కృత్రిమ మేధస్సు (AI) ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తోంది, దీంతో ఎన్నికల సంఘం AI దుర్వినియోగాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకుంటోంది. డీప్‌ఫేక్‌లు మరియు తప్పుడు సమాచారం వంటి ఆందోళనలను పరిష్కరించడానికి మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు.
Artificial intelligence : ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం వైపు వేగంగా కదులుతోంది. ఈ ఏఐ టెక్నాలజీ మరో విప్లవాన్ని సృష్టిస్తోంది... ప్రతి రంగంలో ఇది పెనుమార్పులకు కారణమవుతోంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వల్ల కేవలం ప్రయోజనాలే కాదు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఏఐ దుర్వినియోగంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల ప్రచారం కోసం ప్రకటనలతో సహా ఇతర ఎన్నికల వ్యవహారాల్లో కృత్రిమ మేధస్సు (AI) పాత్ర వేగంగా పెరుగుతోంది. దీంతో ఎన్నికల సంఘం ఈ ఏఐపై కూడా దృష్టిపెట్టాల్సి వస్తోంది... దీంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఏఐ దుర్వినియోగాన్ని నిరోధించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. ఇందుకోసం మార్గదర్శకాలను కూడా సిద్ధం చేస్తున్నారు. వీటిని అతి త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే బిహార్, తమిళనాడు ఎన్నికలకు రాజకీయ పార్టీలు సంసిద్దం అవుతున్నాయి... ఈసిఐ కూడా ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ ఎన్నికల్లోనే ఏఐ ద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రభావితం కాకుండా ఉండే మార్గదర్శకాలను అమలుచేసే అవకాశం ఉంది. అంటే రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఈ ఏఐ జనరేటెడ్ కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండేలా మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు.
గత కొంతకాలంగా డీప్‌ఫేక్ దుర్వినియోగం కారణంగా బాధ్యతాయుతమైన వ్యక్తులు, సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. భారతదేశంలోని అత్యున్నత ఎన్నికల సంస్థ అయిన ఈసిఐ ఏఐ వాడకాన్ని నిషేధించలేదు కానీ ప్రచారాలలో డీప్‌ఫేక్‌ల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతున్న ఏఐ వినియోగం మరియు ఓటర్లను ప్రభావితం చేసే దాని సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఇప్పటికే జాగ్రత్తపడుతోంది. అన్ని రాజకీయ పార్టీలకు గత లోక్ సభ ఎన్నికల సమయంలోనే ఈ ఏఐకి సంబంధించి కీలక ఆదేశాలిచ్చింది... ఏఐ జనరేటెడ్ కంటెంట్ వాడకంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నొక్కి చెబుతుంది.
ఏఐ పద్ధతులను ఉపయోగించి సృష్టించబడిన లేదా సవరించబడిన ఏవైనా ఫోటోలు, వీడియోలు, ఆడియో లేదా ఇతర కంటెంట్‌పై "ఏఐ జనరేటెడ్", "డిజిటల్‌గా మెరుగుపరచబడినవి" అనేలా సంకేతాలను ఉంచాలని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను కోరింది. దీంతోపాటు ప్రచార కంటెంట్ లేదా ప్రకటనలను వ్యాప్తి చేసేటప్పుడు ప్రత్యేకంగా రూపొందించిన కంటెంట్ ఉపయోగిస్తే దానిపై స్పష్టమైన డిస్క్లైమర్‌ను జోడించాలని రాజకీయ పార్టీలను ఆదేశించారు.
ఎన్నికల సంఘం నకిలీ వార్తలను అరికట్టడానికి సోషల్ మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని హెచ్చరించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడం మరియు ఓటర్లను తప్పుదారి పట్టించకుండా రక్షించడం ఈ సలహా లక్ష్యం అని ఎన్నికల సంఘం తెలిపింది.