
దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి వేడుకల్లో కవాతు, శకటాల ప్రదర్శన ఎంత ఆసక్తికరంగా ఉండబోతోందో, అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా వలయం కూడా అంతే చర్చనీయాంశంగా మారింది. ఉగ్ర దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించారు.
కేవలం సీసీటీవీలు, డ్రోన్లకే పరిమితం కాకుండా, సినిమా రేంజ్‌లో ఉండే ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ధరించి పహారా కాయనున్నారు. ఈ కళ్లజోళ్లు కేవలం చూడటానికే కాదు, కంటికి కనిపించని ముప్పును పసిగట్టడంలోనూ పోలీసులకు మూడో నేత్రంలా పనిచేయనున్నాయి.
సాధారణంగా జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం పోలీసులకు కత్తి మీద సాము లాంటిది. ఈ సవాలును అధిగమించేందుకు భారతీయ టెక్ స్టార్టప్ అజ్నాలెన్స్ (Ajnalens) రూపొందించిన ఏఐ ఆధారిత కళ్లజోళ్లను పోలీసులు వినియోగిస్తున్నారు.
ఇవి సాధారణ కళ్లజోళ్లలా కనిపిస్తాయి కానీ, వీటిలో శక్తివంతమైన కెమెరాలు, సెన్సార్లు అమర్చి ఉంటాయి. సబ్-ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎంపిక చేసిన సిబ్బంది ఈ గ్లాసులను ధరించి కర్తవ్యపథ్ పరిసరాల్లోని రద్దీ ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఇవి మొబైల్ సీసీటీవీ కెమెరాల మాదిరిగా పనిచేస్తూ, లైవ్ ఫుటేజీని విశ్లేషిస్తాయి.
ఈ స్మార్ట్ గ్లాసెస్ వ్యవస్థ పనితీరు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ పోలీసుల వద్ద ఉండే నేరస్తుల డేటాబేస్‌తో కనెక్ట్స్ అయి ఉంటుంది. ఒక పోలీస్ అధికారి జనం వైపు చూసినప్పుడు, ఈ గ్లాసెస్ అక్కడి వ్యక్తుల ముఖాలను క్షణాల్లో స్కాన్ చేస్తాయి. ఇలా స్కాన్ చేసిన వ్యక్తికి ఎటువంటి నేర చరిత్ర లేకపోతే, అధికారికి మొబైల్ స్క్రీన్‌పై లేదా గ్లాసులో గ్రీన్ బాక్స్ కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి వల్ల ప్రమాదం లేదని అర్థం.
ఒకవేళ స్కాన్ చేసిన వ్యక్తి ముఖం పోలీసుల రికార్డుల్లోని నేరస్తులు, ఉగ్రవాదులు లేదా అనుమానితుల ఫోటోలతో 60 శాతం కంటే ఎక్కువ పోలి ఉంటే, వెంటనే రెడ్ బాక్స్ అలర్ట్ వస్తుంది. దీంతో పోలీసులు క్షణాల్లో అప్రమత్తమై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు.
నేరస్తులు తమ వేషధారణ మార్చుకుని పోలీసుల కళ్లు గప్పాలని చూసినా ఈ టెక్నాలజీ దగ్గర వారి ఆటలు సాగవు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సిస్టమ్ ఎంత పటిష్ఠంగా ఉందంటే.. ఒక నేరస్తుడి ఫోటో 20 ఏళ్ల క్రితం నాటిదైనా సరే, ప్రస్తుత ముఖ కవళికలను బట్టి అది పోల్చుకోగలదు. గడ్డం పెంచుకున్నా, హెయిర్ స్టైల్ మార్చుకున్నా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కచ్చితత్వంతో వారిని గుర్తిస్తుంది. ఇది పాత నేరస్తులను, పరారీలో ఉన్న నిందితులను గుర్తించడంలో గేమ్ ఛేంజర్‌గా మారనుంది.
కేవలం ముఖాలను గుర్తించడమే కాదు, ఈ గ్లాసెస్‌కు ఉన్న మరో అద్భుతమైన ఫీచర్ థర్మల్ ఇమేజింగ్. ఎవరైనా వ్యక్తులు తమ దుస్తుల లోపల కత్తులు, తుపాకులు లేదా ఇతర ఇనుప వస్తువులను దాచుకుని వస్తే, ఈ గ్లాసెస్ వాటిని పసిగట్టగలవు. సాధారణ కంటికి కనిపించని ఉష్ణోగ్రత వ్యత్యాసాలను ఇవి గుర్తిస్తాయి. దీనివల్ల భౌతిక తనిఖీలు చేయకుండానే, దూరం నుంచే అనుమానిత వ్యక్తులను గుర్తించి ప్రమాదాలను నివారించే అవకాశం పోలీసులకు లభిస్తుంది.
ఈసారి గణతంత్ర వేడుకల్లో ఆపరేషన్ సింధూర్ శకటాన్ని ప్రదర్శిస్తున్నారు. పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి ప్రతీకగా దీనిని నిలబెట్టారు. ఈ నేపథ్యంలో పాక్ నిఘా సంస్థల నుంచి హెచ్చరికలు ఉండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
సుమారు 10,000 మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉండగా, ప్రతి వాహనం మూడు అంచెల తనిఖీలను దాటుకుని రావాల్సి ఉంటుంది. ఇలాంటి అత్యంత సున్నితమైన సమయంలో, ఏఐ కళ్లజోళ్లు పోలీసులకు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, వారి పూర్తి జాతకాన్ని సెకన్ల వ్యవధిలో అధికారుల కళ్ల ముందు ఉంచే ఈ సాంకేతికత, ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో అసలైన హీరో అని చెప్పవచ్చు.