Asianet News TeluguAsianet News Telugu

'కాళేశ్వరంలో అవినీతిపై ఆ మూడు నివేదికల ఆధారంగా చర్యలు': అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం

తెలంగాణ అసెంబ్లీలో  రాష్ట్ర ప్రభుత్వం  ఇవాళ  శ్వేత పత్రం విడుదల చేసింది.  

Telangana Government Tables white paper on irrigation projects in Telangana Assembly lns
Author
First Published Feb 17, 2024, 10:55 AM IST | Last Updated Feb 17, 2024, 10:55 AM IST

హైదరాబాద్: బీఆర్ఎస్ సర్కార్ హయంలో నీటి పారుదల శాఖను నిర్వహించిన  వారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని  తెలంగాణ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 

తెలంగాణ అసెంబ్లీలో  నీటిపారుదల శాఖపై  శనివారం నాడు మంత్రి  ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేశారు.   ఈ సందర్భంగా ఆయన  ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన  మేడిగడ్డ బ్యారేజీ  పిల్లర్ల కుంగుబాటుపై  అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.   అవినీతి, నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా దెబ్బతిందని  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి ఎక్కడా జరగలేదని ఆయన విమర్శించారు.  నాణ్యత లోపంతో బ్యారేజీ నిర్మించారని  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికను  మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రస్తావించారు.

వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీ మూడేళ్లలోనే కుప్పకూలిపోయిందన్నారు.మేడిగడ్డ బ్యారేజీకి రూ. 1800 కోట్లకు టెండర్ పిలిచారని  ఉత్తమ్ కుమార్ రెడ్డి  చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారన్నారు.  ఈ ప్రాజెక్టు వ్యయం రూ. లక్షా 47 వేల కోట్లకు చేరిందని మంత్రి చెప్పారు. ఇందులో ఇప్పటికే  84 వేల కోట్లను ఖర్చు చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి  వివరించారు.

2023 అక్టోబర్ మాసంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోతే  ఇప్పటివరకు మాజీ సీఎం కేసీఆర్ స్పందించని విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.  నాలుగేళ్ల పాటు పర్యవేక్షణ, నిర్వహణ సరిగా చేయలేదన్నారు.అన్నీ తెలిసి అందరి నిర్లక్ష్యం వల్లే బ్యారేజీ పియర్స్ దెబ్బతిందని  ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.మేడిగడ్డకు వాడిన సాంకేతిక సామాగ్రినే అన్నారం, సుందిళ్లకు వాడారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  చెప్పారు.అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నీటితో నింపవద్దని ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిందని  మంత్రి చెప్పారు. గతంలో నీటిపారుదల శాఖ నిర్వహణ చూసినవారు ఈ ఘటనతో తలదించుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  సెటైర్లు వేశారు.మేడిగడ్డ బ్యారేజీ తరహాలోనే అన్నారం బ్యారేజీ కూడ  కుంగిపోయే ప్రమాదం ఉందని  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  రిపోర్టు ఇచ్చిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  అసెంబ్లీలో ప్రస్తావించారు. నిన్నటి నుండి అన్నారం బ్యారేజీ నుండి లీకేజీలు ఎక్కువగా ప్రారంభమైనట్టుగా చెప్పారు. దీంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  బృందాన్ని పిలిచినట్టుగా  ఆయన గుర్తు చేశారు. అన్నారంలో నీటిని ఖాళీ చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  సూచించిందన్నారు. 

మరో వైపు విజిలెన్స్ రిపోర్టును కూడ  సభలో మంత్రి ప్రస్తావించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నీటిపారుదల రంగంలో ఇంత పెద్ద అవినీతి ఎప్పుడూ జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి  చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ,విజిలెన్స్ రిపోర్టు, కాగ్ రిపోర్టు ఆధారంగా  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

also read:టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..

తెలంగాణ రాష్ట్రంలో గృహ,పారిశ్రామిక వినియోగానికి  ప్రతి రోజూ 196 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం అవుతుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన  మోటార్లు నడిస్తే  ప్రతి రోజూ  203 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమౌతుందని మంత్రి చెప్పారు. అంతేకాదు విద్యుత్  కోసం  ప్రతి ఏటా  రూ. 10,374.56 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని కాగ్ తన నివేదికలో పేర్కొందన్నారు. ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మత్తుల కోసం ప్రతి ఏటా రూ. 272 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని  కాగ్ రిపోర్టు తెలిపిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios