Facts On Nipah: నిపా వైరస్ అనుమాన సంక్రమణ కారణంగా రెండు అసహజ మరణాలు సంభవించడంతో కేరళ ఆరోగ్య శాఖ సోమవారం కోజికోడ్ జిల్లాలో ఆరోగ్య హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారని ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో దేశ ఆరోగ్య యంత్రాంగం అప్రమత్తమైంది. మునుపటి భయంకరమైన జ్ఞాపకాలను తిరిగి తీసుకువచ్చింది. ఇప్పటికీ నిర్థిష్టమైన మందులు, వ్యాక్సిన్లు లేని ఈ నిపా వైరస్ లక్షణాలు, ప్రస్తుతం అందిస్తున్న చికిత్స, వ్యాప్తి సంబంధించిన పలు విషయాలు గమనిస్తే..
- నిపా వైరస్ సంక్రమిస్తే మరణం సంభవించే రేటు అధికంగా ఉంటుంది. ఇప్పటివరకు దీని చికిత్స ఎటువంటి నిర్థిష్టమైన మందులు, వ్యాక్సిన్లు లేవని వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, అందుబాటులో ఉన్న వివిధ మందులు, వ్యాక్సిన్లతో చికిత్స అందిస్తున్నారు.
- నిఫా అనేది జూనోటిక్ వైరస్, ఇది జంతువుల నుండి మానవులకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ మొదట గుర్తించిన మలేషియా గ్రామం పేరు మీద పెట్టారు. ఎగిరే నక్కలు అని కూడా పిలువబడే పండ్ల గబ్బిలాలు నిఫా వైరస్ ను కలిగివుంటాయి.
- వైరస్ సోకిన పండ్లు గబ్బిలాలు మానవులకు లేదా ఇతర జంతువులకు సంక్రమణను వ్యాప్తి చేస్తాయి. సోకిన జంతువుతో లేదా దాని శరీర ద్రవాలతో సన్నిహిత సంబంధం వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. సోకిన వ్యక్తి వైరస్ ను మరొకరికి వ్యాప్తి చేయవచ్చు.
- నిపా సంక్రమణ శ్వాసకోశ సమస్యల నుండి ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ వరకు అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అంటే మెదడు వాపు, జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరింత తీవ్రమైన లక్షణాలు శరీర అవయవాలు పనిచేయకుండా చేస్తాయి. అంటే కదలలేని స్థితి, మూర్ఛ, కోమాకు కారణం అవుతుంది.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, నిపా సంక్రమణ కేసులలో మరణాల రేటు 40 శాతం నుండి 75 శాతం మధ్య ఉంది. దీనిని గుర్తించి చికిత్స అందిస్తే మరణ రేటు తగ్గుతుందని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. నిపాకు ప్రత్యేకమైన మందులు లేదా వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో లేవు. "తీవ్రమైన శ్వాసకోశ, న్యూరోలాజిక్ సమస్యలకు చికిత్స చేయడానికి ఇంటెన్సివ్ సపోర్టివ్ కేర్ సిఫార్సు చేయబడింది" అని నిపా సంక్రమణపై డబ్ల్యూహెచ్ఓ నోట్ పేర్కొంది.
- ప్రజల్లో నిపా సంక్రమణను తగ్గించడానికి లేదా నివారించడానికి ఏకైక మార్గం అవగాహనను వ్యాప్తి చేయడం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెబుతోంది. తినడానికి ముందు పండ్లను బాగా కడగాలనీ, వైరస్ సోకిన వ్యక్తులతో కాంటాక్ట్ అయిన తర్వాత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది.