ఎండాకాలంలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురుస్తుంటాయి. చిరుజల్లుల వల్ల ఎండనుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. వేడి తగ్గి చల్లగా అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.అయితే సాధారణంగా వర్షం పడుతున్నప్పుడు, ఉరుముతున్నప్పుడు, మెరుస్తున్నప్పుడు ఇంట్లోని లైట్లను ఆఫ్ చేస్తుంటారు. ఈ అలవాటు చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఈ ఉరుములు, మెరుపులతో ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.వర్షం పడుతున్నప్పుడు, ఉరుములు, మెరుపుల సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వర్షం పడుతున్నప్పుడు చాలా సార్లు ఉరుములు రావడం, మెరుపులు రావడం చాలా కామన్. కానీ ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లోని ఏసీ, టీవీ, ఫ్రిజ్ ను ఖచ్చితంగా ఆఫ్ చేసి అందులోని బ్లాక్ ను తొలగించాలి. లేదంటే ఇవన్నీ దెబ్బతినే అవకాశం ఉంది.
వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయడమే కాకుండా పిడుగుపాటు సమయంలో తప్పకుండా వైఫై ను ఆఫ్ చేయాలి. ఈ టైం లో వైఫై ఆన్ లో ఉంటే అది దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే మొబైల్ ఫోన్ ను ఛార్జింగ్ పెడితే వెంటనే ఆఫ్ చేయండి. లేదంటే పిడుగుపాటుకు గురై ఫోన్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
వర్షం పడుతున్నప్పుడు బయట పిడుగులు, ఉరుములు వస్తున్నప్పుడు ల్యాప్ టాప్ ను వాడొచ్చా? వాడకూడదా? అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. ఈ సమయంలో టీవీలను ఆఫ్ చేస్తారు కాబట్టి ల్యాప్ టాప్ ను కూడా ఆఫ్ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ మీరు ఈ సమయంలో కూడా ల్యాప్ టాప్ ను స్వేచ్ఛగా ఉపయోగించవచ్చు. కానీ దీనికి ఛార్జర్ పెట్టకూడదు.