ఉమ్మడి రాజధాని హైదరాబాద్ : మూడు రాజధానులైపోయింది.. ఇప్పుడు ఇదో నాటకమా?.. జగన్ పై లోకేష్ మండిపాటు...
ఇటీవల ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ చొక్కా మడత పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారని… ధైర్యం ఉంటే చొక్కా మడత వేద్దాం రండి.. ముఖ్యమంత్రి కుర్చీని ప్రజలు మడత పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.
విజయనగరం : వైసీపీ నేతలపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ నేతలు మరో మోసానికి దిగుతున్నారని మండిపడ్డారు, ప్రజలను మభ్య పెట్టేందుకే హైదరాబాదును తెరమీదికి తీసుకువస్తున్నారని… మూడు రాజధానుల పని అయిపోయిందని, ఇప్పుడు దీని మీద పడ్డారని ఎద్దేవా చేశారు. మాఫియా డాన్ల చేతుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలను పెట్టారని విమర్శించారు, శుక్రవారం ‘శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలోని విజయనగరం, గంట్యాడ, రామతీర్థంలలో జరిగిన సభల్లో నారా లోకేష్ పాల్గొన్నారు.
ఈ సభల్లో ప్రసంగిస్తూ ఆయన వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. సైకో జగన్ వాషింగ్టన్ డిసి రాజధాని తలదన్నే విధంగా ఏపీ రాజధాని నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అమరావతి రాజధానికి టిడిపి ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మద్దతిచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి మూడు రాజధానులు అన్నారని.. రాష్ట్రాన్ని మూడు ముక్కలాట చేశారని విమర్శించారు.
టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేని దౌర్భాగ్యస్థితికి వచ్చిందని అన్నారు. అమరావతి రైతులు 30వేల ఎకరాలను రాజధాని కోసం త్యాగం చేశారని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లుగా వారిని వేధిస్తున్నారని.. వారి త్యాగాలకు ఫలితం లేకుండా చేస్తున్నారన్నారు. అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే లాఠీచార్జీలు, కేసులు, అణిచివేతలకు పాల్పడుతున్నారని అన్నారు.
ఇప్పుడు రాష్ట్రాన్ని మరో పదేడ్లు వెనక్కి తీసుకెళ్లేలా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాన్ని మరోసారి చర్చలోకి తీసుకొస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. రాష్ట్రానికి అమ్మలాంటి ఉత్తరాంధ్రను వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా వదిలేశారన్నారు. సమావేశాల్లో నారా లోకేష్ ఇంకా మాట్లాడుతూ… ఇటీవల ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ చొక్కా మడత పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారని… ధైర్యం ఉంటే చొక్కా మడత వేద్దాం రండి.. ముఖ్యమంత్రి కుర్చీని ప్రజలు మడత పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. భూమ్ భూమ్ బ్యాచ్ కి భయపడనని.. తనమీద 22 కేసులు ఉన్నాయని.. హత్యాయత్నం కేసు కూడా పెట్టారని అన్నారు.
విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి బొత్స సత్యనారాయణలు ఉత్తరాంధ్ర జిల్లాలను దోచుకున్నారని వారు మాఫియా డాన్ లని విమర్శించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుకను అందించారని వైసీపీ నాయకులు మాత్రం ఇసుకను అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఇసుకను అమ్మిన డబ్బునంతా మంత్రి బొత్సా సత్యనారాయణ ముఖ్యమంత్రి జగన్ కు పంపిస్తున్నారని తెలిపారు. ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తుందని అన్నారు.