మన ఆరోగ్యం గురించి శరీరం ప్రతిరోజూ చిన్న చిన్న సంకేతాలు ఇస్తూనే ఉంటుంది. కానీ మనమే వాటిని పెద్దగా పట్టించుకోము. ముఖ్యంగా నాలుక చాలా సంకేతాలు ఇస్తుంది. నాలుక రంగు, దానిపై పూత, తడి, పొడి వంటి విషయాలు మన ఆరోగ్య స్థితిని ప్రతిబింబిస్తాయి.
సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నాలుక లేత గులాబీ రంగులో, తడిగా, మృదువుగా ఉంటుంది. కానీ నాలుక రంగు, ఆకారం, పైపైన ఉండే పొర లేదా పూతలో మార్పులు వస్తే అవి శరీరంలో ఉన్న కొన్ని వ్యాధులను లేదా లోపాలను సూచిస్తాయి. నాలుకు రంగు ఎలా మారితే ఏ వ్యాధి ఉన్నట్లో ఇక్కడ తెలుసుకుందాం.
26
లేత గులాబీ రంగు నాలుక
నాలుక లేత గులాబీ రంగులో, తడిగా, సున్నితంగా ఉంటే అది మంచి రక్త ప్రసరణ, సరైన జీర్ణక్రియకు సూచన. అంతేకాదు శరీరంలోని ద్రవాలు కూడా సమతుల్యంగా ఉన్నట్లు అర్థం. నాలుక ఈ రంగులో ఉన్నవారు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు. నాలుకపై లైట్ గా తెల్లటి పలచని పూత ఉండటం సాధారణం.
ఎక్కువ తెలుపు రంగు నాలుక
నాలుక ఎక్కువ తెల్లగా కనిపిస్తే లేదా దానిపై మందపాటి తెల్ల పూత ఉంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్, లేదా జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం, నీరు తక్కువగా తాగడం, లేదా లివర్ పనితీరులో లోపం వంటి వాటిని సూచించవచ్చు. కొన్నిసార్లు మధుమేహం ఉన్నవారికి కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. తెల్లటి పూత చాలా మందంగా ఉండి, వాసన వస్తే అది నోటి పరిశుభ్రత లోపాన్ని కూడా సూచిస్తుంది.
36
ఎరుపు రంగు నాలుక
నాలుక ఎక్కువ ఎరుపు రంగులో కాంతివంతంగా కనిపిస్తే అది విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ లేదా ఐరన్ లోపాన్ని సూచించవచ్చు. అలాగే శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు లేదా డీహైడ్రేషన్ సమస్య ఉన్నప్పుడు కూడా నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది.
గాఢ ఎరుపు రంగు లేదా ఊదా రంగు నాలుక
నాలుక గాఢ ఎరుపు లేదా ఊదా రంగులో కనిపిస్తే అది రక్తప్రసరణ లోపం, ఆక్సిజన్ సరఫరా తగ్గడం, లేదా గుండె సంబంధిత సమస్యలను సూచించవచ్చు. కొన్నిసార్లు ఇది రక్తపోటు ఎక్కువగా ఉన్నవారిలో కూడా కనిపిస్తుంది.
నాలుక పసుపు రంగులో కనిపిస్తే లేదా పసుపు రంగు పూత ఉంటే అది లివర్ సమస్యకు సూచన. జీర్ణాశయంలో ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు నాలుక పసుపు రంగులోకి మారుతుంది. పసుపు పూతతో పాటు చేదుగా అనిపించడం, నోటి నుంచి వాసన రావడం, వాంతి భావన ఉండటం వంటి లక్షణాలు ఉంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
నలుపు లేదా గోధుమ రంగు నాలుక
కొన్నిసార్లు నాలుక నలుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తే అది మందుల సైడ్ ఎఫెక్ట్స్, బాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. కాఫీ, టీ అధికంగా తీసుకోవడం వల్ల కూడా నాలుక ఈ రంగులోకి మారవచ్చు. ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు కానీ నోటి పరిశుభ్రతను మెరుగుపరచుకోవడం మంచిది.
56
బూడిద రంగు లేదా తెల్ల మచ్చలు
నాలుకపై బూడిద రంగు లేదా తెల్లటి మచ్చలు ఉంటే అది ల్యూకోప్లాకియా అనే పరిస్థితికి సూచన కావచ్చు. ఇది ముఖ్యంగా పొగ తాగే అలవాటు ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇలాంటి మచ్చలు త్వరగా పోకపోతే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇవి కొన్ని సందర్భాల్లో నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు కావచ్చు.
నీలిరంగు నాలుక
నాలుక నీలం లేదా సైనోసిస్ రంగులో ఉంటే అది శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిందని సూచిస్తుంది. ఇది హృదయ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు (ఉదా: ఆస్థమా, COPD), లేదా రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వలన కూడా వస్తుంది. ఇది తక్షణ వైద్య సాయం అవసరమైన పరిస్థితి.
66
చిట్లిన నాలుక
నాలుకపై చిన్న చిన్న పగుళ్లు లేదా చిట్లినట్లుగా కనిపిస్తే అది డీహైడ్రేషన్, విటమిన్ B లోపం కావచ్చు. లేదా బలహీనమైన జీర్ణక్రియను సూచించవచ్చు. కొందరికి ఇది సహజ లక్షణం కావచ్చు. కానీ నొప్పి లేదా ఇన్‌ఫెక్షన్ ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
పూత లేని మెరిసే నాలుక
నాలుక పూత లేకుండా మెరిసిపోతూ ఉంటే, రక్తహీనత లేదా విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపాన్ని సూచిస్తుంది. ఇది జీర్ణశక్తి తగ్గడం, అలసట, నిస్పృహ, నోటి గాయాలు వంటి లక్షణాలతో కలిసి కనిపించవచ్చు. పైన చెప్పిన ఏ లక్షణాలున్నా తీవ్రతను బట్టి వైద్యులను సలహా తీసుకోవడం మంచిది.