పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే లోన్లు.. జననాల రేటు పెంచడానికి చైనా ప్రోత్సాహకాలు

By Mahesh KFirst Published Dec 25, 2021, 6:20 AM IST
Highlights

అత్యధిక జనాభా గల చైనా ఇప్పుడు జననాల రేటు పెంచడంపై ఫోకస్ పెట్టింది. వన్ చైల్డ్ పాలసీతో సుమారు 40 కోట్ల జననాలను నివారించగలిగిన ఈ దేశం మారుతున్న జనాభా తీరుతెన్నులను దృష్టిలో పెట్టుకుని జననాల రేటు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అందుకే వన్ చైల్డ్ పాలసీని టూ చైల్డ్ పాలసీగా, దాన్ని మరోసారి సవరించి త్రీ చైల్డ్ పాలసీగా ప్రకటించింది. కానీ, నిర్ణయాలు తీసుకున్నంత సులువుగా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు.

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక జనాభా(Population) గల దేశం చైనా(China). జనాభా అరికట్టడానికి ఆ దేశం తీసుకున్న ‘వన్ చైల్డ్ పాలసీ’ (Child Policy) అందరికీ తెలిసిందే. ఈ పాలసీని అమలు చేయడానికి ఆ దేశం కర్కశ విధానాలను అమలు చేసిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఎట్టకేలకు ఆ పాలసీ విజయవంతం అయిందని, జనాభా నియంత్రణ సాధ్యపడిందని, ఈ పాలసీ వల్ల 40 కోట్ల జననాలను నివారించగలిగినట్టు చైనా అధికారులు చెబుతుంటారు. అంత కచ్చితంగా జనాభా నియంత్రణ కార్యక్రమాలు చేపట్టిన చైనా ఒక్కసారిగా తన రూటు మార్చింది. 1980లో ప్రకటించిన వన్ చైల్డ్ పాలసీ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టింది. 2016లో తొలిసారి టూ చైల్డ్ పాలసీని తెచ్చింది. అది కూడా సరిపోదన్నట్టు ఇప్పుడు త్రీ చైల్డ్ పాలసీని అమలు చేస్తున్నది. జననాల రేటు(Birth Rate) పెంచడానికి దంపతులకు ప్రోత్సహకాలూ ప్రకటించింది. చైనాలోని కొన్ని ప్రావిన్స్‌లు బేబీ లోన్లూ అందిస్తున్నాయి.

వన్ చైల్డ్ పాలసీ కఠినంగా అమలైన తర్వాత చైనాలో మరో సమస్య వచ్చి పడింది. వయోధికుల సంఖ్య ఎక్కువ కావడం.. ఆ దేశంలో పని చేసే వయసు జనాభా తగ్గిపోవడం ఆర్థికంపై తీవ్ర ప్రభావం వేసే ముప్పు కనిపించింది. దీంతో యువ జనాభా పెంచడానికి మళ్లీ జననాల రేటు పెంచడంపై ఆలోచనలు చేసింది. ఇందులో భాగంగానే టూ చైల్డ్ పాలసీని చైనా ప్రభుత్వం తెచ్చింది. వన్ చైల్డ్ పాలసీ వల్ల జననాల రేటు దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా ఈశాన్య చైనాలో ఈ సమస్య ప్రబలంగా కనిపించింది. జిలిన్, లియోనింగ్, హెలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లలో జననాల రేటు తగ్గిపోయింది. ఈ ప్రాంతాల్లో చాలా మంది వలసలు వెళ్లడం.. ఉపాధి లభించే వరకు మ్యారేజ్ ప్లాన్స్ పోస్ట్‌పోన్ చేసుకోవడం వంటి నిర్ణయాలు జననాల రేటును మరింతగా కుంగదీసింది. ఈ రీజియన్‌లో 2010 కంటే 2020లో జననాల రేటు 10శాతం తగ్గిపోయింది. జిలిన్‌లోనైతే 12.7 శాతం పడిపోయింది.

Also Read: యూసి స్పెషల్ సర్వే... 70శాతం భారతీయుల ఓటు ఒక సంతానానికే

దేశీయ వినియోగం ఆధారంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను చైనా నిర్మిస్తున్నది. ఆ దేశ జనాభాకు సరిపడా ఉత్పత్తులు ఆ దేశ ప్రజలే ఉత్పత్తి చేయడం ప్రధానంగా ఉన్నది. కానీ, జననాల రేటు గణనీయంగా పడిపోవడంతో కొన్ని సంవత్సరాలపాటు యుక్త వయసు జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు సమస్య ఏర్పడలేదు. కానీ, క్రమంగా వయోధికులు పెరగడం, జననాల రేటు పడిపోయినందున యువత తగ్గిపోవడం ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి సవాలు విసిరేలా మారింది. రిటైర్‌మెంట్ వయసు పెంచడం, వర్కింగ్ అవర్స్ పెంచడం వంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది., వచ్చే తరాలకూ ఈ సమస్య కొంత కాలం ఉండనుంది. దీంతో వన్ చైల్డ్ పాలసీని 2016లో సవరించింది. అయినప్పటికీ ఈ పాలసీ మార్పుతో క్షేత్రస్థాయిలో మార్పులు కనిపించలేదు. అదే పాలసీని మరోసారి సవరించి త్రీ చైల్డ్ పాలసీకి మార్చింది.

Also Read: జనాభా నియంత్రణ చట్టాన్ని విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అయితే, త్రీ చైల్డ్ పాలసీని ప్రకటించినంత మాత్రానా ఇప్పుడు పరిస్థితులు మారేలా లేవు. అందుకు  లివింగ్ కాస్ట్ ఎక్కువ కావడం, ఎక్కువ పని గంటలు ఉండటం, విద్య, వయసు పడిన తల్లిదండ్రుల పోషణ వంటివి కొన్ని కారణాలు. ఈ దేశంలో సాంస్కృతి మార్పులు జరిగినప్పుడూ వన్ చైల్డ్ పాలసీ అమల్లో ఉంది. ఆ కారణంగా సంతానం ఒక్కరు ఉంటే చాలు అనే అభిప్రాయం చాలా మందిలో పడిపోయింది. అదేకాక, అసలు పిల్లలే వద్దు అనే అభిప్రాయాలు పెరుగుతూ వచ్చాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకునే దంపతులు పిల్లలను కంటే వారికి లోన్లు ఇస్తామని, ఇతర ప్రోత్సాహకాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించాల్సి వస్తున్నది.

click me!