జగన్ విక్టరీ ఎఫెక్ట్: ప్రశాంత్ కిశోర్ తో మమతా బెనర్జీ డీల్

By telugu teamFirst Published Jun 6, 2019, 5:36 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడమే గగనమని అనిపించిన స్థితిలో వైఎస్సార్ కాంగ్రెసు విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. మమతా బెనర్జీ ప్రశాంత్ కిశోర్ ను తన వ్యూహకర్తగా ఎంచుకోవడానికి మొదటి కారణం ఇది.

కోల్ కతా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆయనకు చెందిన ఐ క్యాప్ సంస్థ మమతా బెనర్డీ వ్యూహకర్తగా పనిచేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రశాంత్ కిశోర్ తో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. తృణమూల్ కాంగ్రెసు కోసం పనిచేయడానికి ఆయన అంగీకరించారు.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అంచనాలకు మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 స్థానాల్లో 151 స్థానాలను గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడమే గగనమని అనిపించిన స్థితిలో వైఎస్సార్ కాంగ్రెసు విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. మమతా బెనర్జీ ప్రశాంత్ కిశోర్ ను తన వ్యూహకర్తగా ఎంచుకోవడానికి మొదటి కారణం ఇది.

మరో కారణం... పశ్చిమ బెంగాల్ లో బిజెపి లోకసభ ఎన్నికల్లో అనూహ్యంగా బలాన్ని పుంజుకోవడం రెండవ కారణంగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో బిజెపి 18 స్థానాలను గెలుచుకుని మమతాకు గట్టి పోటీ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ శానససభ ఎన్నికలు 2021లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బిజెపి తృణమూల్ కాంగ్రెసును ఎదుర్కోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఈ స్థితిలో ప్రశాంత్ కిశోర్ అవసరం దీదీకి అవసరంగా మారింది. 

ప్రశాంత్ కిశోర్ నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియులో సభ్యుడిగా ఉన్నారు. జెడియు ఎన్డీఎలో భాగస్వామ్య పక్షం. బిజెపిని ఎదుర్కోవడానికి సిద్ధపడిన మమతా బెనర్జీకి ప్రశాంత్ కిశోర్ సాయం చేయడం కుదురుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, ప్రశాంత్ కిశోర్ జెడియు సభ్యుడైనప్పటికీ తన ఎన్నికల వ్యూహానికి సంబంధించిన కార్యకలాపాన్ని స్వతంత్రంగానే కొనసాగిస్తున్నారు. 

ప్రశాంత్ కిశోర్ 2014లో లోకసభ ఎన్నికల్లో బిజెపి వ్యూహకర్తగా పనిచేశారు. ఆ సమయంలో బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. బీహార్ లో జెడియు వ్యూహకర్తగా పనిచేసి, ఆ పార్టీ అధికారానికి తెచ్చింది. పంజాబ్ లో కాంగ్రెసు నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ కు వ్యూహకర్తగా పనిచేసి ఫలితాలను రాబట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసుకు పనిచేశారు. కానీ కాంగ్రెసు పరాజయం పాలైంది. యుపిలో కాంగ్రెసు ఆయన మాటలను వినలేదనే అభిప్రాయం ఉంది. 

click me!