
అధునాతన తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, పారిశ్రామిక ఆటోమేషన్, సెమీకండక్టర్లు, పర్యావరణహిత సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో తెలంగాణ–కిటాక్యూషు కలిసి పనిచేయాలని మంత్రి ప్రతిపాదించారు. ఒకప్పుడు భారీ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్న కిటాక్యూషు.. ప్రస్తుతం ఆధునిక తయారీ, పర్యావరణ సాంకేతికత, గ్రీన్ గ్రోత్ రంగాల్లో సాధించిన పురోగతి తెలంగాణకు ఉపయోగకరమైన అనుభవాలను అందించగలదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి చెందిన టెక్నాలజీ, స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను కిటాక్యూషు పారిశ్రామిక, ఆవిష్కరణల వ్యవస్థతో అనుసంధానించేందుకు ‘కిటాక్యూషు–తెలంగాణ టెక్నాలజీ బ్రిడ్జి’ ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల రెండు ప్రాంతాల్లోని పరిశ్రమలు, టెక్నాలజీ సంస్థలు, విద్యాసంస్థల మధ్య ప్రత్యక్ష సంబంధాలు మరింత పెరుగుతాయని తెలిపారు.
జపాన్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులను తెలంగాణ నుంచి అందించేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. కిటాక్యూషులోని కంపెనీల అవసరాలను ముందుగా గుర్తించి.. వాటికి అనుగుణంగా తెలంగాణ యువతకు నైపుణ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జపనీస్ భాష, అక్కడి పని సంస్కృతి, భద్రతా ప్రమాణాలపై శిక్షణ అందించనున్నట్లు వివరించారు.
ఈ మొత్తం ప్రక్రియను సమన్వయం చేసేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్)ను సంస్థాగత ప్లాట్ ఫామ్ గా ఉపయోగించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. కిటాక్యూషు కంపెనీల నుంచి వివిధ విభాగాల్లో ఉద్యోగ అవసరాలు, అర్హతలు సేకరించడం నుంచి అభ్యర్థుల ఎంపిక, ధ్రువపత్రాల పరిశీలన, భాషా శిక్షణ, నియామక ప్రక్రియ వరకు టామ్‌కామ్ కీలక పాత్ర పోషించవచ్చని తెలిపారు.
జపాన్ కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అధునాతన సీఎన్‌సీ మెషినింగ్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ తయారీ, తయారీ ప్రక్రియల నియంత్రణ, ఆటోమేషన్, ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించి పరిశ్రమల్లో ఉద్యోగాలకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. కిటాక్యూషు పారిశ్రామిక సామర్థ్యాన్ని తెలంగాణ యువత నైపుణ్యాలతో అనుసంధానించడం ద్వారా జపాన్ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని మంత్రి అన్నారు. తెలంగాణలో సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు కలిగిన యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని.. వారికి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని పేర్కొన్నారు.
కిటాక్యూషులోని కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. తయారీ, ఎలక్ట్రానిక్స్, మొబిలిటీ, డిజిటల్ టెక్నాలజీ, పరిశోధన–అభివృద్ధి రంగాల్లో హైదరాబాద్‌ను పెట్టుబడులకు అనుకూల కేంద్రంగా ఎంచుకోవాలని సూచించారు. తెలంగాణలో వ్యాపార విస్తరణకు ముందుకు వచ్చే జపాన్ కంపెనీలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. పెట్టుబడులతో పాటు వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక సహకారం, నైపుణ్యమున్న మానవ వనరుల లభ్యతకు అనుకూల వాతావరణం కల్పిస్తామని చెప్పారు.
కిటాక్యూషు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు జుంజీ సుడా, సెక్రటరీ జనరల్ యసుహారు హొట్టాతోనూ తెలంగాణ బృందం సమావేశమైంది. కిటాక్యూషులోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలను తెలంగాణ పారిశ్రామిక వ్యవస్థతో అనుసంధానించే అవకాశాలపై చర్చించారు. భారత్‌లో విస్తరించేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలను తెలంగాణతో అనుసంధానించాలని ఛాంబర్ ప్రతినిధులను మంత్రి కోరారు. ఛాంబర్ సభ్యులు హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ కంపెనీలు, పారిశ్రామిక పార్కులు, విద్యాసంస్థలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రతినిధులతో నేరుగా చర్చించాలని ఆహ్వానించారు.
కిటాక్యూషులోని కంపెనీల్లో తెలంగాణ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలోని ఇతర సాంకేతిక విద్యాసంస్థల విద్యార్థులకు జపాన్ పరిశ్రమల్లో ప్రత్యక్ష అనుభవం పొందే అవకాశం కల్పించాలని సూచించారు. కిటాక్యూషు కంపెనీలు భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించేందుకు ఆసక్తి చూపితే.. వాటికి తెలంగాణ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.
అలాగే డిసెంబరులో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు కిటాక్యూషు మేయర్, డిప్యూటీ మేయర్ చికాకో ఓబా, ఛాంబర్ ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు. ఈ సమావేశం ద్వారా పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిర్దిష్ట ప్రాజెక్టులను గుర్తించి.. వాటి అమలుకు కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవచ్చని తెలిపారు.
జపాన్‌లోని నగరాలు, పారిశ్రామిక సంఘాలు, కంపెనీలతో అధునాతన సాంకేతికత, ఆధునిక తయారీ, సుస్థిర పరిశ్రమలు, అంతర్జాతీయ స్థాయి నైపుణ్య మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో ఆచరణాత్మక భాగస్వామ్యాలు నెలకొల్పే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగానే కిటాక్యూషు పర్యటన చేపట్టినట్లు మంత్రి వివరించారు.