మళ్లీ రాహుల్ గాంధీ పాదయాత్ర.. పేరులో చిన్న మార్పు.. యాత్ర పూర్తి వివరాలివే..
కాంగ్రెస్ (congress) నేత రాహుల్ గాంధీ (rahul gandhi) మరో సారి యాత్ర చేపడుతున్నారు. జవనరి 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘భారత్ న్యాయ్ యాత్ర (Bharat Nyay Yatra)’ అనే పేరు మొదట ఖరారు చేశారు. కానీ దానిని తాజాగా ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’గా మార్చారు. ఈ యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి సాగుతుంది ? ఎన్ని కిలో మీటర్లు సాగనుంది వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకోవచ్చు.
Bharat Jodo Nyay Yatra : కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతమైంది. దీంతో మళ్లీ ఇప్పుడు రెండో విడత పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ యాత్ర జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ యాత్రకు మొదట ‘భారత్ న్యాయ్ యాత్ర’ అనే పేరు ఖరారు చేశారు. కానీ ఇప్పుడు దానిలో చిన్న మార్పు చేశారు. దానిని ఇక నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ అనే పేరుతోతో పిలవాలని కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్ణయించింది.
ఈ యాత్ర 67 రోజుల పాటు సాగనుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ప్రారంభమయ్యే ఈ యాత్ర మొత్తంగా 15 రాష్ట్రాలు, 110 జిల్లాల గుండా సాగుతుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగియనుంది. అయితే ఈ యాత్ర మొదటి సారి ప్రకటించిన సమయంలో 14 రాష్ట్రాల్లోనే సాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. తాజాగా ఒక రాష్ట్రాన్ని అందులో చేర్చింది. ఈ యాత్ర మర్చి 20వ తేదీన ముగియనుంది.
రాహుల్ గాంధీ మొదటి విడత పాదయాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమై కాశ్మీర్ లో ముగిసింది. 136 రోజుల్లో 4,000 కిలో మీటర్లకు పైగా ఆయన నడిచారు. ఈ రెండో విడత యాత్రలో 15 రాష్ట్రాల్లోని 6700 కిలోమీటర్లు సాగుతుంది. అయితే ఈ సారి కాలినడకనే కాకుండా, వాహనాలను కూడా ఉపయోగించనున్నారు. ఈ యాత్ర మొత్తం 110 జిల్లాలు, 100 లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.
ఈ యాత్ర కోసం ఇండియా కూటమిలోని అన్ని పార్టీలకు, పౌర సమాజానికి, ఆయా రాష్ట్రాల్లోని చిన్న పార్టీలకు ఆహ్వానం పంపనున్నారు. మణిపూర్ లోని ఇంఫాల్ నుంచి యాత్ర ప్రారంభమై నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, యూపీ, గుజరాత్, మహారాష్ట్రలకు చేరుకుంటుంది. మొత్తంగా ఈ యాత్ర మణిపూర్ లో 107, నాగాలాండ్ లో 257, అస్సాంలో 833, పశ్చిమ బెంగాల్ లో 523, జార్ఖండ్ లో 804, ఒడిశాలో 341, బీహార్ లో 425 కిలో మీటర్ల మేర సాగనుంది.
అలాగే యూపీలోని 10 జిల్లాల్లో 1074 కి.మీ, ఛత్తీస్ గఢ్ లోని 7 జిల్లాల్లో 5 రోజుల్లో 436, గుజరాత్ లో 7 జిల్లాల్లో 5 రోజుల్లో 445 , రాజస్థాన్ లో 2 జిల్లాల్లో ఒకే రోజు 128, మహారాష్ట్రలో 7 జిల్లాల్లో 5 రోజుల్లో 480 కిలో మీటర్లు సాగనుంది. కాగా.. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఆర్థిక అసమానతలు, ధ్రువీకరణ, నియంతృత్వం వంటి అంశాలను లేవనెత్తగా, న్యాయ్ యాత్ర దేశ ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంపై దృష్టి పెడుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మీడియాతో వెల్లడించారు.