చలికాలంలో ఉదయాన్నే లేవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

First Published Nov 18, 2022, 12:53 PM IST

నిజానికి చలికాలంలో ఇంకొంచెం సేపు పడుకోవాలనిపిస్తుంది. ఉదయం చలికి అసలే లేవాలనిపించదు. కానీ ఈ సీజన్ లో ఉదయం పొద్దున్న నిద్రలేవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 
 

ఇతర కాలాలతో పోల్చితే.. చలికాలంలో ఇంకొంచెం సేపు పడుకోవాలనిపిస్తుంది. కారణం చలి. చల్లని గాలుల వల్ల బెడ్ మీద నుంచి అస్సలు లేవాలనిపించదు. అందుకే చాలా మంది ఉదయం 7 నుంచి 8, 9 గంటలకు నిద్రలేస్తుంటారు. చలికాలంలో చాలా మంది సోమరులుగా మారుతుంటారు. నిజానికి ఇలా ఎక్కువ సేపు పడుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సీజన్ లో కూడా కాస్త ఓపిక తెచ్చుకుని పొద్దున్న 5 నుంచి 6 గంటల మధ్య లేస్తే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా మీ శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటాయి. మీ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇంతకీ ఉదయం తొందరగా నిద్రలేవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

నచ్చిన పనులను చేయొచ్చు

ఉదయం కాస్త తొందరగా నిద్రలేవడం వల్ల మీకు చాలా సమయం ఉంటుంది. దీంతో మీరు మీకు నచ్చిన పుస్తకాలను చదవొచ్చు. డాన్స్ చేయొచ్చు. యోగా వంటివి మీకు ఏది నచ్చితే ఆ పనులను చేసే అవకాశం ఉంటుంది. ఉదయం వ్యాయామం చేయడం వల్ల మీ బాడీ ఫిట్ గా ఉంటుంది. ఎన్నో జబ్బులొచ్చే అవకాశం తగ్గుతుంది. అన్నింటికీ మించి మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. 
 

జీర్ణక్రియ బలంగా ఉంటుంది

ఉదయమే లేచి పరిగడుపుతో వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ఆరోగ్యంగా  ఉంటుంది. ఉదయమే లేచి వ్యాయామం చేయడం వల్ల శరీర అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా శరీరంలో కేలరీలు చాలా వరకు తగ్గిపోతాయి. దీంతో మీరు అధిక బరువు, ఊబకాయం నుంచి బయటపడతారు. 
 


ఆరోగ్యకరమైన శరీరం

ఉదయాన్నే నిద్రలేచే వారికి చాలా సమయం ఉంటుంది. దీంతో ప్రతి పనికి తగిన సమయం కేటాయిస్తారు. ముఖ్యంగా పొద్దు పొద్దున్న నిద్రలేవడం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉండదు. పనులు చకాచకా అయిపోతాయి. మీకు తెలుసా.. పొద్దున్న తొందరగా నిద్రలేచేవారు సానుకూలంగా ఆలోచిస్తారట. ఉదయమే నిద్రలేవడం వల్ల వెంటనే పనులను చేయడానికి హాడావుడి పడాల్సిన అవసరం ఉండదు. టైం లోపలే అన్ని పనులను పూర్తి చేసుకోగలుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలా నిద్రలేచే వారి శరీరం, మనస్సు ఇతరుల కంటే ఆరోగ్యంగా ఉంటాయి. 
 

పనితీరు మెరుగ్గా ఉంటుంది

ఉదయం తొందరగా లేస్తే ఎక్కువ సమయం ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఇతరుల కంటే పనులను భిన్నంగా, మెరుగ్గా చేస్తారు. పాఠశాల, కాళాశాల, ఆఫీసులకు వెళ్లేవారు తొందరగా మేల్కొంటే పనితీరు బాగుంటుంది. వీళ్లు తమ పనిని మెరుగ్గా చేస్తారట. 
 

బరువు తగ్గుతారు

ఉదయాన్నే మేల్కొని కొద్ది సేపు వ్యాయామం చేసి.. డిటాక్స్ డ్రింక్ తాగి.. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ను తింటే బరువు తగ్గడం చాలా సులువు అవుతుంది. ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజూ ఉదయం లేచి కాసేపు వ్యాయామం చేయండి. చక్కటి ఫలితం ఉంటుంది.   
 

click me!