
వరి పుట్టుక, మానవ సమాజంపై దాని ప్రభావం గురించి లండన్ యూనివర్సిటీ కాలేజీ పురావస్తు శాస్త్రవేత్త డోరియన్ క్యూ ఫుల్లర్ అధ్యయనం చేశారు. ఆయన పరిశోదనలో వరి పంట, దానినుండి వచ్చే బియ్యంకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
ఫుల్లర్ పురావస్తు, వృక్ష శాస్త్రవేత్త. తవ్వకాల్లో దొరికిన మొక్కల అవశేషాలను, పంటలు, కలుపు మొక్కలు, అడవి ఆహారం, వంట చెక్కలను అధ్యయనం చేస్తారు. దీని ద్వారా గత సంస్కృతుల్లో ఏ పంటలు ఉన్నాయి… వ్యవసాయం, మొక్కలు, మానవ ఆహారం ఎలా మారాయి అని పరిశీలిస్తారు.
పుల్లర్ ప్రకారం ప్రపంచంలో రెండు రకాల వరి వంగడాలు ఉన్నాయి. ఆఫ్రికా వరి పశ్చిమ ఆఫ్రికాలో విడిగా పెరిగింది. ఆసియా వరి ఇండియా, చైనా, జపాన్‌లలో పండిస్తారు. ఆసియా వరిలో 'ఇండికా', 'జపోనికా' రకాలున్నాయి. 'ఇండికా' దక్షిణాసియాలో, 'జపోనికా' తూర్పు ఆసియాలో ఎక్కువ.
వరి మొదట చైనాలో పండించారు. అది జపోనికా రకం. యాంగ్జీ నది, హునాన్, జెజియాంగ్ ప్రాంతాల్లో 10,000 ఏళ్ల క్రితం వరి పండించిన ఆధారాలున్నాయి. ఉత్తర భారతంలో గంగా నది ప్రాంతంలో అడవి వరి వాడకంలో ఉండేది. 5,000 నుండి 9,000 ఏళ్ల క్రితం పండించే అవకాశం ఉందంటున్నారు.
తూర్పు ఆసియా జపోనికా, భారత అడవి వరి మధ్య వేల ఏళ్ల క్రితం సంకరం జరిగిందని DNA పరిశోధనలు చెబుతున్నాయి. తూర్పు ఆసియా నుంచి వ్యాపారం ద్వారా భారత్‌కు వచ్చిన వరి, స్థానిక రకాలతో కలిసి ఇండికా వరిని ఏర్పరిచింది. ఈ సంకరం 4,000 ఏళ్ల క్రితం వ్యాపారం ద్వారా వరి భారత్‌కు వచ్చినప్పుడు జరిగి ఉండొచ్చు అని ఫుల్లర్ అంటున్నారు.
వరి సాగు ప్రపంచాన్ని మార్చింది. గోధుమ, రాగుల లాగా కాకుండా వరికి ఎక్కువ నీరు కావాలి... అందుకే మొదట యాంగ్జీ, గంగా నదుల లాంటి నీటి ప్రాంతాల్లో వరి పండించారు. తర్వాత నీటిపారుదల ఉన్న ప్రాంతాలకూ వరి సాగు విస్తరించింది. కాలువలు తవ్వి, వర్షపు నీటిని నిల్వ చేసే పొలాలు ఏర్పడ్డాయి. ఇది పెద్ద మార్పు.
సమాజంపై ప్రభావం:
పొలాలు, నీటిపారుదలకు ఎక్కువ శ్రమ అవసరం. నీటిపారుదలతో వరి దిగుబడి పెరిగి చాలా మందికి ఆహారం దొరికింది. భారత్, ఆగ్నేయాసియాలో వరి సాగు విస్తరించింది. జనాభా పెరుగుదల, నగరాలు, సామాజిక వ్యవస్థలకు దారితీసింది. భూమి, వరి, నీటిపారుదలపై ఆధిపత్యం సామాజిక వ్యవస్థలకు కారణమైంది.
జంతువులపై ప్రభావం:
వరి పొలాలకు దున్నపోతులు బాగా సరిపోయాయి. దున్నలు భారతదేశ జంతువులు. హరప్పా కాలంలోనే వాటిని పెంచుకునేవారు. వరి సాగు పెరగ్గా, దున్నల వాడకం పెరిగింది. వరి పొలాలు చేపలను ఆకర్షించాయి. ఆగ్నేయాసియాలో కొన్ని చేపలు ఆహారంగా మారాయి. వరి పొలాల్లో చేపల పెంపకం పెరిగింది.
వరి సాగు, నగరాలు గంగా మైదానంలో ఇనుప యుగంలో అంటే 3,000 ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. చేతిపనులు అభివృద్ధి చెందాయి. మట్టికుండలు, రాళ్లు, పూసలు, లోహపు వస్తువులు తయారయ్యాయి. వీటిని దూర ప్రాంతాలకు ఎగుమతి చేశారు.
భారత్, ఆగ్నేయాసియా మధ్య సంబంధాలు అప్పుడే మొదలయ్యాయి. ఆగ్నేయాసియాలో భారతీయ మట్టికుండలు, పూసలు, పెసలు, కందిపప్పు లాంటివి దొరికాయి. తర్వాత బౌద్ధ, హిందూ మతాలు ఆగ్నేయాసియాకు వ్యాపించాయి. కానీ మొదటి సంబంధం వరి సాగు, చేతిపనుల ద్వారా ఏర్పడింది అని ఈ అధ్యయనం చెబుతోంది.
చైనాలోని టియాన్లుషాన్ ప్రదేశంలో 2004లో ఫుల్లర్ పరిశోధన చేశారు. అక్కడే వరి గింజను మొక్కకు కలిపే చిన్న భాగాన్ని మొదట కనుగొన్నారు. ఇది సాగు వల్ల మారిన ముఖ్యమైన ఆకారం. ముందు వరి దానంతట అదే వ్యాపించేది. ఇప్పుడు మనుషులే నాటి, కోయాలి. అక్కడ దొరికిన వరి గింజలను చూస్తే అడవి వరి నుంచి సాగు వరి ఎలా మారిందో అర్థమవుతుంది.
2006లో ఉత్తరప్రదేశ్‌లోని లహురదేవా ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడి ప్రజలు 6,000 ఏళ్ల క్రితమే బియ్యాన్ని ఆహారంగా తినేవారని తెలిసింది. కానీ అది సాగు వరియా, అడవి వరియా అనే చర్చ కొనసాగుతోంది.
వరి పొలాల నుంచి మీథేన్ వాయువు వస్తుంది కాబట్టి వరి వాతావరణ మార్పుకు కారణం అనే వాదన ఉంది. అయితే మీథేన్ వరి నుంచి రాదు తడి నేలల్లోని సూక్ష్మజీవుల నుంచి వస్తుంది. వాతావరణ మార్పుకు ప్రధాన కారణం శిలాజ ఇంధనాల వాడకమే. మీథేన్ తగ్గించే వరి సాగు పద్ధతులపై పరిశోధనలు జరుగుతున్నాయి.
వాతావరణ మార్పు వర్షపాతాన్ని మారుస్తోంది. ఇది వరి సాగుకు సవాలు… ఎందుకంటే నీటి కొరత, వర్షాభావం పెరగొచ్చు. కాబట్టి రాగుల లాంటి వర్షాభావాన్ని తట్టుకునే పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇప్పటి వరి, పాత వరి:
ఇప్పటి వరి, పాత వరిలో కొన్ని మార్పులున్నాయి. అడవి వరి ఎర్రగా ఉండేది. ఇప్పుడు తెల్ల, బ్రౌన్ బియ్యంతో పోలిస్తే ఎర్ర వరి తక్కువ. తెల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది, వేరే రుచి ఉంటుంది అని కొన్ని రకాలను ఎంచుకున్నారు. బాస్మతి, మల్లె వంటి రకాలు ఎంచుకున్నారు. మనుషులు అడవి వరిని, వేర్వేరు సంస్కృతులకు తగ్గట్టుగా మార్చారు.