ష్.. సైలెన్స్.. ఇది ఎన్ని అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందో తెలుసా..!

By Mahesh RajamoniFirst Published Aug 27, 2022, 3:03 PM IST
Highlights

కొంతమంది అవసరానికే మాట్లాడితే.. ఇంకొంతమంది మాత్రం అవసరానికి మించి అతిగా మాట్లాడుతుంటారు. మరికొంతమంది అసలే మాట్లాడరు. ఏదేమైనా మాట్లాడితేనే ఇతరులతో కమ్యూనికేట్ అవుతాం.. ఈ సంగతి పక్కన పెడితే.. సైలెంట్ గా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 


ప్రతిరోజూ మనం ఎన్నో రకాల శబ్దాలను వింటుంటాం.. ఇక సిటీల్లో అయితే 24 గంటలు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. వాహనాల సౌండ్, మనుషుల అరుపులు, మాటలు, యంత్రాలు నడపడం వంటి ఎన్నో శబ్దాలను వింటుంటాం. ఇవీ చాలవన్నట్టు కొంతమంది ఇయర్ ఫోన్ పెట్టుకుని పాటలతో రోజును వెల్లదీస్తారు. శాస్త్రీయ ఆధారాల ప్రకారం.. ఈ శబ్దం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎప్పుడూ రకరకాల  శబ్దాలు చేసే హాని అంతా ఇంతా కాదు.. కానీ నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఎప్పుడూ శబ్దాలను వింటే తెగ చిరాకు పుడుతుంది. కానీ మనం ఎప్పుడూ ఏదో ఒక శబ్దాన్ని వింటూనే ఉంటాం. అయితే కాసేపు నిశ్శబ్దమైన ప్రదేశంలో గడపడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇది ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

రక్తపోటును తగ్గిస్తుంది

అధిక రక్తపోటు వల్ల ఆకస్మత్తుగా చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే నిశ్శబ్దం మరణం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. రక్తపోటును తగ్గించడంలో నిశ్శబ్దం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 2006 నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. సంగీతం విన్న తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉండటం వల్ల హృదయ స్పందన రేటు, రక్తపోటు గణనీయంగా తగ్గిందని కనుగొన్నారు. నెమ్మదిగా.. రిలాక్స్ అయ్యే సంగీతంతో పోలిస్తే.. నిశ్శబ్దం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఇది గుండె సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. 2003 లో చేసిన ఓ పరిశోధన ప్రకారం దీర్ఘకాలం పాటు శబ్దాలను వినడం వల్ల హృదయ స్పందన రేటు,  రక్తపోటు పెరగుతుందని తేలింది. 

ఏకాగ్రత, శ్రద్ధ మెరుగుపడుతుంది

నిశ్శబ్దం వల్ల ఒక విషయంపై ఏకాగ్రత పెరుగుతుంది. ఇది విషయాన్ని రకరకాల కోణాల్లో ఆలోచించేలా చేస్తుంది. సమస్యకు పరిష్కారాన్ని తొందరగా కనుకోవడానికి సహాయపడుతుంది. శబ్దాల వల్ల పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. తొందరగా కూడా కాదు. 2021 లో చేసిన ఓ అధ్యయనంలో  తక్కువ నిశ్శబ్దంలో పనిచేసిన వారు తక్కువ ఒత్తిడికి గురయ్యారని వెల్లడైంది. 

అనవసరమైన ఆలోచనలను రానీయదు

కొంతమందికి అదేపనిగా ఆలోచించే అలవాటుంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ ఆలోచనలు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మనసును స్థిరంగా ఉంచడానికి నిశ్శబ్దం ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిశ్శబ్దంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వస్తువులను  పరిశీలించడానికి కాస్త సమయం వెచ్చిస్తే అనవసరమైన ఆలోచనలు రావు. 

మెదడు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది

మనస్సు ప్రశాంతంగా ఉంటేనే మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.  ఒక 2013 లో జరిగిన ఓ  అధ్యయనం ప్రకారం.. 2 గంటల నిశ్శబ్దం కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందని కనుగొన్నారు. ఇది జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. 

కార్టిసాల్ ను తగ్గిస్తుంది

నిశ్శబ్దం ఏకాగ్రతను పెంచడమే కాదు పనిచేసే వ్యక్తుల్లో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్  స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. కొన్ని రకాల శబ్దాలు మానసిక ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ స్థాయలను పెంచుతాయి. కార్టిసాల్ ఎక్కువగా ఉంటే విపరీతంగా బరువు పెరగడం, భావోద్వేగాల్లో మార్పులు, నిద్ర సమస్యలు, ఎన్నోదీర్ఘకాలిక వ్యాధులు తలెత్తుతాయి. 

click me!