Today Top Stories: అమిత్‌ షాతో రేవంత్ రెడ్డి భేటీ.. పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ.. టీమిండియా చారిత్రాత్మక విజయం

By Rajesh Karampoori  |  First Published Jan 5, 2024, 5:59 AM IST

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో అమిత్‌ షాతో రేవంత్ రెడ్డి కీలక భేటీ.. కాపు పెద్దలకు జనసేనాని పవన్ బహిరంగ లేఖ.. సంక్రాంతి పండగ వేళ టీఎస్ఆర్టీసీ మరో శుభవార్త ..తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ, కాంగ్రెస్‌లో చేరిన వై.ఎస్. షర్మిల, మళ్లీ రాహుల్ గాంధీ పాదయాత్ర.. లక్షద్వీప్ లో ప్రధాని మోడీ సాహసాలు,  టీమిండియా ఘన విజయం.. టెస్ట్ సిరీస్ సమం  వంటి పలు వార్తల సమాహారం.


Today Top Stories: అమిత్‌ షాతో రేవంత్ రెడ్డి కీలక భేటీ..   

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. తెలంగాణకు ఎక్కువ మొత్తంలో ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంమంత్రిని ముఖ్యమంత్రి కోరినట్లు తెలిసింది. అంతకుముందు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి సబంధించిన విభజన అంశాలు, నిధుల రాకపై  చర్చించారు. ఆ తర్వాత కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ను సీఎంతో పాటు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి కలిశారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ (పీఎల్‌ఆర్‌ఐ) పథకానికి జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

Latest Videos

undefined

సంక్రాంతి పండగ వేళ TSRTC మరో శుభవార్త 

TSRTC: మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండగకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు,ఆ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని TSRTC ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మరోవైపు అద్దె బస్సుల యజమానులతో చర్చలు సఫలం కాగా.. రేపటి నుంచి బస్సులు నడుస్తాయని తెలిపారు. 

కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామాకాలకు మార్గం సుగమమైంది. కానిస్టేబుళ్ల నియామాకాలకు సంబంధించి గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును  డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దరిమిలా తెలంగాణలో 15,640 పోలీస్ కానిస్టేబుళ్ల నియామాకాలకు  మార్గం సుగమమైంది. కానిస్టేబుల్ నియామాకాలకు సంబంధించి నిర్వహించిన పరీక్షలో  నాలుగుప్రశ్నలకు మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ పై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది.ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది.  కొత్త కమిటీ ముందు నాలుగు ప్రశ్నలు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో  కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల 

తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  స్థానాలకు  ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. కడియం శ్రీహరి,పాడి కౌశిక్ రెడ్డిలు రాజీనామాలు చేయడంతో  ఎన్నిక నిర్వహించడం అనివార్యంగా మారింది. స్టేషన్ ఘన్ పూర్ నుండి  కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుండి  పాడి కౌశిక్ రెడ్డి  ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో  ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామాలు చేశారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు  ఈ నెల  11న నోటిఫికేషన్ విడుదల కానుంది.ఈ నెల  29న పోలింగ్ నిర్వహించనున్నారు.

పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ

Janasena Pawan Kalyan: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనివార్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీని సాగనంపాలని ఏపీ ప్రజలు భావిస్తున్నారనీ, ఈ విషయం పలు సర్వేల్లో వెల్లడవుతున్నని అన్నారు. అవినీతి, అస్తవ్యస్త, హింసాత్మక విధానాలతో సాగుతున్న వైసీపీ పాలనను చాలా బలంగా ఎదుర్కొంటున్న పార్టీ జనసేన అని చెప్పారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కాపు పెద్దలకు ఓ బహిరంగ లేఖ రాశారు. 

కాంగ్రెస్‌లో చేరిన వై.ఎస్.షర్మిల

యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ) అధినేత వై.ఎస్. షర్మిల  కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీ వైఎస్ఆర్‌టీపీని  కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. గురువారంనాడు ఉదయం ఎఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ  అధినేత మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏపీసీసీ చీఫ్ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించే యోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టుగా సమాచారం.  

మళ్లీ రాహుల్ గాంధీ పాదయాత్ర..

Bharat Jodo Nyay Yatra : కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతమైంది. దీంతో మళ్లీ ఇప్పుడు రెండో విడత పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ యాత్ర జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ యాత్రకు మొదట ‘భారత్ న్యాయ్ యాత్ర’ అనే పేరు ఖరారు చేశారు. కానీ ఇప్పుడు దానిలో చిన్న మార్పు చేశారు. దానిని ఇక నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ అనే పేరుతోతో పిలవాలని కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్ణయించింది.

ఈ యాత్ర 67 రోజుల పాటు సాగనుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ప్రారంభమయ్యే ఈ యాత్ర మొత్తంగా 15 రాష్ట్రాలు, 110 జిల్లాల గుండా సాగుతుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగియనుంది. అయితే ఈ యాత్ర మొదటి సారి ప్రకటించిన సమయంలో 14 రాష్ట్రాల్లోనే సాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. తాజాగా ఒక రాష్ట్రాన్ని అందులో చేర్చింది. ఈ యాత్ర మర్చి 20వ తేదీన ముగియనుంది. 

లక్షద్వీప్ లో ప్రధాని మోడీ సాహసాలు.

కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోడీ సాహసాలు చేశారు. సముద్రం లోపలికి వెళ్లి అక్కడున్న పగడాలు, చేపలను చూశారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో షేర్ చేశారు. సాహస ప్రియులు ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని తమ లిస్టులో చేర్చుకోవాలని సూచించారు. తాను లక్షద్వీప్ పర్యటనలో భాగంగా స్కార్కెలింగ్ చేసేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు. ఇది ఎంతో ఉత్తేజకరమైన అనుభవం అని తెలిపారు. ప్రకృతి అందాలతో పాటు లక్షద్వీప్ ప్రశాంతత కూడా మంత్రముగ్ధులను చేస్తుందని ఆయన అన్నారు. ప్రశాంత వాతావరణం 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడటం ఎలాగో ఆలోచించే అవకాశాన్ని ఇచ్చిందని ప్రధాని అన్నారు.

టీమిండియా ఘన విజయం.. టెస్ట్ సిరీస్ సమం

IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో టీమిండియా 1-1తో సిరీస్‌ను సమం చేసింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో దక్షిణాఫ్రికాలో సిరీస్‌ను డ్రా చేసుకున్న రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతకుముందు 2011లో మహేంద్ర సింగ్ ధోనీ ఆఫ్రికాలో సిరీస్‌ను డ్రా చేశారు. అలాగే.. 31 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 

click me!