అలా పెళ్లి చేసుకుంటే చెల్లదా..? హిందూ వివాహాలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

By Rajesh Karampoori  |  First Published May 1, 2024, 11:20 PM IST

Supreme Court: హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన వేడుక లేకుండా కేవలం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని తేల్చి చెప్పింది. ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత ఉండదని తెలిపింది. 


Supreme Court: హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన వేడుక లేకుండా కేవలం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని తేల్చి చెప్పింది. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది. వివాహ వేడుక లేకుండానే యువతీ యువకులు భార్యాభర్తల హోదాను పొందాలనుకునే ఆచారాన్ని తప్పుబట్టింది.

హిందూ వివాహ చట్టం ప్రకారం.. వివాహం పవిత్రమైనదని కోర్టు ధర్మాసనం నొక్కి చెప్పింది, ఎందుకంటే ఇది ఇద్దరు వ్యక్తుల జీవితకాల, గౌరవాన్ని ధృవీకరించే, సమానమైన, అంగీకారంతో, ఆరోగ్యకరమైన కలయికను అందిస్తుందని పేర్కొంది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం.. సంప్రదాయబద్ధంగా, వేడుక లేకుండా వివాహాలు జరిగితే.. ఏ సంస్థ జారీ చేసిన సర్టిఫికేట్ కు చట్టబద్ధత ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Latest Videos

‘‘కొన్ని ప్రయోజనాల కోసం భవిష్యత్తులో వివాహం చేసుకుంటామనే ఉద్దేశంతో ఓ పురుషుడు, ఓ మహిళ తమ వివాహాన్ని డాక్యుమెంట్ ఆధారంగా నమోదు చేసుకోవడానికి ప్రయత్నించే అనేక ఘటనలు ఇటీవలి కొన్నేళ్లలో మేము చూశాము’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘విదేశాలకు వలస వెళ్ళడానికి వీసా కోసం దరఖాస్తు చేయడానికి యువ జంటల తల్లిదండ్రులు వివాహ నమోదుకు అంగీకరిస్తున్నారని మేము గమనించాము. సమయాన్ని ఆదా చేయడానికి ఇది పనికొస్తుంది. కానీ వివాహ వేడుక మాత్రం పెండింగ్ లో ఉంచుతున్నారు. ఇలాంటి పద్ధతులను తొలగించాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.

భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ పవిత్రతను నొక్కిచెప్పిన ధర్మాసనం.. వివాహం అనేది పాటలు, డ్యాన్స్ లు, భోజనాలు చేయడం, కట్నకానుకలు, గిఫ్ట్ లు తీసుకొనే సందర్భంగా కాదని తెలిపింది. ‘పెళ్లి అనేది వాణిజ్యపరమైన వ్యవహారం కాదు. భారత సమాజంలో భార్యాభర్తల హోదాను పొందే స్త్రీ, పురుషుల మధ్య సంబంధాన్ని నెలకొల్పడానికి జరుపుకునే పవిత్ర పునాది కార్యక్రమం ఇది’’ అని ధర్మాసనం పేర్కొంది. వివాహం అనేది వ్యక్తికి మోక్షాన్ని ప్రసాదించే సంఘటనగా పరిగణిస్తారని, ఆచార వేడుకలు, సాంస్కృతిక వైవిధ్యాలతో ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఉనికిని శుద్ధి చేస్తాయని, మారుస్తాయని చెబుతారని ధర్మాసనం పేర్కొంది.
 

click me!