సాగు చట్టాలు.. రైతులపై కేసులు, రాష్ట్రాలదే తుది నిర్ణయం: కేంద్రమంత్రి తోమర్

By Siva KodatiFirst Published Dec 12, 2021, 9:20 PM IST
Highlights

రైతులపై నమోదైన కేసులకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి (union agriculture minister) నరేంద్ర సింగ్ తోమర్ (narendra singh tomar) కీలక ప్రకటన చేశారు. కేసులు ఉపసంహరణపై ఆయా రాష్ట్రాలదే నిర్ణయమని తోమర్‌ పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగుచట్టాలకు (farm laws) వ్యతిరేకంగా రైతులు దాదాపు ఏడాది పాటు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే . ఎట్టకేలకు దిగివచ్చిన కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఉపసంహరణ బిల్లులకు కూడా నవంబర్‌ 29న పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రైతులు ఢిల్లీలోనే తిష్ట వేశారు. ఆందోళన సమయంలో తమపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. అయితే కేంద్రం హామీపై నిరసనకు స్వస్తి చెప్పి స్వస్థలాలకు బయల్దేరారు. 

ఈ నేపథ్యంలో రైతులపై నమోదైన కేసులకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి (union agriculture minister) నరేంద్ర సింగ్ తోమర్ (narendra singh tomar) కీలక ప్రకటన చేశారు. కేసులు ఉపసంహరణపై ఆయా రాష్ట్రాలదే నిర్ణయమని తోమర్‌ పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయం రాష్ట్రాలదే అయినందున వాటిపై తుది నిర్ణయం కూడా వారిదేనని ఆయన స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆందోళనలను విరమించుకోవడంపై కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం విడుదల చేసే నగదు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే చేరుతోందని ఆయన ఉద్ఘాటించారు.  

Also Read:New Farm laws: సుదీర్ఘ నిరసనకు ముగింపు, సింఘి, టిక్రీ సరిహద్దుల నుండి స్వస్థలాలకు రైతులు

వ్యవసాయ చట్టాల రద్దు నేపథ్యంలో ఉద్యమ సమయంలో వారిపై నమోదైన కేసులతో పాటు కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్లను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతుసంఘాల నేతలకు ఓ లేఖ రాసింది. ఇప్పటికే రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌తో పాటు హర్యానా రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.

కాగా.. శనివారం టిక్రి నిరసన ప్రదేశంలో రైతులు తాము వేసుకొన్న తాత్కాలిక గుడారాన్ని కూల్చివేశారు. వారి వస్తువులను ప్యాక్ చేసుకున్నారు. అంతేకాదు పేదలకు విరాళంగా ఇవ్వాల్సిన వస్తువులను తీసుకోవడంలో రైతులు ఎక్కువ సమయం కేటాయించారు.  పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతులు ఏడాది పాటు తమ నిరసన ప్రదేశంలోని జ్ఞాపికలను తీసుకోవాలని నిర్ణయించుకొన్నారు. మట్టిని చిన్న ప్లాస్టిక్ జాడిలో ప్యాక్ చేశారు. నిరసన కరపత్రాలను సురక్షితంగా బ్యాగుల్లో తీసుకెళ్లారు.15 నెలల సుదీర్ఘ నిరసనకు ముగిసింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన  32 ఏళ్ల మంజిత్ సింగ్ అనే వ్యక్తి నిరసనకారులను తమ స్వస్థలాలకు తరలించడానికి 52 ట్రిప్పుల బస్సులను ఏర్పాటు చేశాడు. నిరసన ప్రదేశం నుండి రైతులు ఖాఖీ చేయడానికి కనీసం నాలుగైదు రోజుల సమయం పడుతుందని బీకెయూ నేత రాకేష్ తికాయత్ (rakesh tikait) చెప్పారు. 

click me!