సంక్రాంతి 2023: పతంగులు ఎగరేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది.. లేదంటే?

First Published Jan 15, 2023, 1:03 PM IST

సంక్రాంతికి పండివంటలు, తీపి పదార్థాలు ఎంత స్పెషలో.. పతంగులు కూడా అంతే స్పెషల్. చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పతంగులను ఎగరేస్తూ ఉంటారు. అయితే ఈ పతంగులను ఎగరేసేటప్పుడు మనం చేసే కొన్ని తప్పుల వల్ల  ఎంతో హానీ జరగొచ్చు. 
 

మనం జరుపుకునే అతి పెద్దపండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతికి ఇంకా రెండు మూడు రోజులు ఉండగానే ప్రతి ఇంట్లో పిండి వంటలు మొదలవుతాయి. ఇకపోతే సంక్రాంతి రోజున చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పతంగులను ఎగరేస్తుంటారు. అందులోనూ పోటీలు పెట్టుకుని మరీ ఎగరేస్తుంటారు. అందరితో కలిసి ఇలా పతంగులను ఎగరేయడం మర్చిపోలేని గొప్ప అనుభూతి. ఆనందం. ఇదంతా బానే ఉన్నా.. కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పతంగులను ఎగరేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు మీ పిల్లలు సేఫ్ గా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం..

గాలిపటం ఎగురవేసే ముందు సరైన ప్రదేశాన్ని ఎంచుకోండి. పతంగులను ఎప్పుడూ కూడా బహిరంగ ప్రదేశాల్లో లేదా సురక్షితమైన ప్రదేశాల్లోనే ఎగరేయాలి. ఇవే మీరు పతంగులను ఎగరేస్తున్నప్పుడు పడిపోకుండా లేదా గాయపడకుండా ఉంచుతాయి. 
 

నిజానికి చాలా మంది ఇంటి పైకప్పుపై పతంగులను ఎగరేస్తుంటారు. కానీ పైకప్పులపై గాలిపటాలను ఎగరేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే పతంగులను ఎగరేసేటప్పుడు మీ దృష్టంతా పతంగులపైనే ఉంటంది. మేము ఎక్కుడున్నాం అన్న సంగతిని మర్చిపోతారు. దీనివల్ల కిందపడే అవకాశం ఉంది. 
 

గాలిపటాన్ని ఎత్తేటప్పుడు దాని మాంజాను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే చాలా మాంజాలు చాలా పదునుగా ఉంటాయి. ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితిలో విదేశీ మాంజాను ఉపయోగించకండి. ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయి. అలాగే చేతులను కూడా కోస్తాయి. అందుకే కాటన్ దారం మాంజాను మాత్రమే ఉపయోగించండి.
 

పతంగులను ఎగురవేసేటప్పుడు మీ చేతులకు గ్లౌజులు ధరించడమే మంచిది. ఎందుకంటే ఈ గ్లౌజులు మీరు గాలిపటం ఎగురవేసేటప్పుడు మీ చేతులకు గాయలు కాకుండా చూస్తాయి. 
 

పతంగులను ఎగరేస్తున్నప్పుడు మీతో పాటుగా మీ పక్కవాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీ గాలిపటం మరొకరి పతంగుల దారంలో ఇరుక్కుపోతే దానిని గట్టిగా లాగకండి. ఎందుకంటే ఇది అవతలి వ్యక్తికి హానికలిగిస్తుంది. మాంజాను నెమ్మదిగా లాగడమే మంచిది. 

గాలిపటాల తయారీలో కలప, ఇతర పదార్థాలను ఉపయోగిస్తారు. అందుకే ఉపయోగించిన, పాడైన పతంగులను వెంటనే చెత్తబుట్టలో  పారేయండి. ఎందుకంటే ఇది పక్షులకు, పర్యావరణానికి, మనకు హాని కలిగిస్తుంది.
 

పెద్ద ఫ్యాన్సీ గాలిపటాలకు బదులుగా చిన్న చిన్న, హ్యాండ్లింగ్ గాలిపటాలనే ఉపయోగించండి. ఇది సులువుగా ఎగురుతుంది. అలాగే మీకు ఎలాంటి హాని కలిగించదు. 

గాలిపటాలు ఎగురవేసేటప్పుడు సన్ గ్లాసెస్ ను తప్పకుండా ధరించండి. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా ఉదయం లేదా మధ్యాహ్నం గాలిపటాలను ఎగరేసేటప్పుడు సూర్యుని బలమైన కిరణాలు మీ కళ్ళకు హాని కలిగిస్తాయి.

click me!