కొత్తిమీర ఎలాంటి వంటకు అయినా రుచిని అందిస్తుంది. కమ్మని వాసన, రుచి మాత్రమే కాదు.. కొత్తిమీరను రెగ్యులర్ గా మన డైట్ లో భాగం చేసుకుంటే… చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రోజులో కొంత కొత్తిమీర తీసుకున్నా మనకు చాలా పోషకాలు అందుతాయి. అయితే.. ప్రస్తుతం మార్కెట్లో కొత్తిమీర కూడా చాలా ఖరీదు, మనం అనుకున్నంత ఫ్రెష్ గా ఉండకపోవచ్చు. కానీ.. సింపుల్ గా మనమే ఇంట్లో కొత్తిమీర పెంచుకోవచ్చు. కనీసం మట్టి కూడా అవసరం లేకుండా చేయవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మట్టి అవసరం లేకుండా మొక్కలను పెంచే పద్దతిని హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అని అంటారు. ఈ విధానం చాలా సింపుల్ గా ఉంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ పద్దతిలో ఆకుకూరలు, కూరగాయలు లాంటివి మాత్రం పెంచగలం. మరి, ఈ విధానంలో మీరు కొత్తిమీర ఎలా పెంచాలో ఇప్పుడు చూద్దాం..
మనం మనం ఈ పద్దతిలో కేవలం నీటిని ఉపయోగించి కొత్తిమీర పెంచుతాం. నీటితో పాటు దనియా గింజలు, జల్లెడలాంటి బాస్కెట్ మాత్రమే అవసరం అవుతాయి. ఈ జల్లెడ లాంటి బాస్కెట్ ని ఎప్పుడూ నీటిలోనే ఉంచాల్సి ఉంటుంది.
ముందు దనియాలను రెండు ముక్కలుగా చేసుకోవాలి. మరీ, ఎక్కువగా పిండిలా అయ్యేలా చేయకూడదు. కేవలం రెండు ముక్కలుగా బ్రేక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా ఉన్న ఓ గిన్నె తీసుకోవాలి. అందులో కూడా మంచినీరు అంటే.. ప్యూరిఫై చేసిన ఆర్వో వాటర్ అయితే మరింత మంచిది. ఇప్పుడు నీటి గిన్నె మీద జల్లెడ బుట్టను ఉంచాలి. దానిలో ఇప్పుడు దనియాల గింజలను వేయాలి. ఆ నీరు బుట్టలో గింజలకు తగులుతూ ఉండేలా చూసుకోవాలి.
ఇప్పుడు ఆ గింజలపైనా ఓ టిష్యూ పేపర్ ని తడిపి.. వేయాలి. ఇలా వేయడం వల్ల గింజల నుంచి మొలకలు త్వరగా రావడం మొదలౌతుంది. అప్పుడు టిష్యూ తీసేయాలి. ఇప్పుడు చలికాలం కాబట్టి.. కనీసం రోజులో 3 నుంచి 4 గంటలు ఎండ తగిలేలా చూసుకోవాలి. ఇలా చేస్తే చాలు తక్కువలో తక్కువ 15 రోజుల్లోనే కొత్తిమీర రావడం చూస్తారు. చాలా ఒత్తుగా వస్తుంది. మట్టి కూడా ఉండదు కాబట్టి… దీనిని కూరల్లో వాడటం చాలా సులభంగా ఉంటుంది. నీటి రంగు మారినట్లు మీకు అనిపిస్తే.. వెంటనే మళ్లీ గిన్నెలో నీరు మార్చేయాలి. అంతే.. మీరు కోరుకున్న కొత్తిమీర పెద్ద ఖర్చు లేకుండా సింపుల్ గా పెంచుకోవచ్చు. ప్రయత్నించి చూడండి.