తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే గుర్తొచ్చే పేరు పారాసెట్‌మాల్ లేదా డోలో 650. మెడికల్ షాప్‌కి వెళ్లి ఎలాంటి చిట్టీ లేకున్నా అడిగిన వెంటనే ఇచ్చే ట్యాబ్లెట్స్‌లో ఇదీ ఒకటి. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత వీటి ఉపయోగం భారీగా పెరిగింది. అయితే ఈ ట్యాబ్లెట్స్‌ను అతిగా తీసుకుంటే ప్రమాదం తప్పదని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. పారాసెట్‌మాల్ అధిక వినియోగం ఎన్నో రకాల ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
తాజాగా STADA 2023 నివేదికలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ట్యాబ్లెట్స్‌ను అతిగా వాడితే రక్తంలో ఎక్కువగా ఆమ్లం పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పారాసెట్‌మాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని STADA హెల్త్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు నొప్పులు తగ్గేందుకు మనం ఉపయోగించే ఈ ట్యాబ్లెట్స్ నొప్పులు పెరగడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
దీనినే మెడికల్ పరిభాషలో మెడికేషన్ ఓవర్‌యూజ్ హెడేక్స్‌గా చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఎక్కువగా ట్యాబ్లెట్స్ ఉపయోగించే వారిలో తలనొప్పితో పాటు డ్రగ్ ఎడిక్షన్ వంటి సమస్యలకు కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే పారాసెట్‌మాల్ వాడకం విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వారానికి రెండు సార్లకంటే ఎక్కువ పారాసెట్‌మాల్‌ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు నొప్పులు తగ్గించుకోవడానికి సహజ చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.
గుండె సమస్యలు కూడా..
ఇదిలా ఉంటే పారాసెట్‌మాల్‌ను ఎక్కువగా వాడడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని మరో పరిశోధనలో వెల్లడైంది. యూకేలోని నాటింగ్‌హాట్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీర్ఘకాలంగా పారాసెట్‌మాల్ వినియోగించిన వృద్ధుల్లో కిడ్నీ, గుండె, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 65 ఏళ్లకు పైబడిన సుమారు 1.80 లక్షల మందిని పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు.
సహజ చిట్కాలు పాటించండి..
తల, ఒళ్లు నొప్పులు వంటి వాటికి చెక్ పెట్టేందుకు ట్యాబ్లెట్స్ కంటే సహజ పద్ధతులను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తలనొప్పికి డీహైడ్రేషన్ కూడా ఒక కారణమవుతుంది. కాబట్టి తగినంత నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఒత్తిడికి దూరంగా ఉండేందుకు యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఇక తగినంత విశ్రాంతి లేకపోయినా తలనొప్పి వస్తుంది. కాబట్టి తలనొప్పి రాగానే ట్యాబ్లెట్ వేసుకునే బదులు కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఒంటి నొప్పులను దూరం చేయడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం పచ్చి అల్లం ముక్కను ఒక క్లాత్‌లో తీసుకోవాలి. అనంతరం వేడి నీటిలో అల్లం ముక్కను ఉంచి తర్వాత నొప్పులు ఉన్న చోట పట్టించాలి. ఇలా చేస్తే నొప్పులు దూరమవుతాయి. ఒంటి నొప్పులతో బాధపడేవారు రోజు రాత్రి పడుకునే ముందు పాలలో పసుపు కలుపుకుని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యులు/నిపుణుల సూచనలు, సలహాలు పాటించడమే ఉత్తమం.