రైల్లో ఎవ‌రైనా నీళ్లు ఇస్తే తాగుతున్నారా.? వెలుగులోకి కొత్త ర‌కం మోసం

Published : Aug 29, 2026, 07:48 PM IST

Hyderabad: రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకోసం వారు అనుస‌రిస్తున్న ప‌ద్ధ‌తి గురించి తెలిసి పోలీసులే షాక్‌కి గుర‌య్యారు.

PREV
14
ప్రయాణికుల‌తో పరిచయం పెంచుకుని..

పోలీసుల వివరాల ప్రకారం.. బత్త ప్రసాద్‌రెడ్డి (39), కొరపాటి నర్సింహారావు (44) రైళ్లలో ప్రయాణించే వ్యక్తులను గమనిస్తూ అదును చూసి చోరీలకు పాల్పడేవారు. గత ఆగస్టు 17న శబరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అనిల్‌కుమార్‌ను నిందితులు మాటల్లోకి దించారు. కొంతసేపు పరిచయం పెంచుకున్న తర్వాత మత్తు పదార్థం కలిపిన నీటిని అతడికి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ నీటిని తీసుకున్న తర్వాత ప్రయాణికుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అదనుగా భావించిన నిందితులు అతడి లగేజీ బ్యాగ్‌ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు దర్యాప్తులో తేలింది.

24
నిఘా పెట్టి నిందితులను పట్టుకున్న పోలీసులు

చోరీపై ఫిర్యాదు అందిన వెంటనే సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించడంతో పాటు నిందితుల కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ప్రత్యేక బృందాలు చేపట్టిన దర్యాప్తులో ఇద్దరి ఆచూకీ లభించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒప్పో మొబైల్ ఫోన్, 10 మత్తు మాత్రలు, రూ.35,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుతో పాటు నిందితులు గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

34
రైల్లో అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి

రైలు ప్రయాణాల్లో పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే ఆహారం, నీరు, ఇత‌ర డ్రింక్స్ తీసుకోవద్దని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు. ప్రయాణంలో కొత్తగా పరిచయమైన వ్యక్తులు ఎంత స్నేహపూర్వకంగా మాట్లాడినా వారి నుంచి ఆహారం లేదా పానీయం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. విలువైన నగదు, మొబైల్ ఫోన్లు, ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను ఒకే బ్యాగ్‌లో ఉంచకుండా వీలైనంత వరకు సురక్షితంగా భద్రపరచుకోవాలి. నిద్రించే సమయంలో బ్యాగ్‌ను తల కింద లేదా సీటుకు భద్రంగా కట్టుకుని ఉంచడం మంచిది.

44
అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం

ప్రయాణంలో ఎవరైనా పదేపదే ఆహారం లేదా పానీయం తీసుకోవాలని ఒత్తిడి చేయడం, అనుమానాస్పదంగా ప్రవర్తించడం, ప్రయాణికుల వస్తువులపై కన్నేయడం వంటి పరిస్థితులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ప్రయాణ వివరాలు పంచుకోకపోవడం మంచిది. తనకు లేదా తోటి ప్రయాణికులకు ఏదైనా అనుమానాస్పద ఘటన ఎదురైతే వెంటనే రైల్వే సిబ్బందికి, జీఆర్పీ లేదా ఆర్‌పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా మత్తులోకి వెళ్లినట్లు అనిపిస్తే వెంటనే రైల్వే సిబ్బంది సహాయం తీసుకోవాలి. అపరిచితుల నుంచి ఏదైనా తీసుకునే విషయంలో అప్రమత్తతే చోరీలకు గురికాకుండా ఉండేందుకు ప్రధాన రక్షణ.

Read more Photos on
click me!

Recommended Stories