Omicron Variant : భారత్‌లో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. మహారాష్ట్రలో కొత్తగా ఒకరికి, నాలుగుకు చేరిన కేసులు

By Siva KodatiFirst Published Dec 4, 2021, 7:56 PM IST
Highlights

భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) చాప కింద నీరులాగా విస్తరిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో (karnataka) ఇద్దరికి, గుజరాత్‌లో ఒకరికి ఈ వైరస్ సోకింది. దేశంలో నాలుగో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసింది. ముంబైకి చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యింది. అతని వయసు 33 ఏళ్లుగా తెలుస్తోంది.

భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) చాప కింద నీరులాగా విస్తరిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో (karnataka) ఇద్దరికి, గుజరాత్‌లో ఒకరికి ఈ వైరస్ సోకింది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ ఏదో ఒక దారిలో ఈ మహమ్మారి ప్రవేశిస్తూనే వుంది. తాజాగా దేశంలో నాలుగో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసింది. ముంబైకి చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్‌గా నిర్ధారణ అయ్యింది. అతని వయసు 33 ఏళ్లుగా తెలుస్తోంది. ఈయన సౌతాఫ్రికా నుంచి దుబాయ్‌ మీదుగా ముంబై వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. ఆ యువకుడు ధోంబివాలీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

మరోవైపు.. హైదరాబాద్‌కు (hyderabad) చెందిన సీఎస్ఐఆర్ సీసీఎంబీ (ccmb) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా (rakesh mishra) కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై కీలక అభిప్రాయాలు వెల్లడించారు. కర్ణాటకలో (karnataka) నమోదైన రెండు కేసుల్లో ఒకరు దక్షిణాఫ్రికా పర్యటించిన విదేశీయుడు కాగా, మరొకరు ఎలాంటి విదేశీ పర్యటన చరిత్ర లేని బెంగళూరు (bangalore) నివాసి అని గుర్తు చేశారు. ఎక్కడికి వెళ్లకున్నా ఆయనకు ఒమిక్రాన్ సోకడాన్ని చూస్తే ఇది వరకు మన దేశంలో ఒమిక్రాన్ ఉన్నదని తెలుస్తున్నదని అన్నారు. కాబట్టి, అన్ని కేసులు కేవలం ఎయిర్‌పోర్టుల నుంచే వస్తున్నాయని అనుకోవాల్సిన అవసరం లేదని, బహుశా ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఒమిక్రాన్ ఉండవచ్చునని అంచనా వేశారు.

Also Read:Omicron: దేశంలోని చాలా నగరాల్లో ఒమిక్రాన్.. రెండో కేసు వాస్తవాన్ని వెల్లడిస్తోంది.. సీసీఎంబీ డైరెక్టర్ అంచనా

ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, కేవలం మనం డిటెక్ట్ చేసిన మేరకే ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని అనుకోవద్దని తెలిపారు. ఈ కోణంలో చూస్తే మన దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు ఉండే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కాబట్టి, ఈ రెండో కేసు మనకు ఒక మేలుకొలుపు పిలుపు అవ్వాలని అన్నారు. కాబట్టి, పర్యవేక్షణ, జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు గణనీయంగా పెంచి ఒమిక్రాన్ తీవ్రతను అంచనా వేయాలని సూచించారు.

అయితే, ఒమిక్రాన్ కేసులు నమోదైన వాటి కంటే ఎక్కువే ఉండొచ్చన్న వాదనతో ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని వివరించారు. ఇందులోని పాజిటివ్ సైడ్‌ను కూడా చూడాలని తెలిపారు. మన దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు ఉన్నప్పటికీ ప్రజల ప్రాణాలకు పెద్ద ముప్పు కలిగించలేదని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ వేరియంట్ కారణంగా హాస్పిటల్‌లో చేరే వారి సంఖ్య, కరోనా కారణంగా మరణించే వారి సంఖ్య కూడా పెద్దగా పెరగలేదని వివరించారు. ఒమిక్రాన్ వల్ల లక్షణాలు తీవ్రంగా లేకపోవడం మరో ఉపశమనం ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చని తెలిపారు. ఎందుకంటే ఇప్పటికే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ వరకూ వెళ్లినా.. ఆరోగ్య వ్యవస్థపై దాని ప్రభావం అంతగా లేకపోవడం కొంతలో కొంత నయం అని వివరించారు.

click me!