Pawan Kalyan: వైసీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోంది.. పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ

Janasena Pawan Kalyan: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనివార్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీని సాగనంపాలని ఏపీ ప్రజలు భావిస్తున్నారనీ, ఈ విషయం పలు సర్వేల్లో వెల్లడవుతున్నని అన్నారు. అవినీతి, అస్తవ్యస్త, హింసాత్మక విధానాలతో సాగుతున్న వైసీపీ పాలనను చాలా బలంగా ఎదుర్కొంటున్న పార్టీ జనసేన అని చెప్పారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కాపు పెద్దలకు ఓ బహిరంగ లేఖ రాశారు. 

Pawan Kalyan open letter to Kapu leaders KRJ

Janasena Pawan Kalyan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఎత్తుకుపై ఎత్తు వేస్తున్నాయి. ఈ తరుణంలో జనసేనాని పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి ఓటమి కళ్లెదుటే కనిపిస్తోందంటూ కాపు నేతలకు బహిరంగ లేఖ రాశారు.  అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోందని ఆరోపించారు.

తాను గౌరవించే కాపు పెద్దలు తనని తిట్టినా దీవెనలుగానే భావిస్తానని అన్నారు. తన్నెంతగా దూషించినా వారికి జనసేన పార్టీ వాకిలి తెరిచే ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పి, కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలని పేర్కొన్నారు. కుట్రలు, కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దంటూ కాపు పెద్దలకు లేఖ రాశారు.  

రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనివార్యమనీ స్పష్టంగా తెలుస్తోందనీ, ఏపీ ప్రజలు వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్దిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండడం వైసీపీ జీర్ణించుకోలేకపోతున్నారని. అందుకే జగన్ సర్కార్ కులపరమైన అస్త్రాన్ని ప్రయోగిస్తోందని ఆరోపించారు పవన్ కళ్యాన్. తాను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి, పార్టీని బలహీనపరిచే దుష్ట ప్రయత్నాలకు ఒడిగడుతోందని, సదరు కాపు పెద్దలు ఆ విధంగా మాట్లాడడానికి వారి కారణాలు వారికి ఉండవచ్చుననీ,  వారిని తాను సహృదయంతో అర్థం చేసుకోగలనని లేఖలో పేర్కొన్నారు.

కాపు పెద్దల తిట్లే తనకు దీవెనలు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కులాల సాధికారతతో పాటు అగ్రకులాల్లోని పేదలకు అండగా నిలిచి వారి ఆర్థిక ఉన్నతికి తోడ్పడాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు జనసేనాని. కులాలను కలిపే ఆలోచనా విధానంతోనే అందరూ ఒకే తాటిపైకి రాగలరన్నది తన విశ్వాసమనీ, అన్ని కులాలను కలుపుకుని అడుగులు వేసే సమర్థత కాపులకు ఉందనీ, కాబట్టే పెద్దన్న పాత్ర తీసుకోవాలని కోరుతున్నారు. 

రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తారనీ,  ఈ విషయాన్ని గుర్తించారు కాబట్టే కాపుల్లో చీలికలు తెచ్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందనీ,  కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఆ తర్వాత ఎటు మళ్లిందో కాపు సామాజిక వర్గం గమనించిందని ఆరోపించారు.

కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని, కాపులకు బలమైన జిల్లాగా భావించే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో కరాఖండీగా ప్రకటించిన జగన్ రెడ్డిని కాపు నేతలు ప్రశ్నించాలని సూచించారు. వైసీపీ ప్రాయోజిత విషపూరిత ప్రచారాలను, తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలను, వార్తలను విశ్వసించవద్దని కాపు సామాజిక వర్గంతోపాటు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నంటూ తన లేఖలో వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios