Viral Video: వాట్ ఏ ఐడియా సర్‌జీ.! ఫ్రిడ్జ్ ను ఇలా కూడా వాడొచ్చా.. !!

By Rajesh Karampoori  |  First Published May 1, 2024, 6:20 PM IST

Viral Video: ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఏసీలు, కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ, ఓ యువకుడు మాత్రం కొత్తగా ఆలోచించాడు. తన వద్ద అందుబాటులో ఉన్న వస్తువుల సాయంతో తన రూమ్ ను చల్లగా మార్చేసుకున్నాడు.  ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారుతుంది. 


Viral Video: ఎండలు మండిపోతున్నాయి. మే నెలలోకి ప్రవేశించడంతో దేశమంతా వడగాల్పులు వీస్తున్నాయి. దానిని అధిగమించేందుకు, ఉక్కపోత నుంచి కాస్త రిలీఫ్ పొందేందుకుప్రజలు అన్ని రకాల పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉన్న వారు ఇంట్లో ఏసీలు పెట్టించుకుంటే.. మధ్య తరగతి జీవులు మాత్రం ఇంట్లోకి కూలర్లు తెచ్చుకుంటున్నారు. వాటి ద్వారా వేడి నుంచి కాస్తా ఉపశమనం పొందుతున్నారు. 

ఇది వరకే కూలర్లు ఉండి పాడైపోయిన మూలనపడిపోయి ఉన్న వాటిని బయటకు తీస్తున్నారు. వాటికి రిపేర్లు చేయించి వాడుకుంటున్నారు. ఏసీలు కొనడం, వాటిని మెయింటెన్ చేయడం అందరితో సాధ్యం కాదు కదా.. అందుకే కూలర్లతోనే సర్దుకుపోతున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం కొత్తగా ఆలోచించాడు. తన ఇంట్లో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఏసీలో ఉన్న ఫీలింగ్ పొందాలనుకున్నాడు. 

Latest Videos

దానికి తన ఇంట్లో ఉన్న కూలర్, రిఫ్రిజిరేటర్ ను ఉపయోగించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కూలర్ కు సైడ్స్ రెండు వైపులా ఉన్న విండో లాంటి భాగాలను తొలగించారు. తరువాత దానిని ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ డోర్లు తెరిచాడు. ఆ కూలర్ వెనకాల భాగంను రిఫ్రిజిరేటర్ ముందు ఉంచాడు. రిఫ్రిజిరేటర్, కూలర్ లను ఆన్ చేశాడు. ఇంకేముంది రిఫ్రిజిరేటర్ నుంచి వచ్చే కూలింగ్ ను కూలర్ రూమ్ మొత్తానికి పంపించడం ప్రారంభించింది. 

ఆ రేకుల ఇంట్లో ఆ యువకుడు చాపపై నిద్రపోతుండగా.. కూలర్ సాయంతో రిఫ్రిజిరేటర్ నుంచి వచ్చే కూలింగ్ వల్ల రూమ్ అంతా చల్లబడింది. దీంతో ఆ యువకుడికి ఏసీలో ఉన్న ఫీలింగ్ కలిగింది. అతడు రేకుల ఇంట్లోనూ చల్లగా, హాయిగా నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. భారతదేశంలో తెలివైన యువకులకు ఢోకా లేదని, వారి నైపుణ్యాలను సరిగ్గా ఉపయోగిస్తే ఎలాంటి పనినైనా సుసాధ్యం చేయగలరని ఈ వీడియో నిరూపించింది. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. పలువురు ఆ యువకుడి తెలివిని అభినందిస్తుండగా.. మరి కొందరు ఇది తెలివి తక్కువ పని అని విమర్శిస్తున్నారు. ఫిజిక్స్ రూల్స్ ప్రకారం ఈ విధానం వల్ల రూమ్ మరింత వేడిగా మారుతుంది కానీ, చల్లబడదని ఓ యూజర్ పేర్కొన్నారు. అయితే కొందరు మాత్రం యువకుడి ఆలోచనను మెచ్చుకుంటున్నారు. ఇంతకీ యువకుడు చేసిన పనిపై మీ అభిప్రాయం ఏమిటి ?

click me!