జమ్మూలో ఏడోసారి గవర్నర్ పాలన: వోహ్రా హయాంలోనే నాలుగోసారి, ఎందుకంటే?

First Published Jun 20, 2018, 11:01 AM IST
Highlights

జమ్మూలో మరోసారి గవర్నర్ పాలన

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో మరో సారి గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. తాజాగా అమల్లోకి వచ్చిన గవర్నర్ పాలనతో ఇప్పటివరకు  ఆ రాష్ట్రంలో  ఏడు దఫాలు  గవర్నర్ పాలన విధించారు. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్న ఎన్ఎన్ వోహ్రా హయంలోనే  ఇప్పటికే మూడు దఫాలు గవర్నర్ పాలన సాగింది. తాజాగా గవర్నర్ పాలన రావడంతో వోహ్రా హయాంలోనే నాలుగో దఫా  ఆ రాష్ట్రం గవర్నర్ పాలనలోకి వచ్చింది.


జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కాల్పుల విరమణ విషయమై  బిజెపి, పీడీపీ మధ్య విబేధాలు నెలకొన్నాయి.  ఈ విబేధాల నేపథ్యంలో  పీడీపీ ప్రభుత్వానికి బిజెపి తన మద్దతును మంగళవారం నాడు ఉపసంహరించుకొంది. దీంతో  పీడీపీ ప్రభుత్వం మైనార్టీలో పడింది.  ఈ కారణంగా సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ మంగళవారం నాడు మధ్యాహ్నం రాజీనామా చేశారు.

ఏ పార్టీ కూడ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాలేదు. దరిమిలా  గవర్నర్ పాలన ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా రాష్ట్రపతి కోవింద్‌కు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదలనకు  కోవింద్ ఆమోదముద్ర వేశారు. 

జమ్మూలో రాజకీయ అస్థిరత కారణంగా పలు దఫాలు గవర్నర్ పాలన విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.1977 మార్చిలో  తొలిసారిగా ఇక్కడ గవర్నర్ పాలనను విధించారు.  ఆనాడు నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి అప్పటి జమ్మూ కాంగ్రెస్ అధ్యక్షుడు సయీద్ మద్దతును ఉపసంహరించడంతో గవర్నర్ పాలన ఏర్పాటు చేయడం అనివార్యంగా మారింది. 1986లో రెండోసారి గవర్నర్‌ పాలన విధిం చారు. గులాం మొహమ్మద్‌ షా ప్రభుత్వానికి సయీద్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది.

1990 జనవరిలో మూడోసారి గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో సయీద్‌ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. గవర్నర్‌గా జగ్మోహన్‌ నియామకంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సీఎం ఫరూక్‌ వ్యతిరేకించినప్పటికీ జగ్మోహన్‌ను గవర్నర్‌గా నియమించారు. దీనికి నిరసనగా సీఎం ఫరూక్‌ అబ్దుల్లా రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది. ఈ సమయంలోనే అత్యధికంగా ఆరేళ్ళ 264 రోజుల పాటు  జమ్మూలో  గవర్నర్ పాలన సాగింది.

2002 అక్టోబర్‌లో నాలుగోసారి గవర్నర్‌ పాలన విధించారు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా సీఎంగా కొనసాగడానికి నిరాకరించడంతో గవర్నర్‌ పాలన అనివార్యమైంది. అయితే ఈసారి 15 రోజులే ఈ పాలన సాగింది. 2008లో ఐదోసారి గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. గులాం నబీ ఆజాద్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌– పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి పీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి విధించారు.

 2014 డిసెంబర్‌ అసెంబ్లీ ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఒమర్‌ అబ్దుల్లా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 2015 జనవరి 7న ఆరోసారి గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. మాజీ సీఎం ముఫ్తీ సయీద్‌ మరణానంతరం 2016 జనవరి 8న గవర్నర్‌ పాలన విధించారు. తాజాగా 2018 జూన్ 19వ తేదిన మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడంతో  గవర్నర్ పాలన  అనివార్యంగా మారింది. 

click me!