Rajya Sabha: 2024లో 69 రాజ్యసభ సీట్లు ఖాళీ.. 9 మంది కేంద్రమంత్రుల పదవీకాలం పూర్తి

By Mahesh K  |  First Published Jan 4, 2024, 8:47 PM IST

రాజ్యసభలో ఈ ఏడాది 69 మంది సభ్యుల పదవీ కాలం ముగియనుంది. లోక్ సభ ఎన్నికలకు ముందే 56 మంది ఎంపీల పదవీ కాలం ముగుస్తున్నది. ఇందులో 9 మంది కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులూ ఉన్నారు. మన్మోహన్ సింగ్, జేపీ నడ్డా వంటి ప్రముఖుల పదవీకాలం పూర్తవుతున్నది.
 


Rajya Sabha: 2024లో 69 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ముందే ఇందులో 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవుతున్నది. ఈ 69 మందిలో మెజార్టీ ఎంపీలు అధికార బీజేపీకి చెందినవారే కావడం గమనార్హం. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 239 సభ్యుల్లో 94 మంది బీజేపీ వారే ఉన్నారు. మెజార్టీ సీట్లు బీజేపీవే. ఆ తర్వాత 30 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నది. 

ఏప్రిల్ లోపు ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ సీట్లలో 30 సీట్లు బీజేపీవే. ఇందులో రాజ్యసభ పదవీ కాలం పూర్తవుతున్న వారిలో తొమ్మిది మంది కేంద్రమంత్రులూ ఉన్నారు. నరేంద్ర మోడీ క్యాబినెట్‌లో ఉండి రాజ్యసభ పదవీ కాలం ముగుస్తున్న కేంద్రమంత్రులు వీరే: భూపేంద్ర యాదవ్, పురుషోత్తం రూపాలా, అశ్విని వైష్ణవ్, దర్మేంద్ర ప్రదాన్, మన్సుఖ్ మాండవీయా, నారాయణ రాణే. కేంద్ర సహాయ మంత్రులు: వీ మురళీధరన్, డాక్టర్ ఎల్ మురుగన్, రాజీవ్ చంద్రశేఖర్.

Latest Videos

undefined

అంతేకాదు, ఈ ఏడాది రాజ్యసభ పదవీ కాలం ముగుస్తున్న వారిలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, ఆప్ నేత సంజయ్ సింగ్, బీజేపీ నేత అమర్ పట్నాయక్, కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింగ్‌లు కూడా ఉన్నారు.

Also Read : వైఎస్ షర్మిలకు టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కౌంటర్

అలాగే, నలుగురు నామినేటెడ్ ఎంపీల పదవీ కాలం కూడా ఏప్రిల్‌తో ముగియనుంది. మహేష్ జెఠ్మలానీ, రాకేశ్ సిన్హా, సోనాల్ మాన్ సింగ్, రామ్ శకల్‌లు ఉన్నారు.

ప్రస్తుతం రాజ్యసభలో ఇలా..

రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య 245. ఇందులో జమ్ము కశ్మీర్ నుంచి నాలుగు సీట్లు, రెండు నామినేటెడ్ సీట్లు ఖాళీ ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం 239 మంది పెద్దల సభలో ఉన్నారు. ఎక్కువ మంది రాజ్యసభ ఎంపీలు గల పార్టీ బీజేపీ. ఈ పార్టీకి 94 మంది రాజ్యసభ ఎంపీలు ఉండగా.. ఆ తర్వాత కాంగ్రెస్‌కు 30 మంది, టీఎంసీకి 13 మంది ఎంపీలు ఉన్నారు. ఆప్, డీఎంకేలకు పది మంది చొప్పున రాజ్యసభలో సభ్యులు ఉన్నారు. బీజేడీ, వైసీపీలకు 9 మంది చొప్పున, బీఆర్ఎస్‌కు ఏడుగురు, ఆర్జేడీకి ఆరుగురు, జేడీయూ, సీపీఎంలకు ఐదుగురి చొప్పున రాజ్యసభ సభ్యులు ఉన్నారు.

కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కొత్తగా అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్యసభలోనూ  పార్టీల బలాబలాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

click me!