షుగర్ పేషెంట్లు సిగరేట్ తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published Dec 26, 2022, 11:59 AM IST

షుగర్ పేషెంట్లు స్మోకింగ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడంతో పాటుగా ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. 
 

స్మోకింగ్ చేస్తే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. స్మోకింగ్ చేయని వారితో పోల్చితే స్మోకింగ్ చేసేవారికి ఈ ప్రమాదం 30% నుంచి 40% వరకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మీకు ఇప్పటికే డయాబెటిస్ ఉంటే.. స్మోకింగ్ అలవాటును వెంటనే మానుకుంటే మంచిది. ఎందుకంటే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. సిగరెట్లలోని రసాయనాలు శరీర కణాలకు హాని కలిగిస్తాయి. అలాగే సాధారణంగా పనిచేసే వాటి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవి శరీరంలో మంటను కలిగిస్తాయి. సిగరేట్ కాల్చడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. మూత్రపిండాలు దెబ్బతింటాయి.  అలాగే డయాబెటీస్  క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి  రోగాలతో పాటుగా ఎన్నో రకాల  క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అసలు మధుమేహులు సిగరేట్ కాల్చడం వల్ల వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

రక్తంలో చక్కెరను పెంచుతుంది

డయాబెటీస్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ స్మోకింగ్ చేస్తే.. ఆ పని మరింత కష్టంగా మారుతుంది. ఎందుకంటే స్మోకింగ్ శరీరం ఇన్సులిన్‌కు మరింత నిరోధకతను కలిగిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో లేకపోతే మీ మూత్రపిండాలు, గుండె , రక్తనాళాలతో సహా మధుమేహం నుంచి తీవ్రమైన సమస్యలు వస్తాయి. 
 


గుండె, రక్తనాళాలకు హాని కలిగిస్తుంది

మధుమేహం లాగే ధూమపానం మీ హృదయనాళ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. ఇది ప్రాణాంతకం కావొచ్చు. డయాబెటిస్‌తో బాధపడుతున్న 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలలో కనీసం 68 శాతం మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ట్రస్టెడ్ సోర్స్ నివేదించింది. మరో 16 శాతం మంది స్ట్రోక్‌తో మరణిస్తున్నారట. మీకు మధుమేహం ఉంటే.. ఈ సమస్య లేని వ్యక్తుల కంటే మీకే గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ పెరుగుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
 


శ్వాసకోశ వ్యాధులు వస్తాయి

స్మోకింగ్ నేరుగా మీ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలిక బ్రోన్కైటిస్, ఎంఫిసెమా, ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. ఈ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. మీకు డయాబెటిస్ ఉంటే ఈ ఇన్ఫెక్షన్లు మీకు ప్రమాదకరంగా మారతాయి. లేకపోతే మీరు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే ఛాన్స్ ఉంది. దీని నుంచి కోలుకోవడం చాలా కష్టం. ఆరోగ్యం బాగాలేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ట్రస్టెడ్ సోర్స్ ప్రకారం.. మధుమేహం ఉన్నవారు.. లేనివారితో పోల్చితే.. వీరు న్యుమోనియాతో చనిపోయే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

మీ కళ్ళను దెబ్బతీస్తుంది

షుగర్ పేషెంట్లకు కంటిశుక్లం, గ్లాకోమాతో సహా ఎన్నో కంటి వ్యాధులొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుకోకపోతే.. డయాబెటిక్ రెటినోపతి సమస్య వస్తుంది. ఈ స్మోకింగ్ డయాబెటిక్ రెటినోపతి సమస్య తొందరగా వచ్చేలా చేస్తుంది. అంతేకాదు ఈ సమస్యను మరింత పెద్దదిగా చేస్తుంది. ఇది చివరికి అంధత్వానికి దారి తీస్తుంది.
 

ప్రమాదాన్ని తగ్గించడానికి  ఏమి చేయాలంటే? 

ఈ సమస్యల ప్రమాదాల్ని తగ్గించాలంటే స్మోకింగ్ ను ఖచ్చితంగా మానేయాలి. అలాగే పొగాకు ఉత్పత్తులను ఉపయోగించకండి. నిజానికి స్మోకింగ్ కు అలవాటు పడితే.. దాన్ని మానేయడం చాలా కష్టం. కానీ ఇది మీకు ఎన్నో ప్రాణాంతక రోగాలొచ్చేలా చేస్తుంది. అందుకే ఈ అలవాటును నెమ్మదిగా అయినా మానుకోవడం చాలా మంచిది. ఒకవేళ ఎలా మానుకోవాలో తెలియకపోతే స్నేహితులు, కుటుంబ సభ్యుల సలహాను తీసుకోండి. అవసరమైతే డాక్టర్ ను సంప్రదించండి. 

click me!