హైదరాబాద్‌కు చెందిన సీఎస్ఐఆర్ సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై కీలక అభిప్రాయాలు వెల్లడించారు. కర్ణాటకలో నమోదైన రెండు కేసుల్లో ఒకరు దక్షిణాఫ్రికా పర్యటించిన విదేశీయుడు కాగా, మరొకరు ఎలాంటి విదేశీ పర్యటన చరిత్ర లేని బెంగళూరు నివాసి అని గుర్తు చేశారు. ఎక్కడికి వెళ్లకున్నా ఆయనకు ఒమిక్రాన్ సోకడాన్ని చూస్తే ఇది వరకు మన దేశంలో ఒమిక్రాన్ ఉన్నదని తెలుస్తున్నదని అన్నారు. కాబట్టి, అన్ని కేసులు కేవలం ఎయిర్‌పోర్టుల నుంచే వస్తున్నాయని అనుకోవాల్సిన అవసరం లేదని, బహుశా ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఒమిక్రాన్ ఉండవచ్చునని అంచనా వేశారు. 

హైదరాబాద్: ఒమిక్రాన్(Omicron) కేసులు ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో రిపోర్ట్ కావడం మొదలైంది. తొలి రెండు Karnatakaలో నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా, Gujaratలో మరో కేసు నమోదైంది. తొలి రెండు కేసులపైనే చర్చ తీవ్రంగా జరుగుతున్నది. ఎందుకంటే ఆ రెండు కేసుల్లో ఒకరు విదేశీయులు. South Africa తిరిగి వచ్చిన ట్రావెల్ హిస్టరీ ఉన్నది. కానీ, రెండో వ్యక్తి బెంగళూరు వాసి. బయట దేశాలు తిరిగిన చరిత్ర లేదు. ఈ రెండో కేసుపైనే చర్చ జరుగుతున్నది. విదేశీ పర్యటన చరిత్ర లేకుండా బెంగళూరు నగరంలో ఉన్న వ్యక్తికి ఎలా ఒమిక్రాన్ పాజిటివ్ సోకింది అనే చర్చ ఉన్నది. ఈ కోణంలో తాజాగా, ప్రతిష్టాత్మకమైన సీఎస్ఐఆర్-సీసీఎంబీ(CSIR-CCMB) సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడారు.

గురువారం మన దేశంలో తొలి రెండు ఒమిక్రాన్ కేసులు కర్ణాటకలో నమోదయ్యాయి. తాజాగా, ఈ రోజు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జింబాబ్వే నుంచి వచ్చిన 72ఏళ్ల వ్యక్తిలోనూ ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలోనే సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడారు. విదేశీ పర్యటన చేయకుండానే బెంగళూరులోని నివాసికి ఒమిక్రాన్ పాజిటివ్ రావడాన్ని గురించి చెప్పారు. ఈ ఉదంతం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నదని తెలిపారు. అన్ని ఒమిక్రాన్ కేసులు కేవలం విమానాశ్రయాల నుంచే రావడం లేదని స్పష్టమైందని అన్నారు. అంటే, ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే మన దేశంలోనే ఉన్నదని(Presence) వెల్లడి అవుతున్నదని వివరించారు.

Also Read: Omicron Variant : భారత్‌లో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. గుజరాత్‌లో కొత్తగా ఒకరికి, దేశంలో మూడుకు చేరిన కేసులు

ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, కేవలం మనం డిటెక్ట్ చేసిన మేరకే ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని అనుకోవద్దని తెలిపారు. ఈ కోణంలో చూస్తే మన దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు ఉండే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కాబట్టి, ఈ రెండో కేసు మనకు ఒక మేలుకొలుపు పిలుపు అవ్వాలని అన్నారు. కాబట్టి, పర్యవేక్షణ, జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు గణనీయంగా పెంచి ఒమిక్రాన్ తీవ్రతను అంచనా వేయాలని సూచించారు.

అయితే, ఒమిక్రాన్ కేసులు నమోదైన వాటి కంటే ఎక్కువే ఉండొచ్చన్న వాదనతో ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని వివరించారు. ఇందులోని పాజిటివ్ సైడ్‌ను కూడా చూడాలని తెలిపారు. మన దేశంలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు ఉన్నప్పటికీ ప్రజల ప్రాణాలకు పెద్ద ముప్పు కలిగించలేదని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ వేరియంట్ కారణంగా హాస్పిటల్‌లో చేరే వారి సంఖ్య, కరోనా కారణంగా మరణించే వారి సంఖ్య కూడా పెద్దగా పెరగలేదని వివరించారు. ఒమిక్రాన్ వల్ల లక్షణాలు తీవ్రంగా లేకపోవడం మరో ఉపశమనం ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చని తెలిపారు. ఎందుకంటే ఇప్పటికే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ వరకూ వెళ్లినా.. ఆరోగ్య వ్యవస్థపై దాని ప్రభావం అంతగా లేకపోవడం కొంతలో కొంత నయం అని వివరించారు.

Also Read: Omicron: ఒమిక్రాన్ బారిన పడ్డ ఆ ఇద్దరు ఎవరు? వారి ఆరోగ్యం ఎలా ఉంది?

కరోనా కేసులు కొంత నెమ్మదించడం, టీకా పంపిణీ వేగం అందుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో చాలా వరకు భారతీయులు కొవిడ్ ముందు జాగ్రత్తలు పాటించడంపై అలసత్వం వహిస్తున్నారని డాక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా కరోనా ముందు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే టీకా వేసుకోవాలని సూచించారు.

వ్యాక్సిన్ అనేది హెల్మెట్ వంటిదని, హెల్మెట్ ధరించడం వలన ప్రమాదాలను నివారించలేకపోవచ్చును కానీ, ప్రమాద తీవ్రతను చాలా వరకు తగ్గిస్తుందని డాక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు. అదే తరహాలో వ్యాక్సిన్ కరోనా బారిన పడకుండా ఆపలేదేమో కానీ, తద్వార హాస్పిటల్ చేరాల్సిన పరిస్థితులను, మరణాలను గణనీయంగా తగ్గిస్తుందని వివరించారు.