ఏం చేసినా జుట్టు రాలడం ఆగుతలేదా? అయితే బాదం నూనె ఇలా పెట్టండి.. ఇక నుంచి సమస్యే ఉండదు

First Published Jan 31, 2023, 4:56 PM IST

జుట్టు ఊడటం స్టార్ట్ అయ్యిందంటే.. అది అంత సులువుగా ఆగదు. జుట్టంతా పల్చగా అయ్యిందాకా వెంట్రుకలు ఊడిపోతూనే ఉంటాయి. జుట్టు రాలడాన్ని ఆపడం చాలా కష్టమనుకుంటారు చాలా మంది. కానీ బాదం నూనెతో ఈ సమస్యను పూర్తిగా వదిలించుకోవచ్చంటున్నారు నిపుణులు. 

ప్రస్తుత కాలంలో ఒత్తైన, పొడవైన జుట్టు నూటిలో ఒకరికి మాత్రమే ఉంది. చిన్నపిల్లలు, యువత అంటూ ప్రతి ఒక్కరూ హెయిర్ ఫాల్ సమస్యను ఫేస్ చేస్తున్నారు. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలున్నాయి. ఏదేమైనా జుట్టు సంరక్షణ సరిగ్గా లేకుంటే జుట్టు ఎక్కువగా ఊడిపోయే ప్రమాదం ఉంది. అందులోనూ ఈ రోజుల్లో చాలా మంది జుట్టుకు నూనెను పెట్టడమే పూర్తిగా మర్చిపోయారు. దీనివల్ల కూడా నెత్తి పొడిబారి విపరీతంగా జుట్టు రాలుతుంది. మీకు తెలుసా నెత్తికి నూనెను పెట్టడం లేదా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను మరింత పెంచుతుంది. అలాగే మీ జుట్టు మూలాలకు పోషణ అందుతుంది. అయితే మసాజ్ ఒక్కటే ముఖ్యం కాదు. సరైన నూనెను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. జుట్టుకు మేలు చేసే ఎన్నో హెయిర్ ఆయిల్స్ ఉన్నా.. బాదం నూనె జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉందని తేలింది. మరీ జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి బాదం నూనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

బాదం నూనె జుట్టుకు చేసే ప్రయోజనాలు 

నెత్తిమీద దురదను తగ్గిస్తుంది

నెత్తిమీద మృతకణాలు పేరుకుపోవడం వల్ల ఎన్నో జుట్టు సమస్యలు వస్తాయి. దీనివల్ల జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. అలాగే జుట్టు రాలడం పెరుగుతుంది. అలాగే నెత్తిమీద చర్మం పొరలు పొరలుగా మారుతుంది. దీనివల్ల నెత్తిమీద దురద, చుండ్రు వంటి సమస్యలు వస్తాయి. నెత్తిమీద పోషణను పెంచడానికి, నెత్తిని హైడ్రేట్ గా చేయడానికి బాదం నూనె బాగా ఉపయోగపడుతుంది. ఈ జుట్టు సమస్యలను దూరం చేస్తుంది కూడా. 

Image: Getty Images

జుట్టు పునరుత్తేజానికి సహాయపడుతుంది

బాదం నూనెలో బయోటిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల మీ నెత్తికి రక్త ప్రవాహం పెరుగుతుంది. అలాగే జుట్టు మూలాలకు పోషణ అందుతుంది. దీంతో జుట్టు రాలడం ఆగుతుంది. మీ జుట్టు అందంగా మెరిసిపోతుంది కూడా. మొత్తంగా జుట్టు సమస్యలు బగా తగ్గిపోయి.. మీ జుట్టు ఆరోగ్యంగా, పొడుగ్గా పెరుగుతుంది. 
 

జుట్టు పరిమాణం మెరుగుపడుతుంది

బాదం నూనెలో విటమిన్ ఇ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టుకు మద్దతునిస్తాయని నిరూపించబడింది. ఈ పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే మీ జుట్టు పరిమాణాన్ని పెంచుతాయి కూడా. బాదం నూనె యాంటీఆక్సిడెంట్లకు శక్తివంతమైన మూలం. అంటే మీ జుట్టు చిన్నవయసులో తెల్లబడటాన్ని ఆపుతుంది. 
 


జుట్టు సమస్యలను తగ్గిస్తుంది

మీకు ఫ్రిజ్ హెయిర్ ఉందా? లేదా మీ జుట్టు ఊరికూరికే చిక్కులు పడతాయా? అలా అయితే మీరు తప్పకుండా బాదం నూనెను ఉపయోగించండి. ఎందుకంటే బాదం నూనె జుట్టును మృదువుగా చేస్తుంది. ఇది జుట్టును సిల్కీగా మార్చగలదు కూడా. ఈ నూనె కండీషనర్ గా కూడా పనిచేస్తుంది. ఈ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు దువ్వుకునేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. అంతేకాదు ఇది జుట్టు దెబ్బతినే అవకాశాన్ని తగ్గిస్తుంది.
 

ఇది హెయిర్ క్యూటికల్ ను రిపేర్ చేస్తుంది
బాదం నూనెలోని ఒలేయిక్, లినోలెయిక్ ఆమ్లాలు మీ జుట్టును బలోపేతం చేస్తాయి. మృదువుగా మారుస్తాయి. ఈ నూనెలోని విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది.  వెంట్రుకలు రెండుగా చీలె అవకాశాన్నికూడా తగ్గిస్తుంది. ఈ నూనె జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
 

జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి బాదం నూనెను ఎలా ఉపయోగించాలి?

1. బాదం ఆయిల్ హెడ్ మసాజ్

నెత్తిమీద మసాజ్  చేయడం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే మీ జుట్టు బాగా పెరుగుతుంది. శీఘ్ర ఫలితాల కోసం వారానికి రెండుసార్లు బాదం నూనెతో తలను మసాజ్ చేయండి. జుట్టుకు నూనెను పెట్టడం వల్ల జుట్టుకు, నెత్తిమీద పోషణ అందుతుంది. జుట్టు ఆరోగ్యం కూడా బాగుంటుంది. సూర్యరశ్మి, కాలుష్యం నుంచి ఈ బాదం నూనె మీ జుట్టును కాపాడుతుంది. అయితే బాదం నూనెను ఉపయోగించే ముందు బాదం నూనెను గోరువెచ్చగా వేడి చేయండి.  ఈ నూనెను మీ నెత్తికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయడం చేయండి. ఆ తర్వాత ఈ నూనెను వెంట్రుకల చివర్ల వరకు అప్లై చేయండి. 
3 నుంచి 4 గంటల తర్వాత జుట్టును కడగండి. 
 


2. బాదం ఆయిల్ హెయిర్ మాస్క్

మెంతులు చుండ్రును, జుట్టు రాలడం వంటి ఇతర జుట్టు సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ హెయిర్ మాస్క్ లోని అరటిపండు మీ జుట్టును మృదువుగా, ప్రకాశవంతం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.  ఈ హెయిర్ మాస్క్ కోసం ముందుగా మెంతి గింజలను, అరటిపండును బ్లెండర్ లో వేసి కలపండి. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ బాదం నూనె కలిపి మెత్తని పేస్ట్ లా తయారుచేసుకోండి. దీన్ని మీ నెత్తికి , మీ జుట్టంతా అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. 
 

3. బాదం ఆయిల్ సీరం

బాదం ఆయిల్ సీరంతో మీ జుట్టు బలంగా, ఒత్తుగా కనిపిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని ఆపుతుంది. ఇందుకోసం మూడు చుక్కల లావెండర్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, ఒక టీస్పూన్ బాదం ఆయిల్ ను బాగా కలగలపండి. అయితే జుట్టు ఇంకా తడిగా ఉన్నప్పుడు సీరాన్ని ఉపయోగించండి.  

click me!