం వహించారు. తన సుదీర్ఘ సినీ కెరీర్‌తో పాటు, సాహిత్య రంగంలో కూడా గుల్జార్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. కవిత్వంలో ‘త్రివేణి’ అనే కొత్త శైలిని ఆవిష్కరించారు. ఆయన గత కొంత కాలంగా బాలల కవిత్వంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి రామభద్రాచార్య

ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన జగద్గురు రామభద్రాచార్య(74) మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో తులసి పీఠం వ్యవస్థాపకుడు. ఆయన ప్రఖ్యాత హిందూ ఆధ్యాత్మిక గురువు. రామానంద ప రంపరలో ప్రస్తుతం ఉన్న నలుగురు జగద్గురువుల్లో ఆయన కూడా ఒకరు. 22 భాషలకు పైగా ప్రావీణ్యం ఉన్న రాంభద్రాచార్య సంస్కృతం, హిందీ, అవధి, మైథిలితో సహా అనేక భారతీయ భాషలలో రచనలు చేశారు.

2015లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. రాంభద్రాచార్య అసలు పేరు గిరిధర్ మిశ్రా. రెండు నెలల వయసులో 'ట్రాకోమా' అనే అంటు వ్యాధితో కంటి చూపు కోల్పోయారు. చిన్నతనం నుంచి తాతయ్య ఇంట్లోనే చదువుకున్నారు. ఐదేళ్ల వయసులో భగవద్గీత మొత్తం కంఠస్థం చేసి ఎనిమిదేళ్ల వయసులో రామచరిత్మానాలు పూర్తిగా కంఠస్థం చేశారు.


జ్ఞానపీఠ్ అవార్డు చరిత్ర

1944లో స్థాపించబడిన జ్ఞానపీఠ్ అవార్డును భారతీయ సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలకు అందజేస్తారు. ఈ అవార్డును సంస్కృత భాషకు రెండోసారి, ఉర్దూ భాషకు ఐదోసారి అందజేస్తున్నారు. అవార్డు కింద రూ.21 లక్షల ప్రైజ్ మనీ, వాగ్దేవి విగ్రహం, ప్రశంసా పత్రం అందిస్తారు.జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ప్రతిభా రాయ్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ అవార్డు గ్రహీతలను నిర్ణయించింది.

సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులలో మాధవ్ కౌశిక్, దామోదర్ మావ్జో, ప్రొఫెసర్ సురంజన్ దాస్, ప్రొఫెసర్ పురుషోత్తం బిల్మలే, ప్రఫుల్ల శిలేదార్, ప్రొఫెసర్ హరీష్ త్రివేది, ప్రభా వర్మ, డాక్టర్ జానకీ ప్రసాద్ శర్మ, ఎ. కృష్ణారావు, జ్ఞానపీఠ అధ్యక్షుడు మధుసూదన్ ఆనంద్ ఉన్నారు. 2022 సంవత్సరానికి గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు గోవా రచయిత దామోదర్ మావ్జోకు లభించింది.

click me!